సాక్షి, మంచిర్యాల :
జిల్లాలో కార్మికులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీస వేతనాలు కరువై, కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా చితికిపోతున్నారు. అనారోగ్యం పాలైనా, ఆపదొచ్చినా వారిని యజమానులు ఆదుకోవడం లేదు. ఒక్కరోజు పనికి వెళ్లక పోయినా ఇచ్చే వేతనం నుంచి కోత విధిస్తున్నారు. ఆదివారం కూడా యజమానులు పనిచేయించుకుంటున్నారు. తమ సమస్యలు కార్మిక శాఖాధికారులకు చెబుతామన్న తమను యజమానులు ఉద్యోగం నుంచి తొలగిస్తారని భయపడుతున్నారు. కార్మిక శాఖాధికారులు కూడా కార్మికుల జీవితాలు, వారి సమస్యలపై దృష్టి సారించిన దాఖ లాలు లేవు.
జిల్లాలో కార్మికులు 60 వేల పైనే..
జిల్లాలో కార్మిక శాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రర్ చేయించుకున్న వస్త్ర, వ్యాపార, వాణిజ్యం, హేయిర్ కట్టింగ్, టైలరింగ్, కిరాణం, ఫ్యాక్టరీలు, ఇతర దుకాణాలు జిల్లా వ్యాప్తంగా 11 వేల పైచిలుకు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోని దుకాణాలు ఐదు వేలపైనే ఉంటాయి. వీటిలో మేనేజర్ స్థాయి నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు 60 వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు షాపులు తీసి రాత్రి 9 గంటల ప్రాంతంలోగా మూసేయాలని కార్మికశాఖ చెబుతోంది. మధ్యలో భోజనం, విశ్రాంతి కోసం గంటన్నర సేపు సమయం ఇ వ్వాలని ఉంది. అంటే రోజుకు 13 గంటలు షా పులు నిర్వహిస్తుండడంతో కార్మికులు ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయలుదేరి యజమానులు రాకముందే షాపులకు చేరుకుంటారు. షాపులు మూసేవరకు అందుబాటులో ఉంటారు. ఇక ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వర్కర్లు, సెక్యూరిటీ గార్డులైతే రోజుకు 8 నుంచి 10 గంటల వరకు విధులు నిర్వర్తిస్తుంటారు. పండుగలు, పెళ్లిళ్ల సమయాల్లో దర్జీలు 18 గంటలు పనిచేస్తుంటారు. ప్రతి ఆదివారం విశ్రాంతి దొరకడం కార్మికులకు కష్టమైంది.
అమలుకు నోచుకోని చట్టాలు
కార్మికులు పనిచేస్తున్న సంస్థలు, పనిభారం, ప్రాంతాలను బట్టి కార్మికశాఖ వీరికి వేతనాలు నిర్ణయించింది. స్వీపర్ మొదలు మేనేజర్ స్థాయి వరకు 59 కేటగిరీల్లో కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి. గ్రేడ్-1 మున్సిపల్ పరిధిల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు రూ.6,208 నుంచి రూ.8,065 (హోదాను బట్టి) ఇవ్వాలి. గ్రేడ్-2 మున్సిపాలిటీలు, మండలాల్లో పనిచేసే వారికి రూ.5,878 నుంచి రూ. 7,865 ఇవ్వాలని 2007లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 116, కార్మిక చట్టం చెబుతోంది. ఏటా సెప్టెంబర్, మార్చి నెలల్లో వేతనాలు పెంచాలని ఆ చట్టం చెబుతుంది. కానీ జిల్లాలో ఎక్కడా కార్మిక శాఖ నిర్ణయించిన వేతనాలు కార్మికులకు అందడం లేదు. ఏళ్ల తరబడి ఒకే వేతనంతో పనిచేస్తున్న కార్మికులున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని షాపులపై చర్యలు తీసుకోవడంలోనూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో 1 నుంచి 14 వార్డు వరకు, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో కేవలం 450 షాపు యజమానులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. జిల్లాలో పని చేస్తోన్న కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఫిర్యాదు చేయడం లేదు..
- రవీందర్, సహాయ కార్మిక అధికారి, సర్కిల్-2, మంచిర్యాల
సాధారణ తనిఖీల్లో భాగంగా మేం షాపులకు వెళ్తుంటాం. ఆ సమయంలో యజమాని పనిలో నుంచి తీసేస్తాడని కార్మికులు సమస్యలు చెప్పరు. పనిలో నుంచి వెళ్లిన తర్వాత వచ్చి ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి వారికీ న్యాయం చేస్తున్నాం. పదేళ్ల షాపులో పని చేసి విరమిస్తే.. ఐదు నెలల వేతనం ఇప్పిస్తున్నాం. మా వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న షాపుల్లో పనిచేసే కార్మికుల పిల్లల చదువుకు ఉపకార వేతనాలు, ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.5 వేల నగదు అందిస్తున్నాం. అనారోగ్యం పాలైతే చికిత్స కోసం ఎలాంటి సహాయం అందించలేం.
13 ఏళ్లుగా పనిచేసినా కనీస వేతనం లేదు..
Published Mon, Sep 23 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement