TNGOS
-
‘ప్రక్షాళన కోసం 100 రోజుల శ్రమించాం’
సాక్షి, నిజమాబాద్ : ‘నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కోసం రేయింబవళ్లు కష్టపడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని సాధ్యం చేశాం. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కోసం 100 రోజుల పాటు భార్యా, పిల్లలకు దూరంగా ఉండి పని చేశాం. ఇన్ని చేసినా కూడా ప్రభుత్వం మాపై నిర్లక్ష్యం వహిస్తోంద’ని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఉమ్మడి జిల్లాల టీఎన్జీవోల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరసనలు, ధర్నాలు చేయవద్దంటే ఇన్ని రోజులు చేయలేదని, కానీ ప్రభుత్వం అదే అలుసుగా తీసుకొని ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని వాపోయారు. సీపీఎస్ ను రద్దు చేయాలని చాలాసార్లు కోరినా..ప్రభుత్వం పట్టించేకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి అవార్డులు, రివార్డులు రావడానికి ఉద్యోగస్తులే కారణమని రవీందర్ రెడ్డి అన్నారు. లక్ష మందితో నిరసన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఈ నెల 25 ఏర్పాటు చేసే నిరసన సభకు లక్ష మంది ఉద్యోగులు హాజరు కానున్నట్లు రవీందర్ రెడ్డి తెలిపారు. సపాయి నుంచి ఐఏఎస్ అధికారి వరకు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు హాజరు కావాలని రవీందర్ రెడ్డి కోరారు. -
సచివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు
► నేడు విజేతలకు బహుమతుల అందజేత సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం, ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాలను పురస్కరించుకొని తెలంగాణ సచివాలయ టీఎన్జీవోల యూనియన్ ఆధ్వర్యలో గురువారం సచివాలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో బంగారు తెలంగాణలో ఉద్యోగుల ప్రాతపై ప్రసంగం, పరిపాలన సంస్కరణలపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 11న (శుక్రవారం) బహుమతులు అందజేస్తామని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారం రవీందర్, మామిళ్ల రాజేందర్ తెలిపారు. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో మంత్రులు నాయిని, ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరవుతారని తెలిపారు. -
ప్రజల సేవలో తరించుదాంత
అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం హక్కుల కోసమే టీఎన్జీవోస్ పోరాటం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఘనంగా టీఎన్జీవోల 70 వసంతాల ఉత్సవం టీఎన్జీవో మాజీ నేతలకు ఘన సన్మానం ముకరంపుర : ప్రజల ఆకలి, దుఃఖం పోయి కొనుగోలు శక్తి పెరిగేలా ప్రభుత్వంతో కలిసి ప్రజల సేవలో తరించుదామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని అర్థం చేసుకోవాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గురువారం టీఎన్జీవోల 70 వసంతాల ఉత్సవాలను సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చిరుద్యోగుల నుంచి పెన్షనర్ల వరకు సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోలు పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. జీతభత్యాలు, డీఏలే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడాలన్నారు. గత పాలక ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలతోనే సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. అతి తక్కువ కాలంలో రెండు వందల పై చిలుకు జీవోలను ప్రభుత్వం జారీ చేసిందని చెప్పారు. ఉద్యోగులు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధిలో ఉద్యోగులు మరింత కీలకంగా పనిచేయాలని కోరారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను అభినందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఎన్జీవోస్ అండగా ఉంటుందని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు అన్నారు. ఉద్యోగుల హక్కుల రక్షణ, ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా టీఎన్జీవో సంఘం ముందుకెళ్తోందని చెప్పారు. 1946లో ఏర్పడ్డ సంఘ చరిత్రను విధ్వంసం చేయడానికి కుట్రలు జరిగాయన్నారు. అప్పటి సంఘ నేతలు తెలంగాణ ఉద్యోగుల కోసం ఉద్యమిస్తే బర్తరఫ్ చేశారని, సంఘాన్ని నిషేధించడం జరిగిందని తెలిపారు. సకలజనుల సమ్మె ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలిపిందని, సమైక్యాంధ్ర పీడ విరగడమే సాధించిన గొప్ప విజయమని అన్నారు. చరిత్ర తెలియకుండా మాట్లాడే వారికి తగిన సమాధానం చెబుతామన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరారు. కిందిస్థాయిలో నిరాశ నిస్పృహలను తొలగించేలా ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, పీఆర్సీ ఏరియర్స్ వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రేచల్, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రెడ్డి, కేంద్ర సంఘ నాయకుడు సుద్దాల రాజయ్యగౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు నాగుల నర్సింహస్వామి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్‌రెడ్డి, కాళీచరణ్, సహాధ్యక్షుడు సర్దార్ హర్మీందర్‌సింగ్, వేముల రవీందర్, రాంకిషన్, గూడ ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్, శారద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నేతలకు ఘన సన్మానం టీఎన్జీవో సంఘ ఆవిర్భావం నుంచి రాష్ట్ర, జిల్లా నాయకత్వంలో ఉద్యోగులకు విశేష సేవలందించిన సంఘ పూర్వ నేతలను, ప్రజాప్రతినిధులను శాలువా మెమెంటోతో మంత్రి ఈటల రాజేందర్ ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎంఏ.హమీద్, మాజీ అధ్యక్షుడు రాజేశం, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్యతోపాటు పలువురు నేతలను సన్మానించారు. ఆకట్టుకున్న పాటలు.. సాంస్కృతిక సారథి కళాకారులు బుర్ర సతీష్, తేలు విజయ నేతృత్వంలో పాటలతో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా బృందంలోని ఆవునూరి కోమల పాడిన పాటలను కలెక్టర్ నీతూప్రసాద్ అభినందించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఉద్యోగులపై రాసిన పాటను పాడి అభినందనలందుకున్నారు. -
టెట్, ఎంసెట్ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొనండి
-ప్రభుత్వ ఉద్యోగులకు టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపు -సర్కారుకు టీఎన్జీవోల సంపూర్ణ మద్దతు -ప్రైవేట్ కళాశాలలు బంద్ ఉపసంహరించుకోవాలి కరీంనగర్ : విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్వహించే టెట్, ఎంసెట్ విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కరీంనగర్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన టీఎన్జీవోలతో అత్యవసరంగా సమావేశమై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో విద్యాప్రమాణాలు పెంచే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఘం తీరును ఖండించారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తనిఖీలు చేపడుతోందని సమర్థించారు. విద్యాసంస్థల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు టీఎన్జీవో సంఘం మద్దతునిస్తుందని తెలిపారు. విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. టెట్, ఎంసెట్‌లను బహిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్ణయించుకోవడం సరికాదన్నారు. ప్రైవేట్ కాలేజీలు బంద్ ఉపసంహరించుకుని పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాయిదా వేసిన టెట్, ఎంసెట్ నిర్వహణకు ఉద్యోగుల సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. అవసరమనుకుంటే గౌరవ వేతనం లేకుండా విధులు నిర్వహించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి వేముల సుగుణాకర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నాగుల నర్సింహస్వామి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్, కేంద్ర సంఘం నాయకులు రాజయ్యగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, రాంకిషన్‌రావు, వేముల రవీందర్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్‌రెడ్డి, కాళీచరణ్ పాల్గొన్నారు. -
'ఆలస్యం చేస్తే మరో ఉద్యమానికి సిద్ధం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బందిని రిలీవ్ చేయాలని కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ తెలిపారు. గురువారం వారు కమలనాథన్ కమిటీని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్షలు మేరకు విభజన జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల విభజనలో ఇప్పటికే ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీ ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. త్వరగా ఉద్యోగుల విభజన పూర్తి చేయకుంటే మరో ఉద్యమానికి సిద్ధమని కోదండరాం, దేవీ ప్రసాద్ తెలిపారు. -
'స్థానికత ఆధారంగానే విభజించండి'
న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులను వారివారి స్థానికత ఆధారంగానే రెండు రాష్ట్రాలకు విభజించాలని తెలంగాణ ఎన్జీవోలు కోరారు. ఈ మేరకు టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ ఆధ్వర్యంలోని ఉద్యోగ సంఘం నేతలు సోమవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్. సి. గోయల్ కు విన్నవించారు. విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని టీఎన్జీవోలు కోరగా.. సాధ్యమైనంత త్వరలో ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు గోయల్ హామీ ఇచ్చారు. -
సెక్షన్ 8 రద్దు చేయాలి: టీఎన్జీవోలు
హైదరాబాద్: గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సెక్షన్ 8ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఎన్జీవోలు ఆందోళన బాట పట్టారు. బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశారు. సెక్షన్ 8 ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ఖమ్మం, వరంగల్‌లో జెడ్పీ కార్యాలయాల ముందు, నల్లగొండ కలెక్టరేట్ ముందు కూడా టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శనకు దిగారు. -
నష్టం లేకుండా అమ్మేద్దాం
జవహర్‌నగర్, బండ్లగూడ హౌసింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్ణయం ధరల నిర్ధారణకు సీఎస్ నేతృత్వంలో కమిటీ రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన రెండు భారీ ప్రాజెక్టులు... జవహర్‌నగర్, బండ్లగూడ ప్రాజెక్టులను గంపగుత్తగా అమ్మేయాలని తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. వాటి ధరలను నిర్ధారించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ నేతృత్వంలోని నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ త్వరలో ధరలు ఖరారు చేస్తుంది. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో దివాలా తీసి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను ఇకపై కొనసాగించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే దీనికి తాజా బడ్జెట్లో కేవలం లక్ష రూపాయలే ఇచ్చారు. జవహర్‌నగర్: సీఆర్పీఎఫ్ హౌసింగ్ సొసైటీకి వైశాల్యం: 10 ఎకరాలు. భవనసముదాయం: జీప్లస్ 14 పద్ధతిలో 2,858 ఫ్లాట్లు అమ్ముడైనవి: 0 కారణం: స్వగృహ కార్పొరేషన్‌కు నిధుల కొరతతో అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పటికైన ఖర్చు: రూ.360 కోట్లు పూర్తిచేసేందుకు: మరో 100 కోట్లు అవసరం సీఆర్పీఎఫ్ ఏం కోరుతోంది: ఈ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ చాలాకాలంగా ఆసక్తి చూపుతోంది. బుధవారం సీఆర్పీఎఫ్ ప్రతినిధులతో గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశ్ చర్చించి వివరాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ ముందుంచారు. తమది కూడా ప్రభుత్వరంగ సంస్థ అయినందున వీలైనంత తక్కువ ధరకు ఇవ్వాలని సీఆర్పీఎఫ్ కోరింది. ప్రభుత్వ ఆలోచనేంటి: ప్రాజెక్టుకు ఇప్పటివరకు అయిన ఖర్చును రాబట్టుకోవాలి. లాభాపేక్ష వద్దు. ఈ మేరకు ధరలు నిర్ణయించి వచ్చే అడ్వాన్సుతో పనులు పూర్తిచేసి కొనుగోలుదారులకు అప్పగించాలి. బండ్లగూడ: టీఎన్జీవోలకు నిర్మాణ ప్రాంతం: 15 ఎకరాలు భవనసముదాయాలు: జీప్లస్ 9 పద్ధతిలో 2,800 ఫ్లాట్లు ఇప్పటికి అమ్ముడైనవి: 600 ఫ్లాట్లు కారణం: ఫ్లాట్ల ధరపై స్వగృహ కార్పొరేషన్ పట్టువిడుపులు ప్రదర్శించకపోవడం. కొనుగోలుదారులు ఎవరైనా ఆసక్తి చూపినా వారికి సరైన సమాచారం లభించకపోవడం. ఇప్పటికైన వ్యయం: రూ.460 కోట్లు టీఎన్జీవోలు ఏం అడిగారు: రాయితీ ధరలకు బండ్లగూడ ప్రాజెక్టు ఇళ్లను తమకు కేటాయించాలని టీఎన్జీవోలు ఇదివరకే కోరారు. చదరపు అడుగు ధర రూ.1,600-రూ.1,800 మధ్య ఉండాలని కోరినట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించినందువల్ల ప్రభుత్వం తమ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తుందని వారు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఏమంటోంది: అంతమేర నిర్ధారిస్తే ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉన్నందున దాన్ని రూ.2,100 - 2,300 మధ్య నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంతమేరకు పట్టువిడుపుల ధోరణి ఉండొచ్చు. - సాక్షి, హైదరాబాద్ -
దేవీప్రసాద్‌ను కాదని నిజామాబాద్ వ్యక్తికి టికెట్టా
టీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి ఫైర్ హైదరాబాద్: టీఎన్జీవోస్ నేత దేవీప్రసాద్‌ను కాదని కొత్త ప్రభాకర్‌రెడ్డిని నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి మెదక్ లోక్‌సభ టికెట్టు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని టీడీపీ అధికార ప్రతినిధి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్ నుంచి వలస వచ్చినట్టు చెప్పుకున్న కేసీఆర్ సీఎం అయ్యారని, గుంటూరు విద్యార్థి కేటీఆర్ తెలంగాణలో ఉద్యోగానికి పనికిరాకున్నా మంత్రిని చేశారని విమర్శించారు. తెలంగాణ వ్యక్తినే సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలన్నారు -
దేవీప్రసాద్‌ను నిలపండి
టీఆర్ఎస్కు టీఎన్జీఓ కార్యవర్గం విజ్ఞప్తి.. ఏకగ్రీవ తీర్మానం కారుణ్య నియామకాలు, పదోన్నతులపై నిషేధం వద్దు సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా తమ అధ్యక్షుడు జి. దేవీప్రసాదరావును పోటీ చేయించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీఎన్జీఓస్) రాష్ట్ర కార్యవర్గం సోమవారం నాడిక్కడ ఏకగ్రీవంగా తీర్మానించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామి అయిన దేవీప్రసాద్‌కు టీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసింది. నాం పల్లి టీఎన్జీఓ భవన్లో సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. దేవీ ప్రసాద్ పోటీ, జిల్లా స్థాయిలో కారుణ్య నియామకాలు, పదోన్నతులు, సమగ్ర సర్వేపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు చేశారు. దేవీప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలంటూ పది జిల్లాల కార్యవర్గాలు చేసిన ఏకగ్రీవ తీర్మానాలను కేంద్ర సంఘానికి అందజేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులు అందరినీ గౌరవిం చి న ట్టు అవుతుందన్నారు. కారు ణ్య నియామకాలు, పదోన్నతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన ‘మన రాష్ట్రం - మన ప్రణాళిక’ కార్యక్రమంలో, సమగ్రసర్వేలో పని గంటలతో సంబంధం లేకుండా పనిచేయాలని తీర్మానించింది. సర్వేను విజయవంతం చేయాలని ప్రజలను కోరింది. సమావేశంలో టీఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి, గంగారం, అశోక్, ముజీబ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
30లోగా పీఆర్సీ నివేదికను అందజేయండి: టీఎన్జీవోస్
హైదరాబాద్: పదో పీఆర్సీ నివేదికను 70 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్‌తో రూపొందించి ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవోస్) నేతలు విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ నే తృత్వంలో నేతలు రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, వేణుమాధవ్ , చారి, తదితరులు బుధవారం సచివాలయంలో ఈ మేరకు పీఆర్సీ కమిషనర్ అగర్వాల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పీఆర్సీ గడువును ప్రభుత్వం మే 31వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో పీఆర్సీ నివేదికను త్వరగా అందజేయాలని వారు కోరారు. వివిధ శాఖలు కోరిన విధంగా వేతనాలను నిర్ధారించాలని విన్నవించారు. అనామలీస్ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేకుండా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. -
రోజూ అదనంగా పనిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావడానికి అధిక సమయం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని టీఎన్జీవోలు ప్రకటించారు. సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అధ్యక్షతన మంగళవారం టీఎన్జీవో భవన్లో కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. అందులోని ముఖ్యాంశాలు.. తెలంగాణ ఏర్పాటు కేవలం ఉద్యోగులకు కాదు. అన్ని వర్గాల ప్రజల కోసం. తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రోజూ అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరులకు అంకితం చేయాలి. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలి. రాజకీయ జేఏసీ చైర్మన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలి. సీమాంధ్ర ఉద్యోగుల పట్ల ఘర్షణ వాతావరణం ఉంది. వారి మీద వ్యతిరేకత లేదు. మా ఉద్యోగాలు, ప్రమోషన్లను కొల్లగొట్టడం వల్లే 1969 నుంచి తెలంగాణ ఉద్యోగుల్లో ఆవేదన ఉంది, అందుకే ఉద్యమించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందంటూ కొన్ని పార్టీలు చేసిన ప్రచారంలో వాస్తవం లేదు. అందరూ స్వేచ్ఛగా ఉండవచ్చు. అయితే ఇతరుల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానికత ఆధారంగా ఉద్యోగుల, పెన్షనర్ల విభజన జరగాలి. మొత్తం ఉద్యోగాల్లో 42 శాతం తెలంగాణకు, 58 శాతం సీమాంధ్రకు పంచాలి. మా వాటా 42 శాతంలో పూర్తిగా తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ఇప్పటికే మా ఉద్యోగాలు కొల్లగొట్టడం వల్ల తీవ్రమైన అన్యాయాన్ని భరించాం, పెన్షనర్ల భారాన్ని కూడా తెలంగాణ మీద నెడితే అంగీకరించం. సీమాంధ్ర పెన్షనర్లకు మేం వ్యతిరేకం కాదు. స్థానికత ఆధారంగానే పెన్షనర్ల విభజన జరగాలి. ప్రైవేటు ఉద్యోగుల్లో 80-90 శాతం మంది తెలంగాణేతరులే ఉన్నారు. ఇక మీదట ప్రైవేటు రంగంలో 80 శాతం ఉద్యోగాలు తెలంగాణవారికే ఇవ్వాలి. మార్చి 31 నాటికి కొత్త పీఆర్సీ అమలుచేయాలి. హెల్త్‌కార్డుల స్టీరింగ్ కమిటీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. రెండు రాష్ట్రాలకు రెండు స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, వెంటనే పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి. సీఎం రాజీనామా తర్వాత కూడా ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన జీవోలు వచ్చాయి. ఈ నెల 19 తర్వాత వెలువడిన జీవోలను రద్దు చేయాలి. మార్చి 15 నుంచి 30 వరకు తెలంగాణవ్యాప్తంగా తెలంగాణ పునర్నిర్మాణ సభలు నిర్వహిస్తాం. ఏప్రిల్ తొలివారంలో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో సదస్సు ఏర్పాటుచేస్తాం. -
తెలంగాణ బిల్లుకు TNGO నేతల పూజ
-
గ్రాట్యుటీ రూ.15లక్షలకు పెంచాలి
పీఆర్సీకి టీ-ఎన్జీవోల ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం చెల్లిస్తున్న గ్రాట్యుటీని రూ.15 లక్షలకు పెంచాలని టీఎన్జీవోలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 69 శాతం ఫిట్మెంట్తో జీతాలు చెల్లించాలని, కనీస వేతనం రూ. 15 వేలుగా నిర్ధారించాలని కోరారు. పదోపీఆర్సీ అమలు ఆలస్యమవుతున్నందున ఉద్యోగులందరికీ 45 శాతం మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పీఆర్సీ చైర్మన్‌ను కోరారు. గతంలో తాము చేసిన ప్రతిపాదనలపై వివరణ ఇచ్చేందుకు టీఎన్జీవోలు బుధవారం సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ పీకే అగర్వాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో పీఆర్సీకి అందజేసిన ప్రతిపాదనలను వెల్లడించారు. 610 జీవోకు విరుద్ధంగా, అక్రమ డిప్యుటేషన్లపై హైదరాబాద్‌లో కొనసాగుతున్న సీమాంధ్ర ఉద్యోగులందరూ విభజన తరవాత తిరిగి వారి ప్రాంతానికి వెళ్లాల్సిందేనన్నారు. టీఎన్జీవోల ప్రతిపాదనల్లో ప్రధానమైనవి... వచ్చే ఏడాది ప్రారంభం నుంచైనా పీఆర్సీని అమల్లోకి తేవాలి. పీఆర్సీ అలస్యమైనందున ఉద్యోగులందరికీ 45 శాతం ఐఆర్ వెంటనే చెల్లించాలి. నాలుగో తరగతి ఉద్యోగికి కనీస వేతనం రూ.15 వేలుగా నిర్ధారించాలి. ఇంక్రిమెంట్ 3 శాతం కంటే తక్కువ కాకూడదు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంను అమలుజేయాలి. అంత్యక్రియల ఖర్చును రూ. 10 వేల నుంచి రూ. 25వేలకు పెంచాలి, ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే పది రోజుల ప్రత్యేక సెలవులు కేటాయించాలి. హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిలో హెచ్ఆర్ఏను 30 శాతం చెల్లించాలి. జిల్లా కేంద్రాల్లో 25 శాతం, 50 వేల జనాభా దాటిన పట్టణాల్లో 18.5 శాతంగా నిర్ధారించాలి. పదవీ విరమణ వయసును 60కి పెంచాలి. పెన్షనర్లకు హెచ్ఆర్ఏ. పెన్షన్ వృద్ధి వయస్సును 75 నుంచి 65 సంవత్సరాలకు తగ్గించాలి. హైదరాబాద్‌లో 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలి. మహిళల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల్లో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సెంట్రల్ అసోసియేషన్ పీఆర్సీకి విజ్ఞప్తి చేసింది. అలాగే వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని ప్రవేశపెట్టాలని కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఇ.వెంకటేశం నేతృత్వంలో టి.ప్రభాకర్, సుధాకర్, రాంశెట్టి, పవన్‌కుమార్ తదితరులతో కూడిన ప్రతినిధిబృందం బుధవారం పీఆర్సీ చైర్మన్ అగర్వాల్‌తో చర్చలు జరిపింది. పెన్షన్ నిర్ధారణకు ఆఖరు నెల వేతనంలో డీఏను కూడా కలపాలని, గెజిటెడ్ అధికారులకు బస్‌పాస్ సౌకర్యం లేనందున పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలని ఈ బృందం కోరింది. -
'తెలంగాణవాదుల సహనాన్ని పరీక్షించొద్దు'
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘తెలంగాణ కోసం 1100 మంది ప్రాణాలను పణంగా పెట్టారు. రాష్ట్ర సాధనకు 60 ఏళ్లుగా సుదీర్ఘ ఉద్యమం సాగుతోంది. ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఈ సమయంలో కొందరు సీమాంధ్రులు కుట్ర పన్ని తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించడం సరికాదు’ అని టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఈనెల 29న జరిగే సకలజన భేరి పోస్టర్‌ను టీఎన్జీవోస్ సంఘ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని సీమాంధ్రులకు సూచించారు. జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు సీమాంధ్ర అధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే సీమాంధ్ర అధికారులు వారి ప్రాంతాలకు వెళ్లాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు భాగస్వాములవుతారని, ఉద్యోగులను ఇబ్బం ది పెడితే ఆ తర్వాత వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో వెనుకబడిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి సాధ్యమని, అందుకే దశాబ్దాలుగా ఉద్యమం సాగుతోందని వివరించారు. చరిత్ర, అవశ్యకత, అవసరం తెలియని సీమాంధ్ర స్వార్థ రాజ కీయ నాయకులు, ఉద్యోగులు స్వలాభం కోసం కృతిమ ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. ఏపిఎన్జీవో నాయకుడు అశోక్‌బాబు హద్దుమీరి వ్యవహరిస్తున్నాడని, తెలంగాణ ప్రజలను, ఉద్యోగులను కించపరచేలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే సకలజనుల భేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి ఇది కీలక సమయమని, దీనికి ఉద్యోగులు అండగా నిలవాలని కో రారు. కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కారుమంచి శ్రీనివాసరావు, సాంబశివరావు, టీటీజేఏసీ జిల్లా అధ్యక్షుడు నాగి రెడ్డి, నాయకులు కె.కృష్ణారెడ్డి, అశోక్ చక్రవర్తి, వెంకటేశ్వరరావు, మదన్‌సింగ్, కొం గర వెంకటేశ్వరరావు, నారాయణ, శంకర్, బాబుజాన్ ,మురళి, రత్నాకర్, శ్రీనివాసరావు, కోడి లింగయ్య, కోటేశ్వరరావు, మల్లెల రవీంద్రపసాద్, రమేష్, వెంకటేశ్వర్లు, ఎం.వెంకటేశ్వరరావు, సారధి, వల్లోజు శ్రీనివాస్, రమణయాదవ్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
సకల జన భేరితో సమాధానం చెబుదాం: దేవీప్రసాద్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణపై ఆధిపత్యం కోసమే సీమాంధ్రులు ఉద్యమం చేస్తున్నారని టీఎన్జీఓల అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో టీఎన్జీఓల జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అధ్యక్షతన 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకలజన భేరికి సన్నాహకంగా జనభేరి సభను నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న దేవీప్రసాద్ మాట్లాడుతూ, టీఎన్జీఓల ప్రతి పోరాటం ప్రజల పక్షానే సాగిందన్నారు. 1952లో ఫజల్ అలీ కమిషన్ ఎదుట తిరుగుబాటు జెండా మొదలు, నేటి ఉద్యమం వరకు ప్రజల పక్షానే పోరాడుతున్నామన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్న సీమాంధ్రులు..చరిత్రను తెలుసుకోవాలన్నారు. 1956కు పూర్వమే చార్మినార్, ఉస్మానియా యూనివర్సిటీ, వైద్యశాల, ఎముకల ఆస్పత్రి, డ్రైనేజి వ్యవస్థతో హైదరాబాద్ ప్రపంచంలోని ఐదు సుందర నగరాల్లో ఒకటిగా కీర్తి గడించిందన్నారు. విలీన సమయం నుంచి సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాటకు దక్కాల్సిన 5 లక్షల 20 వేల ఉద్యోగ్లాలో కేవలం 2 లక్షలు మాత్రమే దక్కాయన్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టి ఈ ప్రాంత వెనుకబాటు తనానికి కారణమైంది మీరుకాదా అని సీమాంధ్రులను ఆయన ప్రశ్నించారు. 610 జీఓ, 36 జీఓ, గిర్గ్లానీ కమిటీల ద్వారా సీమాంధ్రులు లక్షలాది ఉద్యోగాలు కొల్లగొట్టిన విషయం తేటతెల్లమైందన్నారు. అందువల్లే కడుపు మండి ప్రజల పక్షాన టీఎన్జీఓలంతా పోరాడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా వత్తిడి తేవాలన్నారు. ఏపీ సేవ్ పేరిట ఏపీఎన్జీఓలు నిర్వహించిన సభకు రాష్ట్ర ప్రభుత్వం రాచమార్గంలో సహకరించిందన్నారు. వేలాది మంది సీమాంధ్రుల మధ్య దుబ్బాక ముద్దుబిడ్డ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను చాటి చెప్పాడన్నారు. ఒకడి నినాదాన్నే సహించలేని సీమాంధ్రులు నాలుగున్నర కోట్ల ప్రజల నినాదాలిస్తే ఆ సునామీలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. విభజన అనివార్యమని, అందుకు సహకరించాలని ఏపీఎన్జీఓలను దేవీప్రసాద్ కోరారు. సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం అన్ని రాజకీయ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని తేలిపోయిందన్నారు. సీమాంధ్రను చూసైనా ఐక్యమై ప్రజల ఆకాంక్ష మేరకు అధిష్టానంపై వత్తిడి చేసేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌పై కిరికిరి చేయవద్దని...హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే నినాదం ఇచ్చారు. అక్రమంగా ప్రవేశించిన సీమాంధ్రులు కొల్లగొట్టిన ఉద్యోగాలతో ఈ ప్రాంతంలోని బిడ్డలు పరాయి బిడ్డలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయాలి ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేయాలనీ, మహిళ పోస్టులను పూర్తి స్థాయిలో తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా నియమించాలని టీఎన్జీఓల కేంద్ర కమిటీ సభ్యుడు కారం రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. టీఎన్జీఓల కార్యాచరణలో నిజాయితీ ఉందనీ, ఆ మేరకు పనిచేయడం వల్లే ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ సమస్యలను పరిష్కరించుకుంటున్నామన్నారు. 29న నిర్వహించనున్న సకలజన భేరికి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న సమయంలో సీమాంధ్ర మంత్రుల భార్యలు ఏం చేశారని టీఎన్జీఓల మహిళా విభాగం అధ్యక్షులు రేచల్ ప్రశ్నించారు. తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివప్రసాద్, కేంద్రకమిటీ సభ్యులు ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ పోరాటమన్నారు. సెక్రటేరియట్లో సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనం కారణంగానే ఈ ప్రాంతం వెనుకబడిందన్నారు. సమావేశంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, టీఎన్జీఓల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, శ్రీనివాస్‌రెడ్డి, శ్వాంరావు తదితరులు మాట్లాడుతూ, సకలజన భేరికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జీతం కోసం పీఆర్సీ జీవితం కోసం తెలంగాణ నినాదంతో ముందుకు సాగుదామన్నారు. ఈ సందర్భంగా సకలజన భేరి వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. -
హైదరాబాద్ మాదే! : దేవీప్రసాద్
ఆర్మూర్/ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నాలుగు వందల ఏళ్లుగా తెలంగాణ ప్రాంత ప్రజలు తమ శ్రమశక్తితో నిర్మించుకున్న హైదరాబాద్‌పై వేరెవ్వరికీ హక్కులేదని, ముమ్మాటికీ హైదరాబాద్ తమదేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌పై ఏపీఎన్జీవోలు ఆధిపత్య, దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని, లేనిపక్షంలో విస్ఫోటం తప్పదన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల మౌనమే రాష్ట్ర ఏర్పాటులో జాప్యానికి కారణమన్నారు. ఈ నెల 29న జరిగే సకల జనుల భేరిని ఉద్యోగులు విజయవంతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఆత్మగౌరవాన్ని చాటాలని కోరారు. సమావేశం సంఘం కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో పెట్టేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీఎన్జీవోల భేరిలో దేవీప్రసాద్ అన్నారు. -
దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఘర్షణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనరేట్‌లో ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమైక్యాంధ్ర, విభజనకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల మధ్య.. ఇతర శాఖల ఉద్యోగులు వారి ఆందోళనల్లో పాల్గొనవద్దనే ఒప్పందం కుదిరింది. అయితే ఏపీఎన్జీవోలు ఈ ఒప్పందాన్ని మీరి ఇతర శాఖల వారిని పిలిపించుకుని సమ్మె నిర్వహిస్తున్నారంటూ దేవాదాయ శాఖ తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖలోని ఇరుప్రాంతాల ఉద్యోగులు ఒకరినొకరు దూషించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇరు పక్షాలు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. వారు పక్కపక్కనే ఆందోళనలు నిర్వహించడంతో వారి మధ్య తీవ్ర తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఒకరికొకరు తలపడేందుకు యత్నించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనలు విరమించాలని ఇరువర్గాలనూ ఆదేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
ఏపీఎన్జీఓలకు సర్కారు ప్రోత్సాహం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరా ట ఆకాంక్షపై కేంద్రం యూటర్న్ తీసుకు న్నా... హైదరాబాద్‌పై ఇంకేమైనా నిర్ణ యం తీసుకున్నా.. యుద్ధానికి సిద్ధమేనని టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అ న్నారు. సోమవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన టీఎన్జీఓస్ భేరిలో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఉద్యమా ల ఫలితంగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు. ఆ ప్రకటనపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ఆంధ్రప్రదేశ్ సభకు సర్కారే దగ్గరుండి రాచ మర్యాదలు చేసిందని విమర్శిం చారు. ఏపీఎన్జీఓలకు బస్‌లలో బిర్యాని పొట్లా లు, మినరల్ బాటిల్లు అందించిందన్నారు. సభ నిర్వహణ, స్క్రిప్ట్ అంతా ముఖ్యమంత్రి కనుసన్నుల్లో నడిచిందన్నారు.తెలంగాణ ఉద్యోగుల పోరాటం సీమాంధ్ర ప్రజలపై కాదని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, మండలాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీఎన్జీఓలకు తెలంగాణ ప్రాంతంపై అవగాహన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీఎన్జీఓ అధ్యక్షులు అశోక్‌బాబు ఒక్కటేనన్నారు. చంద్రబాబు రచించిన స్క్రిప్ట్‌ను అశోక్‌బాబు అమలు పరుస్తున్నాడన్నా రు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులపై మొదటి నుంచి వివక్ష కొనసాగుతోందన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల తరబడి పోరాటం కొనసాగిస్తున్నారన్నా రు. ఈ పోరాటంలో ఎంతో మంది ఉద్యోగులు అరెస్టు అయ్యారని, సస్పెన్షన్లు, డిస్మిస్లు జరి గినా అలుపెరుగకుండా పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సకల జనుల భేరికి లక్షలాదిగా తరలిరావాలన్నారు.సకల జనుల భేరి విజయవంతానికి తెలంగాణలోని అన్ని జిల్లాలో టీఎన్జీఓల భేరి నిర్వహిస్తున్నామన్నారు. 1969 సంవ త్సరం నుంచి టీఎన్జీఓలు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారన్నారు. 1969లో 38 రోజులు, 1985లో ఎన్టీఆర్ హయాంలో, 2009 సకల జనులసమ్మెలో తెలంగాణ కోసం గొంతెత్తి టీఎన్జీఓలు పోరా టం చేశారన్నారు. సీడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేసిన అనంతరం కూడా కేంద్రం తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేస్తోందన్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తన మాతృశాఖలో ఏం జరుగుతుందో కూ డా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.ట్రెజరీ గజిటెడ్ అధికారులు నేటి నుంచిసమ్మొకు పిలుపునిస్తే ఆయన సీమాంధ్ర సమ్మె ఉధృతం గా ఉందంటూ ఢిల్లీలో లాబీలకు దిగారన్నారని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు.జూలై 1 నుంచి పీఆర్సీ ప్రకటించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోం దన్నారు. ఉద్యోగులందరికీ 45 శాతం ఇంటీరియల్ రిలీఫ్ ఫండ్ విడుదల చేయాలని ఆయ న డిమాండ్ చేశారు. టీఎన్జీఓస్ రాష్ట్ర కార్యాదర్శి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఉం దన్నారు. ఏపీఎన్జీఓలు రెచ్చగొట్టినా తెలంగాణ ఉద్యోగులు మౌనం దాల్చరని, అది బలహీనత అనుకుంటే భ్రమేనన్నారు. మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సహనాన్ని సీమాంధ్రులు పరీక్షిస్తున్నారన్నారు. నిజంగా తెలంగాణ ప్రజ లు తలుచుకుంటే హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ వెనక్కి వెళ్లలేకపోయేవారన్నారు. తెలంగాణ కోసం 1969లో 400 మంది, 2009 నుంచి వెయ్యిమందికిపైగా అమరులైనారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఏపీఎన్జీఓల అధ్యక్షులు అశోక్బాబుది దింపుడు కల్లెం ఆశ మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని యూీ పఏ కాకుంటే ఎన్డీయే ఇచ్చితీరుతుందన్నారు. టీపీఎఫ్ ఉపాధ్యక్షులు వేదకూమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన, సామాజిక ఉద్యమం తెలంగాణ ఉద్యమమన్నారు. ఉద్యమానికి ప్రజ లు నాయకత్వం వహిస్తున్నారన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ, తెలంగాణ కళాకారుడు రసమయి బాలకిషన్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు గైని గంగారాం, ఎ.కిషన్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కరుణాటి యాదగిరి, బీజేపీ నాయకులు బాపురెడ్డి, బీఎస్ పీ నాయకులు ఎడ్ల రాము, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్, జేఏసీ నాయకులు విఠల్‌రావు, భాస్కర్, లక్ష్మన్, బాబురాం, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకర్, ట్రెజరీ అధ్యక్షులు రాములు, వెయ్యి మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
మరో ప్రజా ఉద్యమం తప్పదు: దేవీప్రసాద్
తెలంగాణ ప్రజలపై రాయల తెలంగాణ అంశాన్ని రుద్దితే మరో ప్రజా ఉద్యమం తప్పదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు. రాష్ట్ర విభజన గురించి కాకుండా.. అసలు విభజనే వద్దంటూ చర్చించాలని చెబితే మాత్రం అసలు తాము చర్చల్లోనే పాల్గొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరు పెద్దమనుషులం కూర్చుని రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడుకున్నామంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని దేవీప్రసాద్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేదీ తమకు సమ్మతం కానే కాదని ఆయన స్పష్టం చేశారు. -
30న TNGOల మహాసభ
-
హైదరాబాద్ మాదంటే.. మాదే
'సేవ్ ఆంధ్రప్రదేశ్' నేపథ్యంలో.. ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు మాటకు మాట తూటాల్లా పేల్చుకుంటున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఇంకా ఉందని, అందువల్ల రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో సమావేశం పెట్టుకోడానికి తమకు పూర్తి హక్కు ఉందని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ యు. మురళీకృష్ణ వాదించారు. తాము సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ పెట్టుకున్న రోజునే వాళ్లు శాంతి ర్యాలీ పెట్టాలనుకోవడం సరికాదని, కావాలనుకుంటే అంతకంటే ఒకటి రెండు రోజుల తర్వాత, లేదా అది అవమానకరం అనుకుంటే ఒకటి రెండు రోజుల ముందే నిర్వహించుకోవచ్చు గానీ సరిగ్గా అదే రోజున ర్యాలీ పెట్టి, తమ వేదిక వద్దకే వస్తామని చెప్పడం అశాంతి సృష్టించడం తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. వాళ్లు అంటున్నట్లుగా తాము పక్కింట్లో వెళ్లి సమావేశం పెట్టుకోవట్లేదని, రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లోనే పెట్టుకుంటున్నామని చెప్పారు. సొంతిల్లు అనాలంటే నరేంద్రరావు కూడా ఆయన సొంత ఊరైన దేవరకొండలోనే సమావేశం పెట్టుకోవాలి తప్ప హైదరాబాద్ రావడానికి వీల్లేదని, ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల్లో తమవాళ్లను అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇది సరికాదని, తాము నిర్వహిస్తున్న సభ ఎవరికీ వ్యతిరేకం కాదని.. కేవలం అవగాహన సభ మాత్రమేనని వెల్లడించారు. దీనిపై తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం కన్వీనర్ నరేందర్‌రావు కూడా దీటుగా స్పందించారు. హైదరాబాద్ నగరంలో అందరినీ ఉండాలనే చెబుతున్నాం గానీ, ముమ్మాటికీ ఈ నగరంపై పెత్తనం మాత్రం తమదేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన భూమిపుత్రులదే ఇక్కడ పెత్తనమని కుండ బద్దలుకొట్టారు. కలిసుండాలనుకుంటున్న 13 జిల్లాల్లో ఎక్కడైనా కావాలంటే సభ నిర్వహించుకోవచ్చు గానీ.. పక్కింటికొచ్చి అక్కడ సభ పెట్టుకుంటామంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. వాళ్లు (ఏపీ ఎన్జీవోలు) సమావేశం నిర్వహించుకున్నంత మాత్రాన మిన్ను విరిగి మీద పడేది ఏమీ లేదని, ఇన్నాళ్లూ కొంతవరకు సంఘర్షణాత్మక వైఖరి ఉన్నా.. ఎందుకొచ్చిందని తాము ఊరుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రక్రియ ఎటూ ముందుకెళ్లేదే తప్ప వెనక్కి జరిగేది కాదని, ప్రత్యేకరాష్ట్రం సిద్ధించి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. -
శాంతి ర్యాలీ అనుమతికి హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ నగరంలో ఈ నెల 7వ తేదీన టీఎన్జీవోలు చేపట్టనున్న శాంతి ర్యాలీకి ప్రభుత్వం అనుమతించకపోవడంపై న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ శ్రీరంగరావు రాష్ట్ర హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేపట్టనున్న భారీ బహిరంగ సభకు అనుమతించిన ప్రభుత్వం టీఎన్జీవోల ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని శ్రీరంగారావు కోర్టులో దాఖలు చేసిన పిటషన్‌లో పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం లేదా రేపు హైకోర్టులో ఆ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభను నిర్వహించనుంది. అందుకు అనుమతించాలని ఏపీఎన్జీవోల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అనుమతిని మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. అయితే అదే రోజు తెలంగాణ ప్రాంత ఎన్జీవోలు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు మాత్రం ప్రభుత్వం నిరాకరించింది. దాంతో టీఎన్జీవోలు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని శ్రీరంగారావు హైకోర్టును ఆశ్రయించారు. -
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నినాదాలు, ఉద్రిక్తత
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీఎన్జీవో, టీఎన్జీవోల నినాదాలతో రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు మారుమోగుతున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న నిరసనలు, ధర్నాలను అక్కడక్కడా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరుప్రాంతాల ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు తెలుపుతుండడంతో కార్యాలయాల్లో పాలన పూర్తిగా స్తంభించిపోతోంది. ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేం దుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా తెలంగాణ ఉద్యోగులు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘అన్నదమ్ముల్లా ఉంటున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేందుకు వచ్చావా’ అంటూ ఆయన్నుఘెరావ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు వారిని తోసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి తులసిరెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. ఏపీఎన్జీవో నేతల అరెస్టు సమైక్యాంధ్రను కోరుతూ విద్యుత్‌సౌధలో మంగళవారం భోజన విరామ సమయంలో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఏపీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఇరిగేషన్ అసోసియేషన్ నగర అధ్యక్షుడు బి.మల్లికార్జున్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీమా భవన్లో ధర్నా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మంగళవారం అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో ఏపీ ఎన్జీవోలు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. కోఠి డీఎంహెచ్‌ఎస్‌లోని కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, వైద్యవిధానపరిషత్, ఏపీసాక్, డీహెచ్ తదితర శాఖల సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి మౌనప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో టీఎన్జీఓలు ఒక్కసారిగా కార్యాల యాల నుంచి బయటకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బీమా భవన్లో ఉద్రిక్తత.. ఏపీ, టీ ఎన్జీవోల పోటాపోటీ నినాదాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోల సమ్మె, తెలంగాణకు అనుకూలంగా టీఎన్జీవోల సద్భావన యాత్రలతో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బుధవారం అబిడ్స్ తిలక్ రోడ్డులోని బీమా భవన్లో ఏపీఎన్జీవోలు విధులు బహిష్కరించారు. భోజన విరామ సమయంలో టీఎన్జీవోల సద్భావన యాత్ర నిర్వహించేందుకు తెలంగాణవాదులు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘బీమా భవన్ ఎదుట ఏపీఎన్జీవోలు ధర్నా చేస్తున్నారని, మీరు తర్వాత రావాలని’ ఏసీపీ జైపాల్ రెడ్డి భీమా భవన్ తలుపు మూసి టీఎన్జీవోలను నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, తెలంగాణ ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ ఉద్యోగులు లోపలికి వచ్చి ఏపీఎన్జీవోలు చేస్తున్న ధర్నా వద్ద బైఠాయించారు. దీంతో ఏపీఎన్జీవోలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇదే క్రమంలో ‘జై తెలంగాణ’ నినాదాలు జోరందుకోవడంతో పరిస్థితి గోదరగోళానికి దారి తీసింది. ఇరువర్గాలను తాడు సహాయంతో పోలీసులు వేరుచేశారు. ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించివేయడం తో వివాదం సద్దుమణిగింది. అంతా దుష్ర్పచారం..ఖండిస్తున్నాం : దేవీ ప్రసాద్ హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులను ఈ ప్రాంతం వదిలివెళ్లిపోవాలంటూ కొంతమంది బెదిరిస్తున్నారంటూ ఢిల్లీలో దుష్ర్పచారం చేస్తున్నారని, దానిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్ అన్నారు. ఒకవేళ నిజంగా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమకు ఫోన్ చేస్తే గంటలోపు అక్కడకు వచ్చి, వారిని కాపాడ తామని స్పష్టం చేశారు.ఏపీఎన్జీవోలకు తాము స్నేహహస్తం చాటుతున్నామని, కమిటీగా ఏర్పడి సమస్యలుంటే చర్చించుకుందామని దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ ఏర్పాటు చేసిన సద్భావన సదస్సులో ఆయన మాట్లాడారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు చేసే సమ్మె దారుణమన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తే తాము రెండు గంటలు అధికంగా పనిచేస్తామని ప్రకటించినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, సచివాలయంలో అన్నిశాఖలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుంటారని సీమాంధ్ర ఉద్యోగులు నిరసన పేరుతో తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడుతున్నా వారికి ఎస్మా, 177 జీవో కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మన పోరాటం సామాన్యులపై కాదు : కోదండరాం మన పోరాటం సీమాంధ్ర సామాన్య ప్రజలపై కాదని.. తెలంగాణను అడ్డుకునే కుట్రదారులతోనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. బుధవారం విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. ఈనెల 16 నుంచి ‘విభజనకు సహకరించండి- శాంతిని పెంపొందించండి’ నినాదంతో శాంతి ర్యాలీలు, సద్భావనా యాత్రలు నిర్వహిద్దామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో సీమాంధ్రులు ఉండవద్దని ఇప్పటివరకు ఏ తెలంగాణ వ్యక్తి అనలేదని, కేవలం ఉద్యోగుల్లో మాత్రమే కొద్దిమార్పు ఉంటుందని చెప్పారు. గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యాంద్ర ఉద్యమ జేఏసీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యహరిస్తుంటే, కో చైర్మన్‌గా డీజీపీ దినేష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకుడు విఠల్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అద్దంకి దయాకర్, డాక్టర్ నర్సయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉద్యోగులను ఉద్దేశించి ఫోన్లో మాట్లాడారు.