Vizag Beach Road
-
నయా ట్రెండ్: డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్
నాగమణి సాధారణ గృహిణి భర్త ఉద్యోగి. ఓ మధ్యాహ్నం వేళ. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఏం చేయాలో తోచక భర్తకు ఫోన్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. భర్త ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన బంధువులు రీఫ్రెష్ అయ్యేలోపే తాజా వంటకాలు సిద్ధమయ్యాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్‌ఫ్రం హోంలో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్‌లు వేరు. ల్యాప్‌టాప్‌లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లోని ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్ చేయడం.. నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్‌ను తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. డాబాగార్డెన్స్/బీచ్‌రోడ్డు: విశాఖ నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వెరైటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తుందన్న సంకేతాలు రాగానే ఆర్డర్ చేస్తే సరి.. వేడివేడి ఆహార పదార్థాలు గడప ముంగిటకు వచ్చేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. కొత్త వంటల పరిచయం నగరవాసులకు వెరైటీ ఫుడ్ అందించాలని పలు హోటళ్లు ఎప్పటికప్పుడు ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారత దేశం రుచులు, నవాబులు బిర్యానీ, కోస్టల్ రుచి.. ఇలా అనేక రకాల పేర్లతో ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేసి ఆహార ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. కొత్త రుచులు ఇంట్లో కష్టం వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి రెస్టారెంట్ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపునిండా తినొచ్చు. – సీహెచ్ పవన్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి ట్రెండ్ మారింది ఒకప్పటికీ నేటికి ట్రెండ్ మారింది. వర్క్ స్టైల్ కూడా మారింది. అలానే ఆహారపు అలవాట్లు, అభిరుచులూ మారాయి. వీకెండ్స్ సంస్కృతి వచ్చింది. చాలా మంది ఫ్యామిలీతో రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లి భోజనం చేస్తున్నారు. మెనూలో వెరైటీలు ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ మార్చుకుంటున్నాయి. హోం డెలివరీ, టేక్ ఏవే తగ్గిపోయి ఆన్లైన్లో ఆర్డర్స్ పెరిగాయి. హోటల్ బిజినెస్‌లో 60 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ఆక్రమించేశాయి. – వాకాడ రాజశేఖర్‌రెడ్డి, అతిథి దేవోభవ హోటల్ యజమాని నగరంలో నయా ట్రెండ్ హీరో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భోజన సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు ఏం వంట చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న హీరోయిన్‌కు హీరో మంచి ఐడియా చెప్తాడు. సిటీలో ప్రముఖ హోటల్ నుంచి ఫుడ్ రప్పించి బంధువులకు అన్ని రకాల రుచులు చూపించి వారి చేత శభాష్ అనిపిస్తాడు. ప్రస్తుతం నగరంలో ఇటువంటి ట్రెండే నడుస్తోంది. ఇంటికి వచ్చే బంధువులకు నగరంలోని లభించే కొత్త కొత్త రుచులను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. అందిస్తున్నారు. హోటళ్ల పేర్లూ వెరైటీనే.. విశాఖ నగర వాసులు రోజూ ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడడం లేదు. సకుటుంబ సమేతంగా హోటల్‌కో, దాబాకో వెళ్లి సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యజమానులు రెస్టారెంట్లు, హోటళ్లకు వెరైటీ పేర్లు పెడుతున్నారు. అమ్మ చేతి వంట, వంటిళ్లు, అరిటాకు, వంటకమ్.. ఇలా రకరకాల పేర్లతోనే కాదు.. బాబాయ్ హోటల్, సుబ్బయ్య హోటల్, రాజుగారి హోటల్, కుండ బిర్యానీ వంటి పేర్లతోనూ నడుస్తున్న హోటళ్లు నగరంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. బుట్ట భోజనం, కాంబో ఆఫర్, ఫ్యామిలీ ఫ్యాక్, జంబో బిర్యానీ ఇలా స్పెషల్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ.. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్డర్లు మొదలవుతాయి. వాటర్ బాటిల్ నుంచి ఐస్‌క్రీం వరకు, టిఫిన్ నుంచి భోజనం, పసందైన బిర్యానీ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కొందరు కర్రీస్, స్నాక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. రోజు రోజుకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లల్లో వంట చేయడం చాలా వరకు తగ్గింది. వేగంగా డెలివరీ చేయడం కూడా ఇందుకు కారణం. ఆన్లైన్ యాప్‌లు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. – కిరణ్, ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ఫెస్టివల్స్‌కు వెళ్తుంటా.. నాకు కొత్త కొత్త రుచులంటే చాలా ఇష్టం. అటువంటి రుచులు ఇంట్లో కష్టం. అందుకే నగరంలో ఎక్కడ కొత్త రుచులు ఉన్నాయంటే అక్కడ వాలిపోతా. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్స్, నూతన రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ రుచులన్నీ ఆస్వాదిస్తా. –హేమసుందర్ కొత్త రుచులను టేస్ట్ చేస్తాం నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేస్తుంటాం. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో ఒక్క రోజైనా రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తాం. కొత్త రుచులను టేస్ట్ చేస్తాం. –రమ్య -
విశాఖపట్నం: ఐదులోపు చూసి వెళ్లిపోవల్సిందే..
ఆదివారం వచ్చిందంటే చాలు సిటిజనులు ఎక్కడున్నా బీచ్‌లో వాలిపోవాల్సిందే..కరోనా కారణంగా చాలా రోజులు బీచ్ మొఖం చూడడమే మానేశారు. ఇటీవల కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం..పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో మళ్లీ నగరవాసులు బీచ్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో వీకెండ్స్, సెలవు రోజుల్లో బీచ్‌లో ఆంక్షలు విధించారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి బీచ్‌లో ఒక్కర్ని కూడా లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్‌లో సందడి వాతావరణం నెలకుంది. ఆంక్షల సమయంలో బీచ్‌ను మొత్తం తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు. – బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) (చదవండి: వైరల్: మేకను మింగిన కొండచిలువ) -
తాత దరికే చేరావా..బంగారు తండ్రీ!
♦ బీచ్‌రోడ్ ప్రమాదంలో గాయపడ్డ దేవ్‌గురు మృతి ♦ మూడు రోజులు మృత్యువుతో పోరాటం ♦ రెండు రోజుల వ్యవధిలో తిరిగిరానిలోకాలకు తాతా, మనవడు ♦ కొడుకును కడసారైనా చూసుకోలేని ఏఎస్పీ నందకిశోర్ ♦ కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నం విశాఖ సిటీ : దేవ్‌గురు.. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడినా.. ఓడిపోయాడు. అసలే విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని.. దేవ్‌గురు మరణవార్త మరింత కుంగదీసింది. రెండు రోజుల వ్యవధిలో తాతామనవడు అసువులు బాశారు. వేగం.. ఆ కుటుంబం ఉసురు తీసింది. విహారం.. ఆ మనసుల్లో పెను విషాదాన్ని నింపింది. మూడు రోజుల క్రితం వరకూ నవ్వులతో విరబూసిన ఆ మోముల్లో.. ఇప్పుడు కన్నీటిధారలే కనిపిస్తున్నాయి. ఒకరి నిర్లక్ష్యం.. ఆ కుటుంబానికి నిద్రలేకుండా చేసింది. అతి వేగం.. వారిని కదలలేని పరిస్థితికి తీసుకొచ్చింది. వారి గుండెల్ని తడితే... అన్నీ ఆవేదన స్వరాలే వినిపిస్తున్నాయి.. ఆ కళ్లల్లో.. విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. ఒక్క ప్రమాదం అదనపు ఎస్పీ నందకిశోర్ కుటుంబాన్ని కకావికలం చేసేసింది. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఆదివారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న దేవ్‌గురు(11) బు«ధవారం ఉదయం మృతి చెందాడు. సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవ్‌గురుని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా యత్నించారు. పలు మార్లు శస్త్ర చికిత్సలు నిర్వహించినా.. ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. ప్రమాదం జరిగినప్పుడు.. దేవ్‌గురు కుడికాలు పూర్తిగా నలిగిపోయింది. దీంతో.. సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు కాలుని తీసేశారు. ఆ తర్వాత మరో రెండు శస్త్ర చికిత్సలు చేసినా... స్పృహæలోకి రాకపోవడంతో.. నిరంతరం వైద్యులు పర్యవేక్షించారు. మంగళవారం అర్థరాత్రి నుంచి చిన్నారి శరీరం వైద్యానికి సహకరించడం మానేసింది. ఆ పసివాడి పరిస్థితి విషమించండంతో.. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు ప్రమాదం జరిగిన రోజునే.. తండ్రి దూసి ధర్మారావుని పోగొట్టుకున్న విజయవాడ అదనపు ఎస్పీ డీఎన్ కిశోర్.. ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడి మరణవార్త విని తట్టుకోలేకపోయారు. ఈ ప్రమాదంలోనే గాయపడ్డ డీఎన్‌కిశోర్.. కదలలేని స్థితిలో ఉన్నారు. దీంతో.. తన స్నేహితుల్ని ఆస్పత్రికి పిలిపించి.. కుమారుడి అంత్యక్రియలు చూసుకోవాలని చెప్పడం అందర్నీ శోకసంద్రంలో ముంచేసింది. నగరంలోని జ్ఞానాపురం శ్మాశాన వాటికకు దేవ్‌గురు మృతదేహాన్ని తరలించారు. మరణంలోనూ వీడని బంధం: ఆ తాతంటే.. మనవడికి ఇష్టం.. ఆ మనవడంటే.. తాతకు ప్రాణం. స్వతహాగా.. రచయిత కావడంతో.. రోజూ ఒక నీతి కథ చెప్పి దేవ్‌గురుకి చిన్నతనం నుంచే తాత దూసి ధర్మారావు సుద్దులు నేర్పించేవారు.తాతయ్యతో రోజుకి ఒక్కసారైనా దేవ్‌గురు మాట్లాడకుండా ఉండలేడు. అందుకే.. ఇద్దరి మధ్య బంధం విడదీయలేనంతగా పెనవేసుకుంది. మరణంలోనూ వీరిని ఎవ్వరూ విడదీయలేకపోయారు. ప్రమాదం జరిగిన సమయంలోనూ తాత ఒడిలోనే కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇంతలో మృత్యువు దూసుకొచ్చింది. వారిని కబళించింది. ఆ భీతావహ పరిస్థితిలో.. తండ్రి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వెళ్లి రక్షిద్దామంటే.. తను కూడా అదే పరిస్థితిలో ఉన్నానని ప్రమాదం జరిగిన రోజున సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో వైద్యులకు చెబుతుంటే.. అందరి కళ్లల్లో.. సుడులు తిరిగాయి. కొడుకుని, కూతుర్ని కాపాడాలంటూ.. తనకు వైద్యం చేస్తున్న సమయంలోనే ఆయన.. దేవుళ్లకు మొక్కాడు. కానీ.. ఆయన ప్రార్థన ఫలించలేదు. తాతకు తగ్గ మనవడు: చిన్నతనం నుంచి తాతయ్య చెప్పే కథలు వింటూ.. పెరిగిన దేవ్‌గురు.. చదువులో చురుకుదనం ప్రదర్శించేవాడు. విశాఖలోని విశాఖ వ్యాలీ స్కూల్లో ఆరో తరగతి వరకూ చదువుకున్నాడు. ఈసమయంలోనే పాఠశాలలో జరిగిన వ్యాసరచన, ఇతర పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేవాడు. ఇటీవలే స్కూల్ అఛీవ్మెంట్ అవార్డుని మంత్రి గంటా శ్రీనివాస్ చేతులమీదుగా తాతయ్య సమక్షంలోనే అందుకున్నాడు. కడసారి వీడ్కోలుకి దూరం: ప్రమాదం జరగకముందు, జరిగిన క్షణంలో మాత్రమే తమ పిల్లల్ని, తండ్రిని చూసుకున్నారు అదనపు ఎస్పీ నందకిశోర్. అప్పటి నుంచి ఇంతవరకూ వారిని చూడలేకపోయారు. చివరికి కన్నతండ్రి కడచూపునకు కూడా నోచుకోలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడు మరణవార్త విన్నాక.. మరింత కుంగిపోయారు. -
గాయపడిన ఏఎస్పీ కుమారుడు మృతి
♦ విశాఖ బీచ్ బస్సు ప్రమాదంలో రెండుకు చేరిన మృతుల సంఖ్య ♦ తండ్రిని, కొడుకును కోల్పోయిన పోలీస్ అధికారి విశాఖ సిటీ: వైజాగ్ బీచ్‌రోడ్‌లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయవాడ అదనపు ఎస్పీ నందకిశోర్ కుమారుడు దేవ్‌గురు(11) బుధవారం ఉదయం మృతి చెందాడు. దేవ్‌గురు సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో మూడు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో నందకిశోర్ తండ్రి దూసి ధర్మారావు ఘటనా స్థలంలోనే మరణించిన విషయం తెలిసిందే. నందకిశోర్ కాలు, చేతులకు ఫ్రాక్చర్ కాగా ఆయన కుమార్తె మంజీరకు రెండు కాళ్లూ ఫ్రాక్చర్ అయ్యాయి. వీరిద్దరూ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కుమారుడు కూడా మరణించాడని తెలుసుకున్న నందకిశోర్ అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉండటంతో తన స్నేహితుల్ని ఆస్పత్రికి పిలిపించి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. వారు జ్ఞానాపురం శ్మశానవాటికలో ఆ కార్యక్రమం పూర్తిచేశారు. -
రేపు విశాఖ బీచ్ రోడ్డులో సంగీతకళానిధి
-
రేపు విశాఖ బీచ్ రోడ్డులో సంగీతకళానిధి
విశాఖ: విశాఖ జిల్లాలో బీచ్‌రోడ్డులో మంగళవారం సంగీత కళానిధి కార్యక్రమం జరగనున్నట్టు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. నేదునూరి కృష్ణమూర్తి కర్ణాటక సంగీత భాండాగారం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 54 ఏళ్ల పాటు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాల్లో నిరాఘంటంగా నేదునూరి పాడిన కీర్తనలు సంగీత ప్రియుల కోసం భాండాగారంలో అందుబాటులో ఉంటాయని అన్నారు. భాండాగారంలో 520 మంది వాగ్గేయ, 31,400 సంగీత విద్వాంసుల కీర్తనలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎల్. రాఘవన్, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పప్పు వేణుగోపాలరావు సహకారంతో అందిస్తున్నామన్నారు. భారతదేశం సంగీత విద్వాంసుడి పేరుమీద భాండాగారం తీసుకురావడం ఇదే మొట్టమొదటిసారి అని యార్లగడ్డ చెప్పారు. భాండాగారం ఏర్పాటుకు సాయమందించిన కార్పొరేషన్, మంత్రి గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
విభజించే హక్కు సోనియాకు లేదు: సబ్బం హరి
సాక్షి, విశాఖపట్నం: తెలుగువాళ్లని విభజించే హక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేదని ఆ పార్టీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. విభజనపై సోనియా నిర్ణయం తీసేసుకున్నారని, ఒక్కసారి మాట ఇస్తే ఆమె తప్పరని పార్టీ పెద్దలు వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రానని గతంలో సోనియా గాంధీ అన్నారని, మరి ఇప్పుడెందుకు రాజకీయాలు చేస్తున్నారని సబ్బం విమర్శించారు. ఒక్కసారి చరిత్రను గుర్తుచేసుకోవాలని ఆయన సోనియా గాంధీని కోరారు. ప్రధాని పదవి కోసం ఆమె అప్పట్లో ములాయం సింగ్, మాయావతి, జయలలిత తదితరుల్ని కలిసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లోకి రానని చెబుతున్న ఆమె ఆ విషయాన్ని ఎందుకు గుర్తుచేసుకోవడం లేదని అడిగారు. సంఖ్య సరిపోకపోవడంతోనే నాడు ఆమె ప్రధాన మంత్రి కాలేదని గుర్తుచేశారు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్‌లు అందరూ దేశమైనా రాష్ట్రమైనా సమైక్యంగా ఉండాలని కృషి చేస్తే.. సోనియా మాత్రం విభజించడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ బీచ్‌రోడ్డులో ఆదివారం ఆయన ‘సమైక్యాంధ్ర ఉద్యమం-అవగాహన సదస్సు’ పేరిట సభ నిర్వహించారు. తొలుత పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు. పార్టీలు, కుల వర్గాలకతీతంగా సమైక్యాంధ్ర కోసం అంతా ముందుకు రావాలని కోరారు. త్వరలో పాదయాత్ర.. రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదని హరి కుండబద్ధలు కొట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తాను పాదం ముందుకు వేశానని, అందుకు వేదిక సిద్ధమైందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో త్వరలోనే పాదయాత్ర చేపడతానని, అంతా ముందుకు రావాలని కోరారు. వైఎస్సార్ తనకెంతో ఇష్టమైన నాయకుడని, ఆయనపై నిందలు మోపడం సబబుకాదని అన్నారు. రాష్ట్ర విభజనకు ఆయన ముందుకు వచ్చారని చెబుతున్న నాయకులు.. 60 ఏళ్లనుంచి తాము ఉద్యమం చేస్తున్నామని చెబుతున్న నాయకులు.. ఎవరైనా సరే వైఎస్సే విభజనకు ఆజ్యం పోశారని చెప్పగలరా అని ప్రశ్నించారు. తన పిల్లల కోసం, పదవుల కోసం సోనియా ప్రయత్నించారని, కానీ ఏనాడూ వైఎస్ తన పిల్లలకు పదవుల గురించి ఆలోచించలేదన్నారు. సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలని స్వర్గం నుంచి ఎన్టీఆర్ చంద్రబాబును కోరాలని, ఆయన మాట వినకపోతే కొడుకుల్నయినా కోరాలని సబ్బం అన్నారు. విశాఖ ప్రజలు పురందేశ్వరిని ఎన్నుకుంటే కనిపించకపోవడం ఘోరమన్నారు. తన కూతుర్ని ఉద్యమంలోకి పంపించాలని పైనున్న ఎన్టీఆర్‌ను కోరుకుంటున్నట్టు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవిది ఎక్స్ట్రా క్యారెక్టర్ అని, ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని, రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంటే ఆయన మాత్రం కేరళలో పడవలకు జెండా ఊపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించిన అభిప్రాయాలు సరైనవేనన్నారు. జనం కోసం జగన్.. ‘జనం కోసం జగన్ తిరుగుతున్నారనే ఆయన్ను జైల్లోకి పంపారు.. ఇప్పుడు ఉద్యమ కాగడాలతో విజయమ్మ, షర్మిల ముందుకు వచ్చారు’ అని సబ్బం అన్నారు. పదవుల్ని త్యజించిన విజయమ్మ, జగన్‌ల గొప్పతనాన్ని ఆయన అభినందించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. జగన్, విజయమ్మలను చూసి ఇతర రాజకీయ నేతలు ఎంతో నేర్చుకోవాలని చెప్పారు. కేసీఆర్‌ది అబద్ధాల కుటుంబం టీఆర్ఎస్ నేత కేసీఆర్‌ది అబద్ధాల కుటుంబం అని హరి ధ్వజమెత్తారు. తెలుగువారి ఉనికినే ప్రశ్నించే స్థాయికి ఆయన ఎదిగిపోయారని, హైదరాబాద్ వచ్చి తగిన సమాధానం చెబుతామని అన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ర్టం మీ తాత సొత్తా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆయన ఏపీ రాక్షసుడు అని, అంతమొందించాల్సిందేనని అన్నారు. సమాజంలో చిచ్చుపెడుతున్నవారెవరైనా త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.