ప్రజల సేవలో తరించుదాంత
-
అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం
-
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం
-
హక్కుల కోసమే టీఎన్‌జీవోస్ పోరాటం
-
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
-
ఘనంగా టీఎన్‌జీవోల 70 వసంతాల ఉత్సవం
-
టీఎన్‌జీవో మాజీ నేతలకు ఘన సన్మానం
ముకరంపుర : ప్రజల ఆకలి, దుఃఖం పోయి కొనుగోలు శక్తి పెరిగేలా ప్రభుత్వంతో కలిసి ప్రజల సేవలో తరించుదామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని అర్థం చేసుకోవాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గురువారం టీఎన్‌జీవోల 70 వసంతాల ఉత్సవాలను సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చిరుద్యోగుల నుంచి పెన్షనర్ల వరకు సమస్యల పరిష్కారానికి టీఎన్‌జీవోలు పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. జీతభత్యాలు, డీఏలే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడాలన్నారు. గత పాలక ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలతోనే సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. అతి తక్కువ కాలంలో రెండు వందల పై చిలుకు జీవోలను ప్రభుత్వం జారీ చేసిందని చెప్పారు. ఉద్యోగులు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధిలో ఉద్యోగులు మరింత కీలకంగా పనిచేయాలని కోరారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను అభినందించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి టీఎన్‌జీవోస్ అండగా ఉంటుందని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు అన్నారు. ఉద్యోగుల హక్కుల రక్షణ, ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా టీఎన్‌జీవో సంఘం ముందుకెళ్తోందని చెప్పారు. 1946లో ఏర్పడ్డ సంఘ చరిత్రను విధ్వంసం చేయడానికి కుట్రలు జరిగాయన్నారు. అప్పటి సంఘ నేతలు తెలంగాణ ఉద్యోగుల కోసం ఉద్యమిస్తే బర్తరఫ్ చేశారని, సంఘాన్ని నిషేధించడం జరిగిందని తెలిపారు. సకలజనుల సమ్మె ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలిపిందని, సమైక్యాంధ్ర పీడ విరగడమే సాధించిన గొప్ప విజయమని అన్నారు. చరిత్ర తెలియకుండా మాట్లాడే వారికి తగిన సమాధానం చెబుతామన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరారు. కిందిస్థాయిలో నిరాశ నిస్పృహలను తొలగించేలా ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, పీఆర్‌సీ ఏరియర్స్ వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రేచల్, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రెడ్డి, కేంద్ర సంఘ నాయకుడు సుద్దాల రాజయ్యగౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు నాగుల నర్సింహస్వామి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్‌రెడ్డి, కాళీచరణ్, సహాధ్యక్షుడు సర్దార్ హర్మీందర్‌సింగ్, వేముల రవీందర్, రాంకిషన్, గూడ ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్, శారద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ నేతలకు ఘన సన్మానం
టీఎన్‌జీవో సంఘ ఆవిర్భావం నుంచి రాష్ట్ర, జిల్లా నాయకత్వంలో ఉద్యోగులకు విశేష సేవలందించిన సంఘ పూర్వ నేతలను, ప్రజాప్రతినిధులను శాలువా మెమెంటోతో మంత్రి ఈటల రాజేందర్ ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎంఏ.హమీద్, మాజీ అధ్యక్షుడు రాజేశం, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్యతోపాటు పలువురు నేతలను సన్మానించారు.
ఆకట్టుకున్న పాటలు..
సాంస్కృతిక సారథి కళాకారులు బుర్ర సతీష్, తేలు విజయ నేతృత్వంలో పాటలతో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా బృందంలోని ఆవునూరి కోమల పాడిన పాటలను కలెక్టర్ నీతూప్రసాద్ అభినందించారు. టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఉద్యోగులపై రాసిన పాటను పాడి అభినందనలందుకున్నారు.