
విభజన నిర్ణయంపైమలి పోరు
నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె
ఉద్యమ కార్యాచరణ వెల్లడి
ఉద్యమించకుంటే టార్గెట్ చేస్తామని ఎంపీలకు హెచ్చరిక
సాక్షి, విజయవాడ :
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మలివిడత ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి, ఏపీ ఎన్జీవోలు తమ కార్యాచరణ ప్రకటించారు. మంగళవారం ఏపీ ఎన్జీవో హోంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ శాసనసభలో నిర్ద్వంద్వంగా తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సమయంలో ఉద్యమం కోసం ప్రజలు, సమైక్యవాదులు, ఉద్యోగ వర్గాల నుంచి తమపై ఒత్తిడి పెరిగిందని చెప్పారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ కాదన్న ఉద్దేశంతోనే మరోమారు సమ్మెకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. గతంలో 66 రోజుల సమ్మెను విజయవంతం చేసినట్లే ఈసారీ సహకరించాలని కోరారు. ఎన్నికల విధులు సహా అన్నింటినీ బహిష్కరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు సహకరించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన సీమాంధ్ర మంత్రులు, ఎంపీల సమావేశానికి అవిశ్వాసం పెట్టిన ఆరుగురు ఎంపీలను పిలవకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎంపీలు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నట్లుగానే మిగిలిన ఎంపీలు కూడా ఉద్యమించకపోతే వారిని లక్ష్యంగా చేసుకుని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఎండీ ఇక్బాల్, అక్కినేని భవానీప్రసాద్, పీ శ్రీనివాసరావు (వాసు), కె.మధుసూదనరాజు, కె.బలరామ్, సీహెచ్ శ్రీనివాసరావు, డి.సత్యనారాయణరెడ్డి, కోనేరు రవి, వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు ఆర్టీసీ కార్మికులు దూరం
ఏపీ ఎన్జీవోల మలిపోరుకు ఆర్టీసీ కార్మికులు దూరంగా ఉండాలని నిర్ణయించారు. 66 రోజుల తర్వాత ఉద్యమాన్ని కొనసాగించే బాధ్యత రాజకీయ పక్షాలకు అప్పగించిన తర్వాతే సమ్మె విరమించామని ఆర్టీసీ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. 66 రోజుల పాటు చేసిన సమ్మె కారణంగా ఆర్టీసీ పూర్తిగా నష్టాల బాటలోకి వెళ్లింది. దీంతో మలిపోరుకు కార్మికులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు పోటీగా ఉన్న ప్రైవేటు బస్సులపై ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో ఆర్టీసీ గాడిన పడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సమ్మెలోకి వెళ్తే ప్రైవేటు బస్సులను అనుమతించినట్లు అవుతుందని కార్మికసంఘాలు భావిస్తున్నాయి. తమకు సంస్థను రక్షించుకోవడం కూడా ప్రధానం కాబట్టి సమ్మెకు దూరంగా ఉంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ నేత వైవీరావు, ఎన్‌ఎంయూ నేత రావి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న ప్రతి ఆందోళనకూ తాము అండగా నిలబడతామని, అన్ని ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు.
ఉద్యమ కార్యాచరణ ఇలా...
7న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
7, 8 తేదీలలో ఎంపీల ఇళ్ల ముట్టడి
9న సమైక్య పరుగు
17న చలో ఢిల్లీ కార్యక్రమం
రైలురోకో, రాస్తారోకోలు, రోడ్ల దిగ్బంధనం వంటి కార్యక్రమాలకు త్వరలో కార్యాచరణ
అవసరమైనపుడు బ్రహ్మాస్త్రంగా ఉపయోగించేలా విద్యుత్ ఉద్యోగుల సమ్మె