
విభజించే హక్కు సోనియాకు లేదు: సబ్బం హరి
సాక్షి, విశాఖపట్నం: తెలుగువాళ్లని విభజించే హక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేదని ఆ పార్టీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. విభజనపై సోనియా నిర్ణయం తీసేసుకున్నారని, ఒక్కసారి మాట ఇస్తే ఆమె తప్పరని పార్టీ పెద్దలు వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రానని గతంలో సోనియా గాంధీ అన్నారని, మరి ఇప్పుడెందుకు రాజకీయాలు చేస్తున్నారని సబ్బం విమర్శించారు. ఒక్కసారి చరిత్రను గుర్తుచేసుకోవాలని ఆయన సోనియా గాంధీని కోరారు. ప్రధాని పదవి కోసం ఆమె అప్పట్లో ములాయం సింగ్, మాయావతి, జయలలిత తదితరుల్ని కలిసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
తాను రాజకీయాల్లోకి రానని చెబుతున్న ఆమె ఆ విషయాన్ని ఎందుకు గుర్తుచేసుకోవడం లేదని అడిగారు. సంఖ్య సరిపోకపోవడంతోనే నాడు ఆమె ప్రధాన మంత్రి కాలేదని గుర్తుచేశారు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్‌లు అందరూ దేశమైనా రాష్ట్రమైనా సమైక్యంగా ఉండాలని కృషి చేస్తే.. సోనియా మాత్రం విభజించడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ బీచ్‌రోడ్డులో ఆదివారం ఆయన ‘సమైక్యాంధ్ర ఉద్యమం-అవగాహన సదస్సు’ పేరిట సభ నిర్వహించారు. తొలుత పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు. పార్టీలు, కుల వర్గాలకతీతంగా సమైక్యాంధ్ర కోసం అంతా ముందుకు రావాలని కోరారు.
త్వరలో పాదయాత్ర..
రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదని హరి కుండబద్ధలు కొట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తాను పాదం ముందుకు వేశానని, అందుకు వేదిక సిద్ధమైందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో త్వరలోనే పాదయాత్ర చేపడతానని, అంతా ముందుకు రావాలని కోరారు. వైఎస్సార్ తనకెంతో ఇష్టమైన నాయకుడని, ఆయనపై నిందలు మోపడం సబబుకాదని అన్నారు. రాష్ట్ర విభజనకు ఆయన ముందుకు వచ్చారని చెబుతున్న నాయకులు.. 60 ఏళ్లనుంచి తాము ఉద్యమం చేస్తున్నామని చెబుతున్న నాయకులు.. ఎవరైనా సరే వైఎస్సే విభజనకు ఆజ్యం పోశారని చెప్పగలరా అని ప్రశ్నించారు. తన పిల్లల కోసం, పదవుల కోసం సోనియా ప్రయత్నించారని, కానీ ఏనాడూ వైఎస్ తన పిల్లలకు పదవుల గురించి ఆలోచించలేదన్నారు.
సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలని స్వర్గం నుంచి ఎన్టీఆర్ చంద్రబాబును కోరాలని, ఆయన మాట వినకపోతే కొడుకుల్నయినా కోరాలని సబ్బం అన్నారు. విశాఖ ప్రజలు పురందేశ్వరిని ఎన్నుకుంటే కనిపించకపోవడం ఘోరమన్నారు. తన కూతుర్ని ఉద్యమంలోకి పంపించాలని పైనున్న ఎన్టీఆర్‌ను కోరుకుంటున్నట్టు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవిది ఎక్స్‌ట్రా క్యారెక్టర్ అని, ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని, రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంటే ఆయన మాత్రం కేరళలో పడవలకు జెండా ఊపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించిన అభిప్రాయాలు సరైనవేనన్నారు.
జనం కోసం జగన్..
‘జనం కోసం జగన్ తిరుగుతున్నారనే ఆయన్ను జైల్లోకి పంపారు.. ఇప్పుడు ఉద్యమ కాగడాలతో విజయమ్మ, షర్మిల ముందుకు వచ్చారు’ అని సబ్బం అన్నారు. పదవుల్ని త్యజించిన విజయమ్మ, జగన్‌ల గొప్పతనాన్ని ఆయన అభినందించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. జగన్, విజయమ్మలను చూసి ఇతర రాజకీయ నేతలు ఎంతో నేర్చుకోవాలని చెప్పారు.
కేసీఆర్‌ది అబద్ధాల కుటుంబం
టీఆర్‌ఎస్ నేత కేసీఆర్‌ది అబద్ధాల కుటుంబం అని హరి ధ్వజమెత్తారు. తెలుగువారి ఉనికినే ప్రశ్నించే స్థాయికి ఆయన ఎదిగిపోయారని, హైదరాబాద్ వచ్చి తగిన సమాధానం చెబుతామని అన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ర్టం మీ తాత సొత్తా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆయన ఏపీ రాక్షసుడు అని, అంతమొందించాల్సిందేనని అన్నారు. సమాజంలో చిచ్చుపెడుతున్నవారెవరైనా త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.