
రాష్ట్రపతి కోవింద్‌ను కలసి వస్తున్న ఆంటోనీ, డి.రాజా, బాలు, సోనియా గాంధీ, ఆజాద్, ఏచూరి
న్యూఢిల్లీ/ముంబై: పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో మంగళవారం ఈశాన్య ఢిల్లీలో ఆందోళనకారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకమైంది. సీలంపూర్ జంక్షన్ వద్ద దాదాపు 3 వేల మందికి పైగా పాల్గొన్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీస్ ఔట్ పోస్ట్‌ను, పోలీసులకు చెందిన రెండు బైకులను, పలు బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు, లాఠీచార్జ్‌లో పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి. మరోవైపు, దేశవ్యాప్తంగా పలు నగరాలు, యూనివర్సిటీల్లో ఈ వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్‌ల్లో నిరసనల తీవ్రత అధికంగా ఉంది. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, ఇజ్రాయెల్ దేశాలు భారత్‌కు వెళ్తున్న తమ పౌరులు జాగ్రత్త పడాలంటూ ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి.
బెంగళూరులో నిరసన తెలుపుతున్న విద్యార్థిని
రాష్ట్రాల్లో..
కేరళలో ఉదయం నుంచి సాయంత్రం వరకు హర్తాళ్ జరపాలన్న 30 ఇస్లామిక్, రాజకీయ సంస్థల పిలుపు మేరకు వివిధ ప్రాంతాల్లో భారీగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజా రవాణా బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. బలవంతంగా దుకాణాలు మూయించారు. పోలీసులు దాదాపు 200 మందిని అరెస్ట్ చేశారు. పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతివ్వడంపై తమిళనాడులో మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ అధికార అన్నాడీఎంకేపై మండిపడ్డారు. దేశాన్ని అభివృద్ధి దిశగా కాకుండా, ముస్లింల హక్కులను కాలరాచే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మండిపడ్డారు. చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించలేదని పశ్చిమబెంగాల్ సీఎం మమత స్పష్టం చేశారు.
ఢిల్లీలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాన్ని ప్రయోగిస్తున్న జవాను
విదేశాల్లో..
ప్రతిష్టాత్మక ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వర్సిటీల్లో విద్యార్థులు, పరిశోధకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికాలోని 40 వర్సిటీలకు చెందిన 400 మంది విద్యార్థులు జామియా విద్యార్థులకు సంఘీభావంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జామియా, ఏఎంయూల్లో పోలీసుల దౌర్జన్యం మానవహక్కుల ఉల్లంఘనేనని అందులో పేర్కొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో అధ్యాపకులు సైతం నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఫిన్లాండ్‌లోని ట్యాంపెర్ యూనివర్సిటీ విద్యార్థులు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి భారతీయ ఎంబసీకి లేఖ రాశారు.
రద్దు చేయించండి
ప్రజా వ్యతిరేక పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ 12 విపక్ష పార్టీలు రాష్ట్రపతిని కలిశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీతారాం ఏచూరి (సీపీఎం), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ), రాంగోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ) సహా సీపీఐ, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫెరెన్స్, ఐయూఎంఎల్ తదితర పార్టీల ప్రతినిధులు రాష్ట్రపతిని కలిశారు. ‘ఇది చాలా సీరియస్ అంశం. దేశాన్ని విచ్ఛిన్నం చేసే చట్టం అది. ఈ చట్టంపై ఈశాన్యంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఆందోళనకారులపై పోలీసుల దౌర్జన్యం దారుణంగా ఉంది’ అని రాష్ట్రపతితో భేటీ అనంతరం సోనియా వ్యాఖ్యానించారు.
అమలు చేస్తాం: అమిత్‌షా
పౌరసత్వ సవరణ చట్టంపై వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. చట్టంలో మైనారిటీలకు వ్యతిరేకంగా ఏమీ లేదని మంగళవారం ‘ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్’లో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ‘పౌరసత్వ చట్టంపై మరో ఆలోచన లేదు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని స్పష్టం చేశారు. ఈ చట్టం న్యాయ సమీక్షకు నిలవబోదన్న విపక్ష వాదనను కూడా ఆయన కొట్టేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్యలుండవని, అయితే, హింసకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలుంటాయని పేర్కొన్నారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడైన వీడీ సావర్కర్‌తో పోల్చుకునే స్థాయి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేదన్నారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment