విజయవాడ : సమైక్యాంధ్రకు ఏపీ ఎన్జీవోలు రెండు రోజుల పాటు కృష్ణా జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు పిలుపునివ్వటంతో అత్యవసర సేవలు మినహా సినిమా, వర్తక, వాణిజ్య, వ్యాపార , రవాణా రాకపోకలు బంద్ కానున్నాయి. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడ ఆటోనగర్‌లో చిన్నతరహా పరిశ్రమల వ్యాపారులు మంగళవారం భారీ భైక్ ర్యాలీ నిర్వహించారు.
వందలాది మంది వ్యాపారులు ఈ ర్యాలీలో పాల్గోన్నారు. ఆటోనగర్ నుంచి బెంజిసర్కిల్ వరకూ ర్యాలీ చేపట్టి బెంజి సర్కిల్‌లో కేసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దుతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో విజయవాడ హోరెత్తిపోయింది.
ఆరు వారాల నుంచి సీమాంధ్ర స్తంభించిపోయినా కేంద్రంలో చలనం లేదని ఉద్యమకారులు మండిపడ్డారు. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజనపై ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. తెలంగాణా ఉద్యమం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే చేసిందని వారన్నారు. రాష్ట్రాన్ని విభజించబోమని ప్రకటన వచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతుందని చిన్నతరహా పరిశ్రమల వ్యాపారులు తేల్చి చెప్పారు.