బాబు తీరు తమ్ముళ్లు బేజారు
Published Tue, Sep 17 2013 4:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరుతో తమ్ముళ్లు బేజారవుతున్నారు. పార్టీ విధానం ఏంటో తేల్చి చెబితే ఏదో ఒక చోటైనా పరువు కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన విషయంలో అధినేత తీరును తీవ్రంగా తప్పుబడుతున్నా రు. ఈ పరిస్థితుల్లో పార్టీ జెండా మోయడం కంటే తప్పుకోవటమే మేలని జిల్లాలో కొంద రు తమ్ముళ్లు భావిస్తున్నారు. జిల్లాలో ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం లో మనస్ఫూర్తిగా పాల్గొనలేక లోలోన మదనపడుతున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటున్న పార్టీలో చేరడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అలా చేరలేని పక్షంలో తటస్తంగా ఉండడమే మంచిదని భావిస్తున్నా రు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓసారి సమైక్యాంధ్ర అని, మరోసారి ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని కేంద్రానికి లేఖ లు పంపడాన్ని తప్పుపడుతున్నారు.
తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో విభజనకు అనుకూలంగా లేఖ పంపిన విషయాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోయారు. అంతటితో ఆగకుండా ఇటీవల కాంగ్రెస్ దొంగ నాటకాలాడుతోందంటూ బస్సుయాత్ర చేయడంపై మండిపడుతున్నారు. బస్సుయాత్ర ప్రారంభించి సీమాంధ్రలో పరువు కాపాడారని భా వించే సమయంలో మధ్యలో ముగించుకుని హడావుడిగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తెలంగాణలో కూడా బస్సుయాత్ర చేసేందుకు పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపడుతున్నారు.
పార్టీలో ఉండాలా? బయటకు వెళ్లిపోవాలా?
గంటకో నిర్ణయం తీసుకునే పార్టీ అధినేతపై తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విభజనకు అనుకూలమని తేలిపోయింది. అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం పేరుతో జనంలోకి దూసుకుపోతోంది. జిల్లాలో పెదిరెడ్డి మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో పలుచోట్ల సమైక్యాంధ్రకు మద్దతుగా
ఉద్యమాలను కొనసాగిస్తూ ముందుకెళుతోంది. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు గట్టిగా ఉద్యమిస్తున్నారు. టీడీపీ అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. చిత్తూరు, తిరుపతికి చెందిన నలుగురు తెలుగు తమ్ముళ్లు అధినేతపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ పరువును గంగలో కలిపిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మండిపడుతున్నారు. అధినేత తీరును బట్టే జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమంపై తెలుగు తమ్ముళ్లు పెద్దగా దృష్టి సారించలేదు. తటస్తంగా ఉద్యమంలో పాల్గొంటూ సమైక్య జెండాతో ముందుకు వెళ్తున్నారు. తిరుపతిలో కొందరు తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాతో వెళితే పరువు పోతుందని భావించి విద్యాసంస్థల అధినేతలతోనూ, ఉద్యోగులతోనూ కలసి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఒకరిద్దరు మాత్రం జిల్లాలో పార్టీ జెండాలతో రిలేదీక్షలు చేస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.
Advertisement
Advertisement