job holders
-
ఉద్యోగంకి వెళ్లకపోయినా.. డబ్బు తీసుకోవచ్చు
న్యూఢిల్లీ : హఠాత్తుగా ఉద్యోగం కోల్పోయిన వారిని ఆదుకునేదిశగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) త్వరలో తీపికబురు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగి రెండు నెలలపాటు ఖాళీగా ఉండాల్సి వస్తే.. అతడి ఖాతాల నుంచి పాక్షికంగా కొంత సొమ్మును తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారని సమాచారం. దీనిపై వడ్డీ కూడా ఉండబోదని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఈ నెల 13న నిర్వహించబోయే కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పాయి. దీనికి అనుసరించవలసిన విధానాలను కూడా చర్చిస్తారని పేర్కొన్నాయి. ఈ పాక్షిక ఉపసంహరణ కేవలం ఒకసారి మాత్రమే అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాక్షికంగా తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించే అవకాశాన్ని కల్పించాలా? వద్దా? అనే అంశంపై కూడా చర్చ జరుగుతుందని సమాచారం. -
విభజన నిర్ణయంపైమలి పోరు
నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె ఉద్యమ కార్యాచరణ వెల్లడి ఉద్యమించకుంటే టార్గెట్ చేస్తామని ఎంపీలకు హెచ్చరిక సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మలివిడత ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి, ఏపీ ఎన్జీవోలు తమ కార్యాచరణ ప్రకటించారు. మంగళవారం ఏపీ ఎన్జీవో హోంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ శాసనసభలో నిర్ద్వంద్వంగా తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సమయంలో ఉద్యమం కోసం ప్రజలు, సమైక్యవాదులు, ఉద్యోగ వర్గాల నుంచి తమపై ఒత్తిడి పెరిగిందని చెప్పారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ కాదన్న ఉద్దేశంతోనే మరోమారు సమ్మెకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. గతంలో 66 రోజుల సమ్మెను విజయవంతం చేసినట్లే ఈసారీ సహకరించాలని కోరారు. ఎన్నికల విధులు సహా అన్నింటినీ బహిష్కరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన సీమాంధ్ర మంత్రులు, ఎంపీల సమావేశానికి అవిశ్వాసం పెట్టిన ఆరుగురు ఎంపీలను పిలవకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎంపీలు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నట్లుగానే మిగిలిన ఎంపీలు కూడా ఉద్యమించకపోతే వారిని లక్ష్యంగా చేసుకుని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఎండీ ఇక్బాల్, అక్కినేని భవానీప్రసాద్, పీ శ్రీనివాసరావు (వాసు), కె.మధుసూదనరాజు, కె.బలరామ్, సీహెచ్ శ్రీనివాసరావు, డి.సత్యనారాయణరెడ్డి, కోనేరు రవి, వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు ఆర్టీసీ కార్మికులు దూరం ఏపీ ఎన్జీవోల మలిపోరుకు ఆర్టీసీ కార్మికులు దూరంగా ఉండాలని నిర్ణయించారు. 66 రోజుల తర్వాత ఉద్యమాన్ని కొనసాగించే బాధ్యత రాజకీయ పక్షాలకు అప్పగించిన తర్వాతే సమ్మె విరమించామని ఆర్టీసీ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. 66 రోజుల పాటు చేసిన సమ్మె కారణంగా ఆర్టీసీ పూర్తిగా నష్టాల బాటలోకి వెళ్లింది. దీంతో మలిపోరుకు కార్మికులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు పోటీగా ఉన్న ప్రైవేటు బస్సులపై ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో ఆర్టీసీ గాడిన పడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సమ్మెలోకి వెళ్తే ప్రైవేటు బస్సులను అనుమతించినట్లు అవుతుందని కార్మికసంఘాలు భావిస్తున్నాయి. తమకు సంస్థను రక్షించుకోవడం కూడా ప్రధానం కాబట్టి సమ్మెకు దూరంగా ఉంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ నేత వైవీరావు, ఎన్ఎంయూ నేత రావి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న ప్రతి ఆందోళనకూ తాము అండగా నిలబడతామని, అన్ని ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణ ఇలా... 7న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి 7, 8 తేదీలలో ఎంపీల ఇళ్ల ముట్టడి 9న సమైక్య పరుగు 17న చలో ఢిల్లీ కార్యక్రమం రైలురోకో, రాస్తారోకోలు, రోడ్ల దిగ్బంధనం వంటి కార్యక్రమాలకు త్వరలో కార్యాచరణ అవసరమైనపుడు బ్రహ్మాస్త్రంగా ఉపయోగించేలా విద్యుత్ ఉద్యోగుల సమ్మె -
ఉద్యోగంలోంచి తోలగించిన ప్రభుత్వం
-
13 ఏళ్లుగా పనిచేసినా కనీస వేతనం లేదు..
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కార్మికులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీస వేతనాలు కరువై, కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా చితికిపోతున్నారు. అనారోగ్యం పాలైనా, ఆపదొచ్చినా వారిని యజమానులు ఆదుకోవడం లేదు. ఒక్కరోజు పనికి వెళ్లక పోయినా ఇచ్చే వేతనం నుంచి కోత విధిస్తున్నారు. ఆదివారం కూడా యజమానులు పనిచేయించుకుంటున్నారు. తమ సమస్యలు కార్మిక శాఖాధికారులకు చెబుతామన్న తమను యజమానులు ఉద్యోగం నుంచి తొలగిస్తారని భయపడుతున్నారు. కార్మిక శాఖాధికారులు కూడా కార్మికుల జీవితాలు, వారి సమస్యలపై దృష్టి సారించిన దాఖ లాలు లేవు. జిల్లాలో కార్మికులు 60 వేల పైనే.. జిల్లాలో కార్మిక శాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రర్ చేయించుకున్న వస్త్ర, వ్యాపార, వాణిజ్యం, హేయిర్ కట్టింగ్, టైలరింగ్, కిరాణం, ఫ్యాక్టరీలు, ఇతర దుకాణాలు జిల్లా వ్యాప్తంగా 11 వేల పైచిలుకు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోని దుకాణాలు ఐదు వేలపైనే ఉంటాయి. వీటిలో మేనేజర్ స్థాయి నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు 60 వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు షాపులు తీసి రాత్రి 9 గంటల ప్రాంతంలోగా మూసేయాలని కార్మికశాఖ చెబుతోంది. మధ్యలో భోజనం, విశ్రాంతి కోసం గంటన్నర సేపు సమయం ఇ వ్వాలని ఉంది. అంటే రోజుకు 13 గంటలు షా పులు నిర్వహిస్తుండడంతో కార్మికులు ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయలుదేరి యజమానులు రాకముందే షాపులకు చేరుకుంటారు. షాపులు మూసేవరకు అందుబాటులో ఉంటారు. ఇక ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వర్కర్లు, సెక్యూరిటీ గార్డులైతే రోజుకు 8 నుంచి 10 గంటల వరకు విధులు నిర్వర్తిస్తుంటారు. పండుగలు, పెళ్లిళ్ల సమయాల్లో దర్జీలు 18 గంటలు పనిచేస్తుంటారు. ప్రతి ఆదివారం విశ్రాంతి దొరకడం కార్మికులకు కష్టమైంది. అమలుకు నోచుకోని చట్టాలు కార్మికులు పనిచేస్తున్న సంస్థలు, పనిభారం, ప్రాంతాలను బట్టి కార్మికశాఖ వీరికి వేతనాలు నిర్ణయించింది. స్వీపర్ మొదలు మేనేజర్ స్థాయి వరకు 59 కేటగిరీల్లో కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి. గ్రేడ్-1 మున్సిపల్ పరిధిల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు రూ.6,208 నుంచి రూ.8,065 (హోదాను బట్టి) ఇవ్వాలి. గ్రేడ్-2 మున్సిపాలిటీలు, మండలాల్లో పనిచేసే వారికి రూ.5,878 నుంచి రూ. 7,865 ఇవ్వాలని 2007లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 116, కార్మిక చట్టం చెబుతోంది. ఏటా సెప్టెంబర్, మార్చి నెలల్లో వేతనాలు పెంచాలని ఆ చట్టం చెబుతుంది. కానీ జిల్లాలో ఎక్కడా కార్మిక శాఖ నిర్ణయించిన వేతనాలు కార్మికులకు అందడం లేదు. ఏళ్ల తరబడి ఒకే వేతనంతో పనిచేస్తున్న కార్మికులున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని షాపులపై చర్యలు తీసుకోవడంలోనూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో 1 నుంచి 14 వార్డు వరకు, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో కేవలం 450 షాపు యజమానులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. జిల్లాలో పని చేస్తోన్న కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిర్యాదు చేయడం లేదు.. - రవీందర్, సహాయ కార్మిక అధికారి, సర్కిల్-2, మంచిర్యాల సాధారణ తనిఖీల్లో భాగంగా మేం షాపులకు వెళ్తుంటాం. ఆ సమయంలో యజమాని పనిలో నుంచి తీసేస్తాడని కార్మికులు సమస్యలు చెప్పరు. పనిలో నుంచి వెళ్లిన తర్వాత వచ్చి ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి వారికీ న్యాయం చేస్తున్నాం. పదేళ్ల షాపులో పని చేసి విరమిస్తే.. ఐదు నెలల వేతనం ఇప్పిస్తున్నాం. మా వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న షాపుల్లో పనిచేసే కార్మికుల పిల్లల చదువుకు ఉపకార వేతనాలు, ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.5 వేల నగదు అందిస్తున్నాం. అనారోగ్యం పాలైతే చికిత్స కోసం ఎలాంటి సహాయం అందించలేం. -
అదే హోరు
సాక్షి, కడప : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో 15 రోజులుగా ఉద్యమం సాగుతోంది. సమైక్య సమ్మెలో సకల జనులు చేయి కలుపుతూ ఉద్యమాన్ని రోజురోజుకు పతాక స్థాయికి చేరుస్తున్నారు. ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో ఉద్యమానికి మరింత ఊపొచ్చింది. జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, మానవహారం, ధర్నాలు, విచిత్ర వేషధారణలతో ఎక్కడికక్కడ పల్లెజనాలు జాతీయ రహదారులపై కంచె వేసి వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. వినూత్నరీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో రవాణా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. మొత్తం మీద జిల్లాలో ఉద్యమ నిరసన కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు ర్యాలీలతో తరలి వస్తుండడంతో కలెక్టరేట్ పరిసరాలు జన సంద్రమవుతున్నాయి. కలెక్టరేట్ వద్ద జేఏసీ, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు రోడ్లపైనే యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో వంటా వార్పు చేపట్టారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్, ది కడప కిరాణా మర్చంట్ అసోసియేషన్, కడప ఫుడ్గ్రేయిన్ మర్చంట్ అసోసియేసన్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం, ఏపీ రాష్ట్ర పోలీసు మినిస్ట్రీరియల్ స్టాఫ్, దేవునికడప ప్రజలు, శాలివాహనసంఘం, వైఎస్సార్ సీపీ మైనార్టీసెల్, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు అసోసియేషన్, విద్యామందిర్, సిద్దార్థ ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఐకాస, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి . వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షలు బుధవారంతో మూడవ రోజు ముగిశాయి. దీక్షల్లో ఉన్న వారికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు. జమ్మలమడుగులో జై సమైక్యాంధ్ర అంటూ పాత బస్టాండు సమీపంలోని మూడంతస్తుల భవనం పైనుంచి బయపురెడ్డి అనే వ్యక్తి దూకాడు. దూదేకుల సంఘం, ఆర్ఆర్ సోషియో కల్చరల్ అసోసియేషన్, సెయింట్ మెరీస్ ఇంగ్లీషు మీడియం స్కూలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు రోడ్డుపైనే యోగాచేశారు. ఎర్రగుంట్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్లపై నిరసన తెలియజేసి రిలే దీక్షలు ప్రారంభించారు. అన్ని చర్చిల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పులివెందుల జేఏసీ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో, ఎల్ఐసీ ఏజెంట్లు, ఫుట్‌వేర్, పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు,. పూల అంగళ్ల వద్ద మానవహారాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ఈసీ గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిలు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. వేముల ప్రాథమిక పాఠశాలకు చెందిన 370 మంది విద్యార్థులకు రోడ్డుపైనే యూనిట్ పరీక్షలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కమలాపురంలో ఉద్యోగులు, అధ్యాపకులతోపాటు పడమటివీధి, పాత చర్చి, స్టాలిన్ వీధి యువజనులు భారీ ర్యాలీని నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. మైదుకూరులో ముస్లింల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్‌లు తమ సంఘీభావాన్ని తెలిపారు. రైల్వేకోడూరులో అన్ని రకాల వ్యాపారులు, దుకాణాల యజమానులు భారీ ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. రాజంపేటలో జేఏసీ ఆద్వర్యంలో కొత్తబస్టాండు నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బద్వేలులో బంద్ విజయవంతమైంది. పోరుమామిళ్లలో ఆర్యవైశ్యులు అన్ని దుకాణాలను మూసివేసి ర్యాలీ చేపట్టారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రజకులు ర్యాలీ, మానవహారాన్ని నిర్మించారు. వినూత్నరీతిలో సోనియా, కేసీఆర్‌ల మాస్క్‌లను రెండు గాడిదలకు తగిలించి ఊరేగించారు. రాయచోటిలో జేఏసీ, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు రోడ్డుపైనే యూనిట్పరీక్షలు నిర్వహించారు. -
మున్సిపోల్స్‌కు బ్రేక్..?
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పరిపాలన శాఖ ఉద్యోగులు విధులకు దూరం కానుండడంతో ఎన్నికలు వాయిదా పడే పరిస్థితే చెప్పకనే కనిపిస్తోంది. దీంతో ముఖ్యనేతలు కాస్త ఊపిరి పీల్చుకుం టుండగా....ఆశావహుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ పూర్తిస్థాయి ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం విదితమే. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు కాగా ఇటీవలే నెల్లిమర్ల, జరజాపుపేట మేజర్ పంచాయతీలు నగర పంచాయతీగా మార్పు చెందాయి. జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ముసాయిదా రూపకల్పన తుది ఘట్టానికి చేరుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల పోలింగ్ కేంద్రాల నిబంధనలపై మున్సిపల్ కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటికే జరగాల్సి ఉంది. కానీ అది ఈ నెల మూడో వారానికి వాయిదా పడింది. అంతేకాకుండా చైర్మన్ అభ్యర్థుల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇన్ని అవాంతరాల నడుమ ఈ నెల 20న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అనుమానమేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ 2 లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలనే కోర్టు ఆదేశాలు కూడా అమలయ్యేటట్లు కనిపించడం లేదు. ముఖ్యనేతల్లో ఉపశమనం మున్సిపల్ ఎన్నికలు వాయిదాపడే సూచనలు కనిపిస్తుండడంతో ఆయా రాజకీయ పార్టీల ముఖ్యనేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికలు తాత్కాలికం గా ఆగితే బాగుండుననే యోచనలో వారంతా ఇప్పటికే ఉన్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు కావడంతో ఎన్నికల నగదు, మద్యం సర్దుబాటు చేయలేక ఇక్కట్లు పడిన నేతలకు మున్సిపల్ ఎన్నికల ఖర్చు మరింత భారమయ్యే అవకాశాలున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలకు సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మళ్లీ సాధారణ ఎన్నికల్లో తామేం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆశావహుల్లో నిరుత్సాహం వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ప్రకటనతో అన్ని పార్టీల్లోని అశావహులు పోటీల తీరుపై నిన్నటి వరకు లెక్కల్లో మునిగితేలారు. చైర్మన్ అభ్యర్థులు గా ఉండాలనుకునే వారైతే ముఖ్యనేతలలో సంబంధం లేకుండా ఓసీ అయితే ఒక గ్రూప్ ప్యానల్, ఓసీ మహిళ అయితే మరో గ్రూప్ప్యానల్, బీసీ, బీసీ మహిళ అయితే మరో గ్రూపు ప్యానల్‌గా ఏర్పాట్లు చేసేసుకున్నారు. వార్డుల్లో కులా ల వారీగా గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆశావహుల్లో నిరుత్సాహం నెలకొంది. -
కార్పొరేట్ ఉద్యోగుల ‘సైకిల్’ సవారీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైకిల్ మీద ఆఫీసుకు....! మీరు చదివింది నిజమే. సైకిల్ తొక్కుతూ ఆఫీసుకు వెళ్లేందుకు ఇప్పుడు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఈ ట్రెండ్ పాపులర్ అవుతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అలాగే పెరుగుతున్న ఇంధన ధరలు, ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులు సైకిల్‌పై చలో చలో అంటున్నారు. కంపెనీలు సైతం సైకిల్ సవారీని ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాదు సీఈవోలు, ఇతర ముఖ్యులు కూడా సైకిళ్లపై ఆఫీసుకు వెళ్తున్నారంటే ఆశ్చర్యమేయక మానదు. ఇందుకోసం ఖరీదైన సైకిళ్లను వినియోగిస్తున్నారు. అమెరికా కంపెనీ ట్రెక్ రూపొందించిన రూ.5 లక్షల విలువైన సైకిల్ భాగ్యనగర రోడ్లపై తన హుందాను ఒలకబోస్తోందట. సకల ఏర్పాట్లు.. సైకిల్‌పై వచ్చే వారికి ఆఫీసుల్లో స్నానానికి, దుస్తులు మార్చుకోవడానికి కంపెనీలు ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నాయి. రహేజా ఐటీ పార్కులో 100 కంపెనీల దాకా ఉన్నాయి. అన్ని కంపెనీలు సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కాజా తెలిపారు. సైకిళ్లను ఉచితంగా సరఫరా చేసేందుకు వివిధ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, 10 వేల సైకిళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, పలు కంపెనీలు, యూనివర్సిటీలు, కళాశాలలు సైకిల్ ట్రాక్‌లను తమ ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. చండీగఢ్‌లో ఎటు చూసినా సైకిల్ ట్రాక్‌లు దర్శనమిస్తాయి. ఢిల్లీ, నోయిడా, పుణే, ముంబై, చెన్నైలలో కూడా ట్రాక్‌లు ఏర్పాటయ్యాయి. వివిధ సంస్థలు, క్లబ్‌లు తరచూ నిర్వహించే సవారీ కార్యక్రమాలతో దేశంలో సైక్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈనెల15న ది అట్లాంటా ఫౌండేషన్ హైదరాబాద్‌లో నిర్వహించనున్న సైక్లింగ్ ఈవెంట్లో 6వేల మంది కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొననున్నారు. పనితీరు మెరుగుపడింది..: సైకిల్ తొక్కే ఉద్యోగులు చురుకుగా పనిచేస్తున్నారని ఇన్వెస్కో ఇండియా కంట్రీ హెడ్, అట్లాంటా ఫౌండేషన్ చైర్మన్ దీనానాథ్ హరపనహళ్లి తెలిపారు. సీఈవో స్థాయివారు హైదరాబాద్‌లో 60 మందికిపైగా సైక్లింగ్ చేస్తున్నారని చెప్పారు. 10-15 మంది సైకిల్‌పై ఆఫీసుకు వెళ్తున్నారని వెల్లడించారు. సైకిల్ తొక్కేవారిలో 35-45 ఏళ్ల వయసు వారు అధికంగా ఉంటున్నారు. సరదాగా, ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కేవారిలో మహిళలు 500 మంది దాకా ఉంటార ని సైకిల్ టు వర్క్ కో-ఆర్డినేటర్ విశాల తెలి పారు. కొన్ని ప్రాంతాలే మహిళలకు సురక్షితమన్నారు. డిసెంబరుకల్లా సైకిల్ ట్రాక్ పూర్తి... ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న సైబరాబాద్‌లో 30 కిలోమీటర్లమేర సైకిల్ ట్రాక్‌ను ఏపీఐఐసీ, జీహెచ్ఎంసీలు రూపొందించే పనిలో పడ్డాయి. ప్రస్తుతం 2 కిలోమీటర్లు పూర్తి అయింది. డిసెంబరుకల్లా సైకిల్ ట్రాక్ సిద్ధమవుతుందని ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్ తెలిపారు. ప్రముఖ కంపెనీలు సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నాయని చెప్పారు. ఎంఎంటీఎస్ హైటెక్ సిటీ స్టేషన్ వద్ద 1,000 సైకిళ్లు, రహేజా ఐటీ పార్కు వద్ద 500 సైకిళ్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఇలా 10 చోట్ల సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సైకిల్‌ను వాడుకున్నందుకు కొంత అద్దె చెల్లించాలని వివరించారు. ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ఇతర చోట్ల సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని వెల్లడించారు. సైబరాబాద్ ప్రాంతంలో ఉన్న ఐటీ కంపెనీల్లో సుమారు 3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 500 మందికిపైగా సైకిళ్లపై ఆఫీసులకు వెళ్తున్నట్టు అంచనా.