
న్యూఢిల్లీ : హఠాత్తుగా ఉద్యోగం కోల్పోయిన వారిని ఆదుకునేదిశగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) త్వరలో తీపికబురు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగి రెండు నెలలపాటు ఖాళీగా ఉండాల్సి వస్తే.. అతడి ఖాతాల నుంచి పాక్షికంగా కొంత సొమ్మును తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారని సమాచారం. దీనిపై వడ్డీ కూడా ఉండబోదని ఈపీఎఫ్‌ఓ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఈ నెల 13న నిర్వహించబోయే కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పాయి.
దీనికి అనుసరించవలసిన విధానాలను కూడా చర్చిస్తారని పేర్కొన్నాయి. ఈ పాక్షిక ఉపసంహరణ కేవలం ఒకసారి మాత్రమే అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాక్షికంగా తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించే అవకాశాన్ని కల్పించాలా? వద్దా? అనే అంశంపై కూడా చర్చ జరుగుతుందని సమాచారం.