కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణపై ఆధిపత్యం కోసమే సీమాంధ్రులు ఉద్యమం చేస్తున్నారని టీఎన్జీఓల అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో టీఎన్జీఓల జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అధ్యక్షతన 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకలజన భేరికి సన్నాహకంగా జనభేరి సభను నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న దేవీప్రసాద్ మాట్లాడుతూ, టీఎన్జీఓల ప్రతి పోరాటం ప్రజల పక్షానే సాగిందన్నారు.
1952లో ఫజల్ అలీ కమిషన్ ఎదుట తిరుగుబాటు జెండా మొదలు, నేటి ఉద్యమం వరకు ప్రజల పక్షానే పోరాడుతున్నామన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్న సీమాంధ్రులు..చరిత్రను తెలుసుకోవాలన్నారు. 1956కు పూర్వమే చార్మినార్, ఉస్మానియా యూనివర్సిటీ, వైద్యశాల, ఎముకల ఆస్పత్రి, డ్రైనేజి వ్యవస్థతో హైదరాబాద్ ప్రపంచంలోని ఐదు సుందర నగరాల్లో ఒకటిగా కీర్తి గడించిందన్నారు. విలీన సమయం నుంచి సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాటకు దక్కాల్సిన 5 లక్షల 20 వేల ఉద్యోగ్లాలో కేవలం 2 లక్షలు మాత్రమే దక్కాయన్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టి ఈ ప్రాంత వెనుకబాటు తనానికి కారణమైంది మీరుకాదా అని సీమాంధ్రులను ఆయన ప్రశ్నించారు.
610 జీఓ, 36 జీఓ, గిర్‌గ్లానీ కమిటీల ద్వారా సీమాంధ్రులు లక్షలాది ఉద్యోగాలు కొల్లగొట్టిన విషయం తేటతెల్లమైందన్నారు. అందువల్లే కడుపు మండి ప్రజల పక్షాన టీఎన్జీఓలంతా పోరాడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా వత్తిడి తేవాలన్నారు. ఏపీ సేవ్ పేరిట ఏపీఎన్‌జీఓలు నిర్వహించిన సభకు రాష్ట్ర ప్రభుత్వం రాచమార్గంలో సహకరించిందన్నారు. వేలాది మంది సీమాంధ్రుల మధ్య దుబ్బాక ముద్దుబిడ్డ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను చాటి చెప్పాడన్నారు. ఒకడి నినాదాన్నే సహించలేని సీమాంధ్రులు నాలుగున్నర కోట్ల ప్రజల నినాదాలిస్తే ఆ సునామీలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. విభజన అనివార్యమని, అందుకు సహకరించాలని ఏపీఎన్జీఓలను దేవీప్రసాద్ కోరారు. సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం అన్ని రాజకీయ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని తేలిపోయిందన్నారు. సీమాంధ్రను చూసైనా ఐక్యమై ప్రజల ఆకాంక్ష మేరకు అధిష్టానంపై వత్తిడి చేసేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌పై కిరికిరి చేయవద్దని...హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే నినాదం ఇచ్చారు. అక్రమంగా ప్రవేశించిన సీమాంధ్రులు కొల్లగొట్టిన ఉద్యోగాలతో ఈ ప్రాంతంలోని బిడ్డలు పరాయి బిడ్డలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖాళీలను భర్తీ చేయాలి
ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేయాలనీ, మహిళ పోస్టులను పూర్తి స్థాయిలో తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా నియమించాలని టీఎన్‌జీఓల కేంద్ర కమిటీ సభ్యుడు కారం రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. టీఎన్‌జీఓల కార్యాచరణలో నిజాయితీ ఉందనీ, ఆ మేరకు పనిచేయడం వల్లే ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ సమస్యలను పరిష్కరించుకుంటున్నామన్నారు. 29న నిర్వహించనున్న సకలజన భేరికి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న సమయంలో సీమాంధ్ర మంత్రుల భార్యలు ఏం చేశారని టీఎన్‌జీఓల మహిళా విభాగం అధ్యక్షులు రేచల్ ప్రశ్నించారు.
తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివప్రసాద్, కేంద్రకమిటీ సభ్యులు ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ పోరాటమన్నారు. సెక్రటేరియట్‌లో సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనం కారణంగానే ఈ ప్రాంతం వెనుకబడిందన్నారు. సమావేశంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, టీఎన్‌జీఓల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, శ్రీనివాస్‌రెడ్డి, శ్వాంరావు తదితరులు మాట్లాడుతూ, సకలజన భేరికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జీతం కోసం పీఆర్‌సీ జీవితం కోసం తెలంగాణ నినాదంతో ముందుకు సాగుదామన్నారు. ఈ సందర్భంగా సకలజన భేరి వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు.