
కార్పొరేట్ ఉద్యోగుల ‘సైకిల్’ సవారీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైకిల్ మీద ఆఫీసుకు....! మీరు చదివింది నిజమే. సైకిల్ తొక్కుతూ ఆఫీసుకు వెళ్లేందుకు ఇప్పుడు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఈ ట్రెండ్ పాపులర్ అవుతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అలాగే పెరుగుతున్న ఇంధన ధరలు, ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులు సైకిల్‌పై చలో చలో అంటున్నారు. కంపెనీలు సైతం సైకిల్ సవారీని ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాదు సీఈవోలు, ఇతర ముఖ్యులు కూడా సైకిళ్లపై ఆఫీసుకు వెళ్తున్నారంటే ఆశ్చర్యమేయక మానదు. ఇందుకోసం ఖరీదైన సైకిళ్లను వినియోగిస్తున్నారు. అమెరికా కంపెనీ ట్రెక్ రూపొందించిన రూ.5 లక్షల విలువైన సైకిల్ భాగ్యనగర రోడ్లపై తన హుందాను ఒలకబోస్తోందట.
సకల ఏర్పాట్లు..
సైకిల్‌పై వచ్చే వారికి ఆఫీసుల్లో స్నానానికి, దుస్తులు మార్చుకోవడానికి కంపెనీలు ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నాయి. రహేజా ఐటీ పార్కులో 100 కంపెనీల దాకా ఉన్నాయి. అన్ని కంపెనీలు సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కాజా తెలిపారు. సైకిళ్లను ఉచితంగా సరఫరా చేసేందుకు వివిధ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, 10 వేల సైకిళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, పలు కంపెనీలు, యూనివర్సిటీలు, కళాశాలలు సైకిల్ ట్రాక్‌లను తమ ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. చండీగఢ్‌లో ఎటు చూసినా సైకిల్ ట్రాక్‌లు దర్శనమిస్తాయి. ఢిల్లీ, నోయిడా, పుణే, ముంబై, చెన్నైలలో కూడా ట్రాక్‌లు ఏర్పాటయ్యాయి. వివిధ సంస్థలు, క్లబ్‌లు తరచూ నిర్వహించే సవారీ కార్యక్రమాలతో దేశంలో సైక్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈనెల15న ది అట్లాంటా ఫౌండేషన్ హైదరాబాద్‌లో నిర్వహించనున్న సైక్లింగ్ ఈవెంట్‌లో 6వేల మంది కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొననున్నారు.
పనితీరు మెరుగుపడింది..: సైకిల్ తొక్కే ఉద్యోగులు చురుకుగా పనిచేస్తున్నారని ఇన్వెస్కో ఇండియా కంట్రీ హెడ్, అట్లాంటా ఫౌండేషన్ చైర్మన్ దీనానాథ్ హరపనహళ్లి తెలిపారు. సీఈవో స్థాయివారు హైదరాబాద్‌లో 60 మందికిపైగా సైక్లింగ్ చేస్తున్నారని చెప్పారు. 10-15 మంది సైకిల్‌పై ఆఫీసుకు వెళ్తున్నారని వెల్లడించారు. సైకిల్ తొక్కేవారిలో 35-45 ఏళ్ల వయసు వారు అధికంగా ఉంటున్నారు. సరదాగా, ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కేవారిలో మహిళలు 500 మంది దాకా ఉంటార ని సైకిల్ టు వర్క్ కో-ఆర్డినేటర్ విశాల తెలి పారు. కొన్ని ప్రాంతాలే మహిళలకు సురక్షితమన్నారు.
డిసెంబరుకల్లా సైకిల్ ట్రాక్ పూర్తి...
ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న సైబరాబాద్‌లో 30 కిలోమీటర్లమేర సైకిల్ ట్రాక్‌ను ఏపీఐఐసీ, జీహెచ్‌ఎంసీలు రూపొందించే పనిలో పడ్డాయి. ప్రస్తుతం 2 కిలోమీటర్లు పూర్తి అయింది. డిసెంబరుకల్లా సైకిల్ ట్రాక్ సిద్ధమవుతుందని ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్ తెలిపారు. ప్రముఖ కంపెనీలు సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నాయని చెప్పారు. ఎంఎంటీఎస్ హైటెక్ సిటీ స్టేషన్ వద్ద 1,000 సైకిళ్లు, రహేజా ఐటీ పార్కు వద్ద 500 సైకిళ్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఇలా 10 చోట్ల సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సైకిల్‌ను వాడుకున్నందుకు కొంత అద్దె చెల్లించాలని వివరించారు. ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ఇతర చోట్ల సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని వెల్లడించారు. సైబరాబాద్ ప్రాంతంలో ఉన్న ఐటీ కంపెనీల్లో సుమారు 3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 500 మందికిపైగా సైకిళ్లపై ఆఫీసులకు వెళ్తున్నట్టు అంచనా.