మార్మోగుతున్న సమైక్యనాదం | Samaikyandhra agitations continue in seemandhra regions | Sakshi
Sakshi News home page

మార్మోగుతున్న సమైక్యనాదం

Published Mon, Aug 12 2013 12:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

మార్మోగుతున్న సమైక్యనాదం - Sakshi

మార్మోగుతున్న సమైక్యనాదం

ఎందరో త్యాగధనుల ఫలమైన సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను వేర్పాటువాదుల స్వార్ధం కోసం ముక్కలు కానివ్వమంటూ సీమాంధ్ర ప్రజ ఎలుగెత్తిచాటుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణ లక్ష్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎగసిన ఉద్యమం వెల్లువలా సాగుతోంది.

సాక్షి నెట్‌వర్క్: ఎందరో త్యాగధనుల ఫలమైన సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను వేర్పాటువాదుల స్వార్ధం కోసం ముక్కలు కానివ్వమంటూ సీమాంధ్ర ప్రజ ఎలుగెత్తిచాటుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణ లక్ష్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎగసిన ఉద్యమం వెల్లువలా సాగుతోంది. రాష్ర్ట విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై జనాగ్రహావేశాలు వేర్పాటు ప్రకటన వెనక్కితీసుకునే వరకే చల్లారేలా కనిపించడం లేదు. వరుసగా పన్నెండురోజుల నుంచి మిన్నంటుతున్న ఆందోళనలు ఆదివారం నాడు కూడా ఉధ్ధృతంగా సాగాయి. రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలతో అన్నిచోట్లా నిరసనజ్వాలలు హోరెత్తాయి.
 
 వేర్పాటు ప్రకటన దరిమిలా మొదలైన సోనియాగాంధీ, కేసీఆర్, చంద్రబాబుల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు ఆదివారం కూడా యధావిధిగానే సాగాయి. చిత్తూరు జిల్లా  కుప్పంలో కేసీఆర్, చంద్రబాబుల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అనంతపురం జిల్లా పామిడిలో ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను శవపేటికలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లోని సమైక్య శిబిరం ఎదుట గుంతతీసి పూడ్చిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో భవన నిర్మాణ కార్మికులు  కేసీఆర్ దిష్టిబొమ్మను ఇటుకలతో సమాధి చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా  కావలిలో ఆందోళనకారులు ప్రజాకోర్టు నిర్వహించి సోనియా వేషధారికి దేశబహిష్కరణ, కేసీఆర్ వేషధారికి రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించారు.
 
 రోడ్లపైనే క్రైస్తవుల ప్రార్ధనలు
 సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కర్నూలు జిల్లా  కోడుమూరు, గూడూరులలో క్రిస్టియన్లు రోడ్లపైనే  ప్రార్ధనలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరులో క్రైస్తవ సంఘాలు ర్యాలీ, ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో క్రైస్తవ సోదరులు ‘సమైక్య’ ప్రార్థనలు చేశారు. పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు.
 
 రోడ్డుపై వలలతో మత్స్యకారుల నిరసన
 రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో వందలాదిమంది మత్స్యకారులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్ని ప్రధాన కూడళ్లలో రోడ్డుపై వలలు వేసి చేపలు పడుతున్నట్టు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే నదీజలాల సమస్య ఏర్పడి  తామందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని ప్రధానవీధుల మీదుగా క్వారీ లారీలతో ర్యాలీ నిర్వహించారు.
 
 వేర్పాటు భూతం వదిలేందుకు పూజలు
 విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పిలుపుమేరకు క్రీడాకారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో క్రీడలు ఆడుతూ నిరసన ర్యాలీ చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, దిగ్విజయ్, బొత్సల మాస్కులు ధరించిన వారిని హోమం వద్ద కూర్చోపెట్టి వేర్పాటు భూతం వదిలించేందుకు పూజలు జరిపించారు.
 
 ప్రకాశంలో వైఎస్సార్ సీపీ నేతల నిరవధిక నిరాహారదీక్ష
 ప్రకాశం జిల్లా పర్చూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్, మరో ముగ్గురు చేపట్టిన  నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నేత రాజాల ఆదిరెడ్డి సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ పార్టీ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
 
 రేపటి నుంచి ‘తూర్పు’ బంద్
 రాజమండ్రిలో ఆదివారం సమావేశమైన తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని విభాగాల జేఏసీలు 12, 13, 14 తేదీల్లో రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని, 13, 14 తేదీల్లో జిల్లా స్థాయిలో విద్యా, వ్యాపార వర్గాల బంద్ పాటించాలని నిర్ణయించాయి. కాకినాడలో మంత్రి తోట నరసింహం సతీమణి వాణి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆదివారం రెండో రోజుకు చేరింది.
 
