వైజాగ్ బీచ్‌రోడ్‌లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయవాడ అదనపు ఎస్పీ నందకిశోర్ కుమారుడు దేవ్‌గురు(11) బుధవారం ఉదయం మృతి చెందాడు.
♦ విశాఖ బీచ్ బస్సు ప్రమాదంలో రెండుకు చేరిన మృతుల సంఖ్య
♦ తండ్రిని, కొడుకును కోల్పోయిన పోలీస్ అధికారి
విశాఖ సిటీ: వైజాగ్ బీచ్‌రోడ్‌లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయవాడ అదనపు ఎస్పీ నందకిశోర్ కుమారుడు దేవ్‌గురు(11) బుధవారం ఉదయం మృతి చెందాడు. దేవ్‌గురు సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో మూడు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో నందకిశోర్ తండ్రి దూసి ధర్మారావు ఘటనా స్థలంలోనే మరణించిన విషయం తెలిసిందే.
నందకిశోర్ కాలు, చేతులకు ఫ్రాక్చర్ కాగా ఆయన కుమార్తె మంజీరకు రెండు కాళ్లూ ఫ్రాక్చర్ అయ్యాయి. వీరిద్దరూ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కుమారుడు కూడా మరణించాడని తెలుసుకున్న నందకిశోర్ అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉండటంతో తన స్నేహితుల్ని ఆస్పత్రికి పిలిపించి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. వారు జ్ఞానాపురం శ్మశానవాటికలో ఆ కార్యక్రమం పూర్తిచేశారు.