కడప రూరల్, న్యూస్‌లైన్: ఎన్జీఓ నాయకుడు అశోక్‌బాబు సమైక్యాంధ్ర ఉద్యమాలను నీరుగారుస్తున్నారని, ఆయన సమైక్య ద్రోహి, ఎవరూ ఆయన మాటలు నమ్మవద్దని సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జేఏసీ ఛెర్మైన్ కారెం శివాజీ అన్నారు.
సోమవారం స్థానిక వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీఓ నాయకుడు అశోక్‌బాబు తాను సమైక్యవాదినంటూ సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మెరుపు సమ్మెలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటూ ఏమీ చేయకుండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయని, అలాంటిది విభజన అన్ని ప్రాంతాలకు అనర్థదాయకమన్నారు. తెలంగాణా బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదిన చేపడుతున్న ఛలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు విపి నారాయణస్వామి మాట్లాడుతూ కేంద్రం విభజన బిల్లును వెనక్కి తీసుకొని రాష్ట్రంలో అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శరత్‌బాబు, సుధాకర్, రామచంద్రయ్య, కొండయ్య, సింగరయ్య, ప్రకాశమ్మ, రత్నమ్మ పాల్గొన్నారు.