 గుంటూరులో రైళ్ల అడ్డగింత
 సమైక్యాంధ్ర జేఏసీ పిలుపులో భాగంగా ఆదివారం గుంటూరులో రైల్‌రోకోలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రైళ్లను అడ్డుకున్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు పి.నరసింహారావు, కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ నేతృత్వంలో గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి వచ్చిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. రైల్‌రోకో నేపథ్యంలో కేంద్ర భద్రతా దళాలు అన్ని రైల్వేస్టేషన్లలో ముమ్మరంగా గస్తీ నిర్వహించాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు, కళాశాలల నుంచి 30వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీకి సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్. శామ్యూల్ పిలుపునిచ్చారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నిరవధిక బంద్ ప్రారంభమవుతుండగా, ఏలూరు నగరంలో మాత్రం సోమవారం ఉదయం నుంచే బంద్ ప్రారంభం కానుంది. స్థానిక జేఏసీ ఈ మేరకు పిలుపునిచ్చింది.
 
 నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్షల్లో  ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి
 వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ ఎదుట సోమవారం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన చేపట్టారు. పోరుమామిళ్ల, ప్రొద్దుటూరులో ముస్లింలు ఉద్యమంలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు.
 
 కొనసాగుతున్న  ‘అనంత’ బంద్
 రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సంఘీభావంగా ఆ పార్టీ చేపట్టిన 48 గంటల జిల్లా బంద్ అనంతపురం జిల్లాలో  విజయవంతంగా కొనసాగుతోంది. పెనుకొండలో హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్పను ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఒకరోజు సామూహిక  సత్యాగ్రహం చేపట్టారు.  కళాకారుల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు.
 
 ఎడ్లబండ్లతో పాలకొండ దిగ్బంధం
 వందలాది ఎడ్లబండ్లతో శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణాన్ని నిరసనకారులు దిగ్బంధించారు.శ్రీకాకుళంలో జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
 
 చెవిటి, మూగసంఘం నిరసన
 చిత్తూరు జిల్లా మదనపల్లెలో చెవిటి, మూగ సంఘం సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు సోనియా, దిగ్విజయ్ సింగ్‌లకు అట్టలతో సమాధులు కట్టి నిరసన తెలిపారు.  పలమనేరులో టమాటా రైతులు భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 వికలాంగుల ర్యాలీ
 కర్నూలు, ఆలూరులలో వికలాంగులు భారీ ఎత్తున తరలివచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో కురువ సంఘం ప్రతినిధులు, గొర్రెల కాపర్లు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శన చేపట్టి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేవనకొండలో వివిధ గ్రామాల నుంచి రైతులు ఎద్దుల బండ్లతో వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో గిరిజన మహిళలు ప్రధాన కూడళ్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా నృత్యాలు చేశారు.
 
 విశాఖతీరంలో హోరెత్తిన సమైక్యనాదం
 సమైక్యాంధ్రపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంపీ సబ్బం హరి నేతృత్వంలో విశాఖ బీచ్‌రోడ్డులో కార్యక్రమం జరిగింది. త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాలో పాదయాత్ర చేస్తున్నట్టు హరి ప్రకటించారు.  జగన్, విజయమ్మల రాజీనామాలపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో రైల్‌రోకో నిర్వహించేందుకు సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ జె.టి.రామారావు ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఆదివారం ఉదయం రైల్వేస్టేషన్‌కు వెళ్తున్న సమయంలో గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
 
 తిరుమలకు బస్సుల రాకపోకలపై నేడు నిర్ణయం
 తిరుమలకు రాకపోకలు చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన వారితో చర్చలు జరిపారు. ఈవిషయంపై జేఏసీ నాయకులు స్పష్టమైన హామీ ఇవ్వకపోగా నిర్ణయం సోమవారానికి వాయిదా వేశారు. చర్చల అనంతరం జేఈఓ మాట్లాడుతూ  ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే తిరుమలకు చేరుకునే భక్తులకు ప్రత్యామ్నాయం కల్పించలేమని తేల్చిచెప్పారు.
 
 బెజవాడలో 15నుంచి 108 గంటల  దీక్ష
 సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ నగరంలో ఆగస్టు 15వ తేదీ నుంచి వందలాది వైద్యులతో 108 గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గోసుల శివభారత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన ఆదివారం వైఎస్సార్ జిల్లా కడపలో ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement