సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అసెంబ్లీ వేదికగా అమీతుమీకి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు వైఖరితో టీడీపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడగా.. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే అధిష్టానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు పూనుకున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇవ్వగా.. దాని ఆధారంగా సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజనకు జూలై 30న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇందుకు కేంద్ర మంత్రి మండలి కూడా ఆమోదించింది. అనంతరం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపారు. అక్కడి నుంచి బిల్లు శాసనసభకు చేరనుంది. ఈ బిల్లులు శీతాకాల సమావేశాల్లోనే చర్చకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ‘అనంత’ ప్రజానీకం ప్రత్యేక దృష్టి పెట్టారు. తాము ఎంచుకున్న ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాల మేరకు నడుచుకుంటారా? అధిష్టాన వర్గాలకు తలొగ్గుతారా? అన్న ఆందోళన నెలకొంది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత స్ఫూర్తితో ఆ పార్టీ శ్రేణులు సమైక్యాంధ్ర మహోద్యమంలో కదం తొక్కుతున్నాయి. శాసనసభ వేదికగా సమైక్య నినాదాన్ని ప్రతిధ్వనింపజేస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బి.గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్ఘాటిస్తున్నారు.
రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కవడాన్ని శాసనసభ వేదికగా నిరూపిస్తామని స్పష్టీకరిస్తున్నారు. టీడీపీ అధినేత ఇప్పటికీ సమైక్యాంధ్ర నినాదం చేయకపోవడాన్ని.. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఇది టీడీపీ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభ వేదికగా సమైక్య నినాదం చేసినా.. అదంతా ఆ పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో భాగమేననే భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆపార్టీ అధిష్టానానికి దాసోహమంటున్నారు. అధిష్టానం విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంకుతున్నారు.
అమీతుమీ!
Published Thu, Dec 12 2013 3:10 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement