కడప రూరల్, న్యూస్‌లైన్ : భారతదేశ వ్యవస్థకు దిశ, దశలు నిర్దేశించే సాక్షాత్తు పార్లమెంటు నిండు సభలో సీమాంధ్ర ఎంపీలపై దాడి జరగడం దారుణమని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఎంపీలను ఒంటరిగా చేసి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఎంపీలు దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. ఆ మేరకు ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా గురువారం స్థానిక నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సమైక్యాంధ్ర జేఏసీ జిల్లా కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి మాట్లాడుతూ గురువారం పార్లమెంటులో కాంగ్రెస్, యూపీఏ, తెలంగాణకు చెందిన ఎంపీలు గుండాల్లా ప్రవర్తించి సీమాంధ్ర ఎంపీలపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.
ఈ సంఘటనతో ఈరోజు ప్రజాస్వామ్యం ఖూనీ అయినరోజని, పార్లమెంటు చరిత్రలో బ్లాక్‌డేగా అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిల్లుకు సంబంధించి సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే స్పీకర్ స్పందించి ఎంపీలపై సస్పెండ్‌ను ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. మెడికల్, పారా మెడికల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వారణాసి ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రవిశంకర్‌రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిందే శాసనం కాదన్నారు.
పార్లమెంటులో సీమాంధ్రుల ఎంపీల పట్ల వ్యవహారించిన తీరు దారుణంగా ఉందన్నారు. జగ్జీవన్‌రామ్ కుమార్తె అయిన స్పీకర్ మీరాకుమార్ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలన్నారు. బాధ్యత గల స్పీకర్, సోనియాగాంధీకి కీలుబొమ్మగా మారడం దారుణమన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, స్పీకర్ మీరాకుమార్, సోనియాగాంధీకి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో నాగార్జునమహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ బెరైడ్డి రామకృష్ణారెడ్డి, చిన్న సుబ్బయ్య యాదవ్, కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
Published Fri, Feb 14 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement
Advertisement