బీమా భవన్‌లో ఉద్రిక్తత.. ఏపీ, టీ ఎన్జీవోల పోటాపోటీ నినాదాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోల సమ్మె, తెలంగాణకు అనుకూలంగా టీఎన్జీవోల సద్భావన యాత్రలతో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బుధవారం అబిడ్స్ తిలక్ రోడ్డులోని బీమా భవన్‌లో ఏపీఎన్జీవోలు విధులు బహిష్కరించారు. భోజన విరామ సమయంలో టీఎన్జీవోల సద్భావన యాత్ర నిర్వహించేందుకు తెలంగాణవాదులు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘బీమా భవన్ ఎదుట ఏపీఎన్జీవోలు ధర్నా చేస్తున్నారని, మీరు తర్వాత రావాలని’ ఏసీపీ జైపాల్ రెడ్డి భీమా భవన్ తలుపు మూసి టీఎన్జీవోలను నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, తెలంగాణ ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ ఉద్యోగులు లోపలికి వచ్చి ఏపీఎన్జీవోలు చేస్తున్న ధర్నా వద్ద బైఠాయించారు. దీంతో ఏపీఎన్జీవోలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇదే క్రమంలో ‘జై తెలంగాణ’ నినాదాలు జోరందుకోవడంతో పరిస్థితి గోదరగోళానికి దారి తీసింది. ఇరువర్గాలను తాడు సహాయంతో పోలీసులు వేరుచేశారు. ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించివేయడం తో వివాదం సద్దుమణిగింది.
అంతా దుష్ర్పచారం..ఖండిస్తున్నాం : దేవీ ప్రసాద్
హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులను ఈ ప్రాంతం వదిలివెళ్లిపోవాలంటూ కొంతమంది బెదిరిస్తున్నారంటూ ఢిల్లీలో దుష్ర్పచారం చేస్తున్నారని, దానిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్ అన్నారు. ఒకవేళ నిజంగా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమకు ఫోన్ చేస్తే గంటలోపు అక్కడకు వచ్చి, వారిని కాపాడ తామని స్పష్టం చేశారు.ఏపీఎన్జీవోలకు తాము స్నేహహస్తం చాటుతున్నామని, కమిటీగా ఏర్పడి సమస్యలుంటే చర్చించుకుందామని దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ ఏర్పాటు చేసిన సద్భావన సదస్సులో ఆయన మాట్లాడారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు చేసే సమ్మె దారుణమన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తే తాము రెండు గంటలు అధికంగా పనిచేస్తామని ప్రకటించినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, సచివాలయంలో అన్నిశాఖలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుంటారని సీమాంధ్ర ఉద్యోగులు నిరసన పేరుతో తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడుతున్నా వారికి ఎస్మా, 177 జీవో కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
మన పోరాటం సామాన్యులపై కాదు : కోదండరాం
మన పోరాటం సీమాంధ్ర సామాన్య ప్రజలపై కాదని.. తెలంగాణను అడ్డుకునే కుట్రదారులతోనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. బుధవారం విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. ఈనెల 16 నుంచి ‘విభజనకు సహకరించండి- శాంతిని పెంపొందించండి’ నినాదంతో శాంతి ర్యాలీలు, సద్భావనా యాత్రలు నిర్వహిద్దామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో సీమాంధ్రులు ఉండవద్దని ఇప్పటివరకు ఏ తెలంగాణ వ్యక్తి అనలేదని, కేవలం ఉద్యోగుల్లో మాత్రమే కొద్దిమార్పు ఉంటుందని చెప్పారు. గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యాంద్ర ఉద్యమ జేఏసీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యహరిస్తుంటే, కో చైర్మన్‌గా డీజీపీ దినేష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకుడు విఠల్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అద్దంకి దయాకర్, డాక్టర్ నర్సయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉద్యోగులను ఉద్దేశించి ఫోన్‌లో మాట్లాడారు.