ఎక్కడి బస్సులు అక్కడే | Buses stop where ever there | Sakshi
Sakshi News home page

ఎక్కడి బస్సులు అక్కడే

Published Wed, Aug 14 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

Buses stop where ever there

కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఆందోళనల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్లు సీమాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులివ్వడంతో స్థానిక సంఘాలు మంగళవారం ఆందోళన బాటపట్టాయి. జిల్లాలోని 11 డిపోల్లో 970 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
 
 సోమవారం వివిధ రూట్లలో వెళ్లిన దూర ప్రాంత సర్వీసులను రాత్రికి రాత్రే డిపోలకు రప్పించారు. నైట్ అవుట్ సర్వీసులను రద్దు చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్, శ్రామిక్, ఎలక్ట్రికల్ సిబ్బందితో పాటు కార్యాలయ సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో కర్నూలు రీజియన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఒకే రోజు ఆర్టీసీ ఆదాయానికి కోటి రూపాయలు పైగా నష్టం వాటిల్లిందని డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వెంకటరామం తెలిపారు. బస్సుల బంద్‌తో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
 
 హైదరాబాద్, గుంతకల్, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, చెన్నై ఎగ్మోర్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిశాయి. ఇదిలాఉండగా రాష్ట్ర విభజనను నిరసిస్తూ కార్మిక సంఘాలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించాయి. ఆందోళనల్లో ఎన్‌ఎంయూ నాయకులు మధుసూధన్, మద్దిలేటి, ఇస్మాయిల్ మద్దయ్య, నజీర్, సింగ్.. ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మజీద్, ఎల్లన్న, ఎ.వి. రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు ఎం.. కుమార్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు రవికుమార్‌లు సమ్మెకు మద్దతు ప్రకటించి ఆందోళనల్లో పాల్పంచుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement