heavy projects
-
బీజేపీతోనే గుజరాత్ వికాసం: మోదీ
భావ్‌నగర్: దేశంలోనే అతిపొడవైన తీర ప్రాంతమున్న గుజరాత్ అభివృద్ధి కోసం దశాబ్దాలపాటు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం గత 20 ఏళ్లుగా నిజాయతీతో ప్రయత్నాలు చేసి రాష్ట్రం అభివృద్ధికి బాటలు పరిచిందని పేర్కొన్నారు. ప్రచార ఆర్భాటాలకు డబ్బు వృథా చేయకుండా తీర ప్రాంతం వెంబడి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టిందని ఆయన అన్నారు. ఫలితంగా లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు. ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడూ నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. భావ్‌నగర్, బొటాడ్, అమ్రేలీ జిల్లాల్లో గురువారం రూ.6 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపిన సందర్భంగా భావ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ టెర్మినల్, బ్రౌన్‌ఫీల్డ్ పోర్ట్ అభివృద్ధి, కార్గో కంటెయినర్ ఉత్పత్తి విభాగం తదితరాలు ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సమయంలో ప్రధాని మోదీ రూ.29 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. -
నష్టం లేకుండా అమ్మేద్దాం
జవహర్‌నగర్, బండ్లగూడ హౌసింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్ణయం ధరల నిర్ధారణకు సీఎస్ నేతృత్వంలో కమిటీ రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన రెండు భారీ ప్రాజెక్టులు... జవహర్‌నగర్, బండ్లగూడ ప్రాజెక్టులను గంపగుత్తగా అమ్మేయాలని తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. వాటి ధరలను నిర్ధారించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ నేతృత్వంలోని నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ త్వరలో ధరలు ఖరారు చేస్తుంది. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో దివాలా తీసి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను ఇకపై కొనసాగించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే దీనికి తాజా బడ్జెట్లో కేవలం లక్ష రూపాయలే ఇచ్చారు. జవహర్‌నగర్: సీఆర్పీఎఫ్ హౌసింగ్ సొసైటీకి వైశాల్యం: 10 ఎకరాలు. భవనసముదాయం: జీప్లస్ 14 పద్ధతిలో 2,858 ఫ్లాట్లు అమ్ముడైనవి: 0 కారణం: స్వగృహ కార్పొరేషన్‌కు నిధుల కొరతతో అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పటికైన ఖర్చు: రూ.360 కోట్లు పూర్తిచేసేందుకు: మరో 100 కోట్లు అవసరం సీఆర్పీఎఫ్ ఏం కోరుతోంది: ఈ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ చాలాకాలంగా ఆసక్తి చూపుతోంది. బుధవారం సీఆర్పీఎఫ్ ప్రతినిధులతో గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశ్ చర్చించి వివరాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ ముందుంచారు. తమది కూడా ప్రభుత్వరంగ సంస్థ అయినందున వీలైనంత తక్కువ ధరకు ఇవ్వాలని సీఆర్పీఎఫ్ కోరింది. ప్రభుత్వ ఆలోచనేంటి: ప్రాజెక్టుకు ఇప్పటివరకు అయిన ఖర్చును రాబట్టుకోవాలి. లాభాపేక్ష వద్దు. ఈ మేరకు ధరలు నిర్ణయించి వచ్చే అడ్వాన్సుతో పనులు పూర్తిచేసి కొనుగోలుదారులకు అప్పగించాలి. బండ్లగూడ: టీఎన్జీవోలకు నిర్మాణ ప్రాంతం: 15 ఎకరాలు భవనసముదాయాలు: జీప్లస్ 9 పద్ధతిలో 2,800 ఫ్లాట్లు ఇప్పటికి అమ్ముడైనవి: 600 ఫ్లాట్లు కారణం: ఫ్లాట్ల ధరపై స్వగృహ కార్పొరేషన్ పట్టువిడుపులు ప్రదర్శించకపోవడం. కొనుగోలుదారులు ఎవరైనా ఆసక్తి చూపినా వారికి సరైన సమాచారం లభించకపోవడం. ఇప్పటికైన వ్యయం: రూ.460 కోట్లు టీఎన్జీవోలు ఏం అడిగారు: రాయితీ ధరలకు బండ్లగూడ ప్రాజెక్టు ఇళ్లను తమకు కేటాయించాలని టీఎన్జీవోలు ఇదివరకే కోరారు. చదరపు అడుగు ధర రూ.1,600-రూ.1,800 మధ్య ఉండాలని కోరినట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించినందువల్ల ప్రభుత్వం తమ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తుందని వారు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఏమంటోంది: అంతమేర నిర్ధారిస్తే ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉన్నందున దాన్ని రూ.2,100 - 2,300 మధ్య నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంతమేరకు పట్టువిడుపుల ధోరణి ఉండొచ్చు. - సాక్షి, హైదరాబాద్ -
‘వుడా’ప్రయాస!
సాక్షి, విశాఖపట్నం: భారీ ప్రాజెక్టులు చేపడతామని వుడా ఆర్భాటంగా ప్రకటిం చింది. ప్రతిపాదనలపై కసరత్తుకు అధికారులు వందలాది పని గంటలు కేటాయించారు. ప్రయివేటు కన్సల్టెన్సీలతో సమగ్ర నివేదికలు రూపొందించారు. ఒక్కో ప్రాజెక్టుకు రూ.లక్షల్లో కేటాయించారు. కానీ గత నెలలో జరిగిన వుడా బోర్డు సమావేశంలో ప్రతిపాదిత 34 ప్రాజెక్టులు, పనులను రద్దు చేస్తూ తీర్మానించడంతో ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. వుడా అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షలాది రూపాయలతో పాటు అధికారుల పని గంటలూ వృథా అయ్యాయి. భారీ ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలు అటకెక్కాయి. నివేదికలు బుట్టదాఖలయ్యాయి. వుడా పరిధిలో 2008 ఏప్రిల్ 26 నుంచి రూ.284 కోట్లతో ప్రతిపాదించిన 34 ప్రాజెక్టులు బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో రద్దయ్యాయి. దీనిపై ఇప్పటి వరకు చేసిన వ్యయంపై మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. అనకాపల్లి మున్సిపాలిటీ కార్యాలయ భవనాన్ని 2008 ఏప్రిల్ నెలలో రూ.1.11 కోట్లతో ప్రతిపాదించారు. ఐదేళ్లయినా పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు అనకాపల్లి జీవీఎంసీలో విలీనం కావడంతో దీన్ని రద్దు చేశారు. శ్రీకాకుళంలో రూ.5.20 కోట్ల వ్యయంతో వైఎస్సార్ స్టేడియం నిర్మాణానికి 2010లో అప్పటి ముఖ్యమంత్రితో శంకుస్థాపన కూడా చేశారు. అదీ నిర్మాణానికి నోచుకోక రద్దయింది. డాక్టర్ వైఎస్సార్ వుడా సెంట్రల్ పార్కులో వెస్ట్ ఫుడ్ కోర్టు నిర్మాణానికి రూ.1.6 కోట్లతో ప్రతిపాదించారు. దీని డిజైన్ కూడా సిద్ధం చేశారు.పర్యావరణహిత డిజైన్ కోసం ప్రజా సంఘాల వ్యతిరేకతతో రద్దు చేశారు. డిజైన్ సవరణ తర్వాత ప్రత్యేకంగా దీన్ని ఆమోదానికి ఉంచాలని నిర్ణయించారు. ఇక్కడే రూ.2.15 కోట్లతో ప్రతిపాదించిన ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాన్ని వెనక్కి తీసుకున్నారు. మధురవాడలోని ఎన్జీవోస్ కాలనీలో రూ.3.33 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ల్యాండ్‌పూలింగ్ ఇక్కడి స్థలాల కేటాయింపు, పరిహారాలిచ్చిన ప్రక్రియపై తీవ్ర ఆరోపణలతో ఈ ప్రాజెక్టునూ చేపట్టలేదు. పరదేశిపాలెంలోని ఓజోన్ వ్యాలీలో రూ.6.57 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపట్టాలనుకున్నారు. ఇక్కడి స్థలాల కేటాయింపుపై కూడా ఆరోపణల వెల్లువెత్తడంతో టెండర్లు పిలిచినప్పటికీ వాటిని రద్దు చేశారు. విజయనగరంలోని కోడూరు గ్రామంలో ఆరుబయలు స్టేడియం నిర్మాణం కోసం రూ.1.50 కోట్లతో ఏర్పాట్లు చేసినా.. అదీ అమలుకు నోచుకోలేదు. 2012 డిసెంబర్లో బోర్డు ఆమోదించిన 11 అంశాల్లో రూ.11.50 కోట్లతో రాంనగర్లో ప్యాలెట్ పార్కింగ్ సిస్టం(రోబోటిక్) ప్రతిపాదనల్నీ వెనక్కి తీసుకున్నారు. ప్రతిపాదిత స్థలం అనువైనది కాకపోవడం వల్లే ఈ ప్రాజెక్టును రద్దు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. రూ.12.50 కోట్లుతో శ్రీకాకుళంలోని కోడి రామమూర్తి స్టేడియం ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలూ వెనక్కి వెళ్లాయి. రూ.133 కోట్లతో గంభీరం లే అవుట్‌లోని 30 ఎకరాల విస్తీర్ణంలోను, రూ.82.70 కోట్లతో అనకాపల్లిలోని చెర్లోపలిఖండంలోని 25 ఎకరాల విస్తీర్ణంలోను ప్రతిపాదించిన శాటిలైట్ టౌన్షిప్ ప్రాజెక్టులు కూడా రద్దయ్యాయి.