తాత దరికే చేరావా..బంగారు తండ్రీ! | ASP Son died In Road Accident at Vizag | Sakshi
Sakshi News home page

తాత దరికే చేరావా..బంగారు తండ్రీ!

Published Thu, May 4 2017 4:55 AM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

తాత దరికే చేరావా..బంగారు తండ్రీ!

తాత దరికే చేరావా..బంగారు తండ్రీ!

బీచ్‌రోడ్‌ ప్రమాదంలో గాయపడ్డ దేవ్‌గురు మృతి
మూడు రోజులు మృత్యువుతో పోరాటం
రెండు రోజుల వ్యవధిలో తిరిగిరానిలోకాలకు తాతా, మనవడు
కొడుకును కడసారైనా చూసుకోలేని ఏఎస్పీ నందకిశోర్‌
కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నం


విశాఖ సిటీ :  దేవ్‌గురు.. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడినా.. ఓడిపోయాడు. అసలే విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని.. దేవ్‌గురు మరణవార్త మరింత కుంగదీసింది. రెండు రోజుల వ్యవధిలో తాతామనవడు అసువులు బాశారు. వేగం.. ఆ కుటుంబం ఉసురు తీసింది. విహారం.. ఆ మనసుల్లో పెను విషాదాన్ని నింపింది. మూడు రోజుల క్రితం వరకూ నవ్వులతో విరబూసిన ఆ మోముల్లో.. ఇప్పుడు కన్నీటిధారలే కనిపిస్తున్నాయి. ఒకరి  నిర్లక్ష్యం.. ఆ కుటుంబానికి నిద్రలేకుండా చేసింది. అతి వేగం.. వారిని కదలలేని పరిస్థితికి తీసుకొచ్చింది. వారి గుండెల్ని తడితే... అన్నీ ఆవేదన స్వరాలే వినిపిస్తున్నాయి.. ఆ కళ్లల్లో.. విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. ఒక్క ప్రమాదం అదనపు ఎస్పీ నందకిశోర్‌ కుటుంబాన్ని కకావికలం చేసేసింది.

విశాఖపట్నంలోని బీచ్‌ రోడ్‌లో ఆదివారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న దేవ్‌గురు(11) బు«ధవారం ఉదయం మృతి చెందాడు. సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవ్‌గురుని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా యత్నించారు. పలు మార్లు శస్త్ర చికిత్సలు నిర్వహించినా.. ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. ప్రమాదం జరిగినప్పుడు.. దేవ్‌గురు కుడికాలు పూర్తిగా నలిగిపోయింది. దీంతో.. సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు కాలుని తీసేశారు.

 ఆ తర్వాత మరో రెండు శస్త్ర చికిత్సలు చేసినా... స్పృహæలోకి రాకపోవడంతో.. నిరంతరం వైద్యులు పర్యవేక్షించారు. మంగళవారం అర్థరాత్రి నుంచి చిన్నారి శరీరం వైద్యానికి సహకరించడం మానేసింది. ఆ పసివాడి పరిస్థితి విషమించండంతో.. వైద్యులు  తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు ప్రమాదం జరిగిన రోజునే.. తండ్రి దూసి ధర్మారావుని పోగొట్టుకున్న విజయవాడ అదనపు ఎస్పీ డీఎన్‌ కిశోర్‌.. ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడి మరణవార్త విని తట్టుకోలేకపోయారు. ఈ ప్రమాదంలోనే గాయపడ్డ డీఎన్‌కిశోర్‌.. కదలలేని స్థితిలో ఉన్నారు. దీంతో.. తన స్నేహితుల్ని ఆస్పత్రికి పిలిపించి.. కుమారుడి అంత్యక్రియలు చూసుకోవాలని చెప్పడం అందర్నీ శోకసంద్రంలో ముంచేసింది. నగరంలోని జ్ఞానాపురం శ్మాశాన వాటికకు దేవ్‌గురు మృతదేహాన్ని తరలించారు.

మరణంలోనూ వీడని బంధం: ఆ తాతంటే.. మనవడికి ఇష్టం.. ఆ మనవడంటే.. తాతకు ప్రాణం. స్వతహాగా.. రచయిత కావడంతో.. రోజూ ఒక నీతి కథ చెప్పి దేవ్‌గురుకి చిన్నతనం నుంచే తాత దూసి ధర్మారావు సుద్దులు నేర్పించేవారు.తాతయ్యతో రోజుకి ఒక్కసారైనా దేవ్‌గురు మాట్లాడకుండా ఉండలేడు. అందుకే.. ఇద్దరి మధ్య బంధం విడదీయలేనంతగా పెనవేసుకుంది. మరణంలోనూ వీరిని ఎవ్వరూ విడదీయలేకపోయారు. ప్రమాదం జరిగిన సమయంలోనూ తాత ఒడిలోనే కూర్చొని ఆడుకుంటున్నాడు.

ఇంతలో మృత్యువు దూసుకొచ్చింది. వారిని కబళించింది. ఆ భీతావహ పరిస్థితిలో.. తండ్రి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వెళ్లి రక్షిద్దామంటే.. తను కూడా అదే పరిస్థితిలో ఉన్నానని ప్రమాదం జరిగిన రోజున సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో వైద్యులకు చెబుతుంటే.. అందరి కళ్లల్లో.. సుడులు తిరిగాయి. కొడుకుని, కూతుర్ని కాపాడాలంటూ.. తనకు వైద్యం చేస్తున్న సమయంలోనే ఆయన.. దేవుళ్లకు మొక్కాడు. కానీ..
ఆయన ప్రార్థన ఫలించలేదు.

తాతకు తగ్గ మనవడు: చిన్నతనం నుంచి తాతయ్య చెప్పే కథలు వింటూ.. పెరిగిన దేవ్‌గురు.. చదువులో చురుకుదనం ప్రదర్శించేవాడు. విశాఖలోని విశాఖ వ్యాలీ స్కూల్‌లో ఆరో తరగతి వరకూ చదువుకున్నాడు. ఈసమయంలోనే పాఠశాలలో జరిగిన వ్యాసరచన, ఇతర పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేవాడు. ఇటీవలే స్కూల్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డుని మంత్రి గంటా శ్రీనివాస్‌ చేతులమీదుగా తాతయ్య సమక్షంలోనే అందుకున్నాడు.

కడసారి వీడ్కోలుకి దూరం: ప్రమాదం జరగకముందు, జరిగిన క్షణంలో  మాత్రమే తమ పిల్లల్ని, తండ్రిని చూసుకున్నారు అదనపు ఎస్పీ నందకిశోర్‌. అప్పటి నుంచి ఇంతవరకూ వారిని చూడలేకపోయారు. చివరికి కన్నతండ్రి కడచూపునకు కూడా నోచుకోలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడు మరణవార్త విన్నాక.. మరింత కుంగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement