వాళ్లకేం పని లేదు.. CAAను వెనక్కి తీసుకోం: అమిత్‌ షా | Union Home Minister Amit Shah has responded to the nationwide protests against the CAA - Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలకు ఏ పనీ లేదు.. సీఏఏను వెనక్కి తీసుకోం: అమిత్‌ షా

Published Thu, Mar 14 2024 10:15 AM | Last Updated on Thu, Mar 14 2024 11:14 AM

CAA will never be taken Says HM Amit Shah Slams Oppositions - Sakshi

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో  సీఏఏను వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారాయన.

‘ప్రతిపక్షాలకు ఏ పనీ లేదు. సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఎయిర్‌ స్ట్రైక్స్‌ను కూడా స్వార్థ రాజకీయాల కోసం చేసినట్లు వారు విమర్శిస్తుంటారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకూడదా?. ఆర్టికల్‌ 370 రద్దును కూడా రాజకీయ లబ్ధి కోసం చేసినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. వాళ్ల చరిత్ర అంతా చెప్పింది చేయకపోవడమే.. కానీ మోదీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని సాకారం చేశారు’ అని అమిత్‌ షా తెలిపారు.

‘‘రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో పీడనకు గురైన ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించినది. ముస్లింలు ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదు. దీని గురించి నేను చాలా వేదికలపై మాట్లాడాను. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని అమిత్ షా వెల్లడించారు.

ఆశ్రయం కోరి వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడమనేది మన సార్వభౌమ నిర్ణయమని, దానిపై రాజీపడేది లేదు. పౌరసత్వం కోసం అందరికీ తలుపులు తెరిచే ఉన్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని వాళ్లు చేస్తున్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదు. అది ఆర్టికల్‌ 14కు ఎలాంటి భంగం కలిగించదు. అలాగే.. NRC(జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)తో సీఏఏకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారాయన..

చట్టం అమలు కేంద్రం అంశం..
సీఏఏను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు చేసిన వ్యాఖ్యలను షా తప్పుబట్టారు. ‘‘ఇది కేంద్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రాలది కాదు. ఎన్నికల తర్వాత అందరూ దీనికి సహకరిస్తే మంచిది. బుజ్జగింపు రాజకీయాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు’’ అని షా గట్టిగా చెప్పారు.

సీఏఏపై ఆందోళనలు ఉద్ధృతమైతే చట్టం అమలుపై పునరాలోచనలు చేస్తారా? అన్న ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉపసంహరిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కానీ, వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరని ఇండియా కూటమికి కూడా తెలుసు. ఈ చట్టాన్ని మోదీ సర్కారు తీసుకొచ్చింది. దీన్ని రద్దు చేయడం అసాధ్యం. దీనిపై మేం దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తాం’’ అని స్పష్టం చేశారు.

‘‘ఈ చట్టంతో బీజేపీ కొత్త ఓటు బ్యాంకు సృష్టించుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారికి ఏం పనిలేదు. వాళ్లు చెప్పింది ఎన్నడూ చేయరు. ఒవైసీ, రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ లాంటి వాళ్లు అసత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోసం సీఏఏను ఇప్పుడు అమలు చేయలేదు. 2019లోనే దీన్ని పార్లమెంట్‌లో ఆమోదించాం. కానీ కొవిడ్‌, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. సీఏఏను ఎందుకు వద్దంటున్నారో రాహుల్‌ గాంధీ బహిరంగంగా చెప్పాలి. మీ వ్యాఖ్యలను రుజువు చేసుకునే బాధ్యత మీదే. ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చామో మేం స్పష్టంగా చెప్పాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరూ వివరణ ఇవ్వండి’’ అని అమిత్ షా సవాల్‌ చేశారు.

సీఏఏపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలనూ షా దుయ్యబట్టారు. ‘‘అవినీతి బయటపడిన తర్వాత ఆయన సహనం కోల్పోయారు. వలసలపై అంత ఆందోళన ఉంటే.. బంగ్లాదేశీ చొరబాట్లు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడలేదు?విభజన రోజులను ఆయన మర్చిపోయినట్లున్నారు’’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement