జవహర్‌నగర్, బండ్లగూడ హౌసింగ్
ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్ణయం
ధరల నిర్ధారణకు సీఎస్ నేతృత్వంలో కమిటీ
రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన రెండు భారీ ప్రాజెక్టులు... జవహర్‌నగర్, బండ్లగూడ ప్రాజెక్టులను గంపగుత్తగా అమ్మేయాలని తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. వాటి ధరలను నిర్ధారించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ నేతృత్వంలోని నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ త్వరలో ధరలు ఖరారు చేస్తుంది. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో దివాలా తీసి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను ఇకపై కొనసాగించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే దీనికి తాజా బడ్జెట్‌లో కేవలం లక్ష రూపాయలే ఇచ్చారు.
జవహర్‌నగర్: సీఆర్పీఎఫ్ హౌసింగ్ సొసైటీకి
వైశాల్యం: 10 ఎకరాలు.
భవనసముదాయం: జీప్లస్ 14 పద్ధతిలో 2,858 ఫ్లాట్లు
అమ్ముడైనవి: 0
కారణం: స్వగృహ కార్పొరేషన్‌కు నిధుల కొరతతో అసంపూర్తిగా ఉన్నాయి.
ఇప్పటికైన ఖర్చు: రూ.360 కోట్లు
పూర్తిచేసేందుకు: మరో 100 కోట్లు అవసరం
సీఆర్పీఎఫ్ ఏం కోరుతోంది: ఈ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ చాలాకాలంగా ఆసక్తి చూపుతోంది. బుధవారం సీఆర్పీఎఫ్ ప్రతినిధులతో గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశ్ చర్చించి వివరాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ ముందుంచారు. తమది కూడా ప్రభుత్వరంగ సంస్థ అయినందున వీలైనంత తక్కువ ధరకు ఇవ్వాలని సీఆర్పీఎఫ్ కోరింది.
ప్రభుత్వ ఆలోచనేంటి: ప్రాజెక్టుకు ఇప్పటివరకు అయిన ఖర్చును రాబట్టుకోవాలి. లాభాపేక్ష వద్దు. ఈ మేరకు ధరలు నిర్ణయించి వచ్చే అడ్వాన్సుతో పనులు పూర్తిచేసి కొనుగోలుదారులకు అప్పగించాలి.
బండ్లగూడ: టీఎన్జీవోలకు
నిర్మాణ ప్రాంతం: 15 ఎకరాలు
భవనసముదాయాలు: జీప్లస్ 9 పద్ధతిలో 2,800 ఫ్లాట్లు
ఇప్పటికి అమ్ముడైనవి: 600 ఫ్లాట్లు
కారణం: ఫ్లాట్ల ధరపై స్వగృహ కార్పొరేషన్ పట్టువిడుపులు ప్రదర్శించకపోవడం. కొనుగోలుదారులు ఎవరైనా ఆసక్తి చూపినా వారికి సరైన సమాచారం లభించకపోవడం.
ఇప్పటికైన వ్యయం: రూ.460 కోట్లు
టీఎన్జీవోలు ఏం అడిగారు: రాయితీ ధరలకు బండ్లగూడ ప్రాజెక్టు ఇళ్లను తమకు కేటాయించాలని టీఎన్జీవోలు ఇదివరకే కోరారు. చదరపు అడుగు ధర రూ.1,600-రూ.1,800 మధ్య ఉండాలని కోరినట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించినందువల్ల ప్రభుత్వం తమ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తుందని వారు ఆశిస్తున్నారు.
ప్రభుత్వం ఏమంటోంది: అంతమేర నిర్ధారిస్తే ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉన్నందున దాన్ని రూ.2,100 - 2,300 మధ్య నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంతమేరకు పట్టువిడుపుల ధోరణి ఉండొచ్చు.
- సాక్షి, హైదరాబాద్
నష్టం లేకుండా అమ్మేద్దాం
Published Fri, Nov 7 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement