సాక్షి, విశాఖపట్నం: భారీ ప్రాజెక్టులు చేపడతామని వుడా ఆర్భాటంగా ప్రకటిం చింది. ప్రతిపాదనలపై కసరత్తుకు అధికారులు వందలాది పని గంటలు కేటాయించారు. ప్రయివేటు కన్సల్టెన్సీలతో సమగ్ర నివేదికలు రూపొందించారు. ఒక్కో ప్రాజెక్టుకు రూ.లక్షల్లో కేటాయించారు. కానీ గత నెలలో జరిగిన వుడా బోర్డు సమావేశంలో ప్రతిపాదిత 34 ప్రాజెక్టులు, పనులను రద్దు చేస్తూ తీర్మానించడంతో ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది.
వుడా అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షలాది రూపాయలతో పాటు అధికారుల పని గంటలూ వృథా అయ్యాయి. భారీ ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలు అటకెక్కాయి. నివేదికలు బుట్టదాఖలయ్యాయి. వుడా పరిధిలో 2008 ఏప్రిల్ 26 నుంచి రూ.284 కోట్లతో ప్రతిపాదించిన 34 ప్రాజెక్టులు బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో రద్దయ్యాయి. దీనిపై ఇప్పటి వరకు చేసిన వ్యయంపై మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు.
అనకాపల్లి మున్సిపాలిటీ కార్యాలయ భవనాన్ని 2008 ఏప్రిల్ నెలలో రూ.1.11 కోట్లతో ప్రతిపాదించారు. ఐదేళ్లయినా పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు అనకాపల్లి జీవీఎంసీలో విలీనం కావడంతో దీన్ని రద్దు చేశారు.
శ్రీకాకుళంలో రూ.5.20 కోట్ల వ్యయంతో వైఎస్సార్ స్టేడియం నిర్మాణానికి 2010లో అప్పటి ముఖ్యమంత్రితో శంకుస్థాపన కూడా చేశారు. అదీ నిర్మాణానికి నోచుకోక రద్దయింది.
డాక్టర్ వైఎస్సార్ వుడా సెంట్రల్ పార్కులో వెస్ట్ ఫుడ్ కోర్టు నిర్మాణానికి రూ.1.6 కోట్లతో ప్రతిపాదించారు. దీని డిజైన్ కూడా సిద్ధం చేశారు.పర్యావరణహిత డిజైన్ కోసం ప్రజా
సంఘాల వ్యతిరేకతతో రద్దు చేశారు. డిజైన్ సవరణ తర్వాత ప్రత్యేకంగా దీన్ని ఆమోదానికి ఉంచాలని నిర్ణయించారు.
ఇక్కడే రూ.2.15 కోట్లతో ప్రతిపాదించిన ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాన్ని వెనక్కి తీసుకున్నారు.
మధురవాడలోని ఎన్‌జీవోస్ కాలనీలో రూ.3.33 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ల్యాండ్‌పూలింగ్ ఇక్కడి స్థలాల కేటాయింపు, పరిహారాలిచ్చిన ప్రక్రియపై తీవ్ర ఆరోపణలతో ఈ ప్రాజెక్టునూ చేపట్టలేదు.
పరదేశిపాలెంలోని ఓజోన్ వ్యాలీలో రూ.6.57 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపట్టాలనుకున్నారు. ఇక్కడి స్థలాల కేటాయింపుపై కూడా ఆరోపణల వెల్లువెత్తడంతో టెండర్లు పిలిచినప్పటికీ వాటిని రద్దు చేశారు.
విజయనగరంలోని కోడూరు గ్రామంలో ఆరుబయలు స్టేడియం నిర్మాణం కోసం రూ.1.50 కోట్లతో ఏర్పాట్లు చేసినా.. అదీ అమలుకు నోచుకోలేదు.
2012 డిసెంబర్లో బోర్డు ఆమోదించిన 11 అంశాల్లో రూ.11.50 కోట్లతో రాంనగర్లో ప్యాలెట్ పార్కింగ్ సిస్టం(రోబోటిక్) ప్రతిపాదనల్నీ వెనక్కి తీసుకున్నారు. ప్రతిపాదిత స్థలం అనువైనది కాకపోవడం వల్లే ఈ ప్రాజెక్టును రద్దు చేసినట్టు అధికారులు చెప్తున్నారు.
రూ.12.50 కోట్లుతో శ్రీకాకుళంలోని కోడి రామమూర్తి స్టేడియం ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలూ వెనక్కి వెళ్లాయి.
రూ.133 కోట్లతో గంభీరం లే అవుట్లోని 30 ఎకరాల విస్తీర్ణంలోను, రూ.82.70 కోట్లతో అనకాపల్లిలోని చెర్లోపలిఖండంలోని 25 ఎకరాల విస్తీర్ణంలోను ప్రతిపాదించిన శాటిలైట్ టౌన్‌షిప్ ప్రాజెక్టులు కూడా రద్దయ్యాయి.
‘వుడా’ప్రయాస!
Published Thu, Jan 16 2014 6:34 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement