విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పరిపాలన శాఖ ఉద్యోగులు విధులకు దూరం కానుండడంతో ఎన్నికలు వాయిదా పడే పరిస్థితే చెప్పకనే కనిపిస్తోంది. దీంతో ముఖ్యనేతలు కాస్త ఊపిరి పీల్చుకుం టుండగా....ఆశావహుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ పూర్తిస్థాయి ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం విదితమే. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు కాగా ఇటీవలే నెల్లిమర్ల, జరజాపుపేట మేజర్ పంచాయతీలు నగర పంచాయతీగా మార్పు చెందాయి.
జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ముసాయిదా రూపకల్పన తుది ఘట్టానికి చేరుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల పోలింగ్ కేంద్రాల నిబంధనలపై మున్సిపల్ కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటికే జరగాల్సి ఉంది. కానీ అది ఈ నెల మూడో వారానికి వాయిదా పడింది. అంతేకాకుండా చైర్మన్ అభ్యర్థుల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇన్ని అవాంతరాల నడుమ ఈ నెల 20న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అనుమానమేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ 2 లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలనే కోర్టు ఆదేశాలు కూడా అమలయ్యేటట్లు కనిపించడం లేదు.
ముఖ్యనేతల్లో ఉపశమనం
మున్సిపల్ ఎన్నికలు వాయిదాపడే సూచనలు కనిపిస్తుండడంతో ఆయా రాజకీయ పార్టీల ముఖ్యనేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికలు తాత్కాలికం గా ఆగితే బాగుండుననే యోచనలో వారంతా ఇప్పటికే ఉన్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్‌లు కావడంతో ఎన్నికల నగదు, మద్యం సర్దుబాటు చేయలేక ఇక్కట్లు పడిన నేతలకు మున్సిపల్ ఎన్నికల ఖర్చు మరింత భారమయ్యే అవకాశాలున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలకు సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మళ్లీ సాధారణ ఎన్నికల్లో తామేం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఆశావహుల్లో నిరుత్సాహం
వార్డుల రిజర్వేషన్‌ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ప్రకటనతో అన్ని పార్టీల్లోని అశావహులు పోటీల తీరుపై నిన్నటి వరకు లెక్కల్లో మునిగితేలారు. చైర్మన్ అభ్యర్థులు గా ఉండాలనుకునే వారైతే ముఖ్యనేతలలో సంబంధం లేకుండా ఓసీ అయితే ఒక గ్రూప్ ప్యానల్, ఓసీ మహిళ అయితే మరో గ్రూప్‌ప్యానల్, బీసీ, బీసీ మహిళ అయితే మరో గ్రూపు ప్యానల్‌గా ఏర్పాట్లు చేసేసుకున్నారు. వార్డుల్లో కులా ల వారీగా గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆశావహుల్లో నిరుత్సాహం నెలకొంది.
మున్సిపోల్స్‌కు బ్రేక్..?
Published Mon, Aug 12 2013 3:18 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement