
‘‘కోర్ట్’ సినిమాలో నేను చేసిన మంగపతి పాత్రకి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇలాంటి బలమైన పాత్ర చేయాలన్న నా 25 ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరింది’’ అని నటుడు శివాజీ(Shivaji) తెలిపారు. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పొస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.
ఈ సినిమాలో మంగపతి పాత్ర పొషించిన శివాజీ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాకు నటనలో దాదాపు 12 ఏళ్ల విరామం వచ్చింది. నన్ను మళ్లీ నటించమని నా పిల్లలు కోరేవారు. నాకూ చేయాలని ఉండేది కానీ ఎవర్నీ అవకాశం అడగలేదు. సొంతంగా నేనే ఓ సినిమా నిర్మిద్దామనుకున్న సమయంలో ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ చేశాను. అది చేస్తున్నప్పుడు ‘బిగ్ బాస్’ అవకాశం వస్తే, చేశాను. ఆ షోతో నేనంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. వెబ్ సిరీస్ పెద్ద హిట్ కావడంతో దాదాపు ఎనభై కథలు విన్నాను. చాలావరకూ తండ్రి పాత్రలే కావడంతో తిరస్కరించాను.
‘కోర్ట్’లో మంగపతి పాత్ర క్రెడిట్ డైరెక్టర్ రామ్‌దే. ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య, రాజనాలగార్లు మరపురాని పాత్రలు చేశారు. అలాంటి పాత్రలు చేయాలని నాకూ ఉండేది కానీ హీరోగా ఉండాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. కొత్తవారిని ప్రొత్సహించడంలో నాని గొప్ప చొరవ చూపిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్, ఉషా కిరణ్ మూవీస్ వంటి బ్యానర్స్‌లా వాల్ పొస్టర్ సినిమా అవుతుంది.
ఇక మంగపతి తరహాలో మెడికల్ షాప్ మూర్తి అనే ఓ క్యారెక్టర్ విన్నాను. ప్రస్తుతం నేను నిర్మాతగా, హీరోగా, లయ హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తున్నా. అలాగే ‘దండోరా’ అనే మరో చిత్రంలో నటిస్తున్నాను’’ అని తెలిపారు. ఇంకా రాజకీయాల గురించి మాట్లాడుతూ – ‘‘నేను ఏ పార్టీకి సపొర్ట్‌గా ఉండలేదు... మాట్లాడలేదు. నేను ప్రజల కోసం నిలబడ్డాను. ప్రాంతం కోసం, భావితరాల కోసం పొరాటం చేశాను’’ అని శివాజీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment