Sakala Jana bheri
-
సకల జనభేరి కాదది టీఆర్ఎస్ పార్టీ మీటింగ్: శ్రీనివాసరాజు
తెలంగాణ సెటిలర్‌స ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు ధ్వజం సాక్షి, హైదరాబాద్: నిజాం కళాశాల మైదానంలో జరిగిన సకల జనభేరి టీఆర్ఎస్ పార్టీ సభను తలపించిందని తెలంగాణ సెటిలర్‌స ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు విమర్శించారు. ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సకల జనుల పేరుతో జరిగిన సభలో తెలంగాణ భావజాలమున్న నేతలకు చోటులేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఉద్యమానికి ఊపుతెచ్చిన ఓయూ విద్యార్థులను ఎందుకు మాట్లాడనివ్వలేదన్నారు. తెలుగు సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేశానంటూ పదేపదే చెప్పుకునే కేసీఆర్ నోటివెంట నోటిదురుసు పదాలు రావడం బాధాకరమన్నారు. ఉద్యమాన్ని తనవైపుకు తిప్పుకోవడానికే సీమాంధ్ర జిల్లాల్లో అలజడి పుట్టించేలా కేసీఆర్ కుట్ర పన్నారని తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు సతీష్ మాదిగ దుయ్యబట్టారు. నిజాం కాలేజీ గ్రౌండ్సలో జరిగింది సకల జనభేరి కాదని, సకల జన‘బేర’మని ఎద్దేవా చేశారు. -
అడ్డుకునేటోళ్లనే ద్రోహులన్నా.. ఆంధ్రోళ్లందరినీ అనలేదు: కేసీఆర్
సకల జన భేరిలో తన వ్యాఖ్యలపై కేసీఆర్ వివరణ తన వ్యాఖ్యలను నారాయణ, దత్తాత్రేయ తప్పుపట్టటంపై మండిపాటు మేం ప్రజలను ఎందుకంటాం? తెలంగాణను అడ్డుకునే వాళ్లనే నిందిస్తం తెలంగాణ ఉద్యమంపై సీమాంధ్ర నేతల మాటలు మీకు కవిత్వంలా ఉందా? అక్కడి నేతలు మాట్లాడే రెచ్చగొట్టే మాటలకు ఎందుకు స్పందించలేదు? ద్రోహం చేసిండ్రు కాబట్టి ద్రోహులు అన్నాం.. నిందించటం ఉద్దేశం కాదు మీడియా భేటీలో కేసీఆర్ వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటోళ్లని, తెలంగాణను అడ్డుకునేటోళ్లనే తాను ద్రోహలని అన్నట్టు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు వివరణ ఇచ్చారు. ‘‘30 -40 ఏళ్ల నుంచి నేను ప్రజల మధ్య ఉన్నా. నన్ను డజనుకు పైగా సార్లు ప్రజలు గెలిపించారు. మేం ప్రజలనెందుకంటామండీ? ప్రజలను అనే అక్కర మాకు ఏముంది? తెలంగాణను అడ్డుకునే వాళ్లని తప్పనిసరిగా కేసీఆర్ నిందిస్తడు. ఎందుకు నిందించమండీ? భాజాప్తా నిందిస్తం. ఒకటి అంటే ఒకటి కాదు వెయ్యి అంటం’’ అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ మంగళవారం పార్టీ నాయకులు కె.కేశవరావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, నారదాసు లకష్మణరావు తదితరులతో కలిసి తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సకల జన భేరి సభలో తాను చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ వంటి నేతలు తప్పుపట్టటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సీమాంధ్ర నాయకులు గానీ, అక్కడ ఉద్యమంలో పాల్గొంటున్న వారు గానీ తనపై, తెలంగాణ ఉద్యమంపై తీవ్ర విమర్శలు చేసినప్పుడు సైతం మాట్లాడని ఆ ఇద్దరు నేతలు.. తాను మాట్లాడగానే, ఆ మాటలను తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలంగాణ వాళ్లు రాక్షస సంతతికి చెందిన వారని విమర్శిస్తే.. అవి ఈ నారాయణ, దత్తాత్రేయకు కవిత్వం పాడినట్టు అనిపించిందా? పయ్యావుల కేశవ్ తాము మానవ బాంబులం అవుతామన్నది కూడా నారాయణకు కవిత్వమే అనిపించిందా?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణకు చెందిన పలువురిపై సీమాంధ్రలోనూ, ఏపీ ఎన్జీవోల సభ సందర్భంగా భౌతికదాడులు జరిగితే.. అదంతా మంచిగా కనిపించిందా? కేసీఆర్ మాట్లాడితే తప్పనిపిస్తోందా మీకు? అవతలి వాళ్లంతా బాగా సంస్కారంగా ఉన్నట్టు, మేం ఒక్క మాట మాట్లాడితే సంస్కా రం తప్పినట్టు కనిపిస్తున్నాది? ఈ వన్ సైడ్ లవ్ ఏంటండి?’’ అంటూ నారాయణ, దత్తాత్రేయలపై విరుచుకుపడ్డారు. ద్రోహం చేసిండ్రు కాబట్టి ద్రోహులు అన్నా... ‘‘మొన్న సభలో ఏం చెప్పిన..? ‘లంకలో ఉన్నవాళ్లని రాక్షసులే అన్నట్టు..’ సామెత చెప్పిన. తెలంగాణలో జనం రొటీన్‌గా వాడే ముచ్చటే అది. నేను వాళ్లని రాక్షసులని అనలే. సీమాంధ్రలో ఉన్న తెలంగాణను వ్యతిరేకించేటోళ్లందరూ తెలంగాణ ద్రోహులే అని చెప్పినం. ద్రోహం చేసిన వాళ్లని ద్రోహులనక ఏమంటమండి? చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చడం ద్రోహం కాదా? తెలంగాణ కోసం ఒప్పుకుంటడు. తెలంగాణ కోసం లేఖ ఇచ్చిన అంటడు. తెలంగాణ రాగానే అడ్డం పడతడు. దానిని ద్రోహం కాకపోతే ఏమంటం? వైఎస్ విజయమ్మ పరకాల ఉప ఎన్నికలకు వచ్చి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తది. అప్పుడేమో చిలకపలుకులు పలుకుతరు. ఇప్పుడేమో తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చుతరు. దానిని ఏమంటం?’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘పత్రి విమర్శ కిందనే నేను చెప్పిన. ద్రోహం చేసిండ్రు కాబట్టి ద్రోహులు అన్నా. నిందించడం మా ఉద్దేశం కాదు. నారాయణ, దత్తాత్రేయ గారికంటే నాకు మంచి తెలుగు భాష వస్తది. నేను తెలుగు లిటరేచర్ చదువుకున్నా. మాకు భాష లేక, సంస్కారం లేక కాదు. అదే టైంలో నేను ఉద్యమం నడిపిస్తున్నా. మా ప్రజలకు ఆ మాత్రం భరోసా ఇచ్చుకోక తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘డిసెంబర్ తొమ్మిది నాడు తామే ఆపామని నిన్న లగడపాటి జబ్బలు చరుచుకున్నడు. ఇప్పుడు కూడ బిల్లు రాకుండా ఆపినం అని లగడపాటి మాట్లాడితే.. మేం మూతి ముడుచుకొని ఇంట్లో కూర్చోవాల్నా? ఇదెక్కడి న్యాయం? ఇదేమి నీతి?’’ అని ప్రశ్నించారు. అలా ఎవరు మాట్లాడినా మీడియా హైలైట్ చేయాలి... ‘‘సకల జనభేరి సభ ఊహించిన దానికన్నా పది రెట్లు ఎక్కువ విజయవంతం కావటంతో.. దానిని చూసి ఓర్వలేక ఒక సెక్షన్ మీడియా పనిగట్టుకొని ఇలాంటివి సృష్టించింది. ఆ తరువాత దానిపై కొంత మంది దగ్గరకు పోయి గొట్టాలు (మీడియా మైకులు) పెట్టి మాట్లాడించారు’’ అని కేసీఆర్ విమర్శించారు. తనను మాత్రమే కాకుండా సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా హైలైట్ చేయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ‘‘సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో కేసీఆర్‌ను నిందించని రోజు ఉందా? ఏమి వెకిలి ఉద్యమం అది?’’ అని తప్పుపట్టారు. ఇలాంటి డ్రామాలతో తెలంగాణ ఆపాలనుకుంటే.. అది జరగదన్నారు. ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇకనైనా ఆంధ్రా నాయకులు అవాకులు చెవాకులు మానుకోవాలన్నారు. ‘‘రేపు రెండు రాష్ట్రాలను ఎవరిది వాళ్లు పాలించుకుందాం. ఒకరికొకరం సహకరించుకుందాం. లేదు, ద్వేషం పెట్టుకుందామంటే మీ ఖర్మ’’ అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ సభను అడ్డుకుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావ సభను తెలంగాణ వాదులు తప్పకుండా అడ్డుకుంటారని కేసీఆర్ హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా బదులిచ్చారు. ‘‘మానుకోట మళ్లీ పునరావృతం కావాలని ఆయన (వై.ఎస్.జగన్మోహన్రెడ్డి) కోరుకుంటుండేమో. దానికి ఎవరు బాధ్యు లు? ఏం జరిగినా జరుగుతది’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్లగ్ పీకుతారని తనకు తెలిసిన విషయాన్ని సభలో చెప్పానని.. అది ఎలా జరుగుతుందీ, ఎవరు పీకుతారు అన్నది తెలియదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ‘‘ఏ పరిణామాలైనా సంభవించవచ్చు. ఎవరిథింగ్ ఈజ్ పాజిబుల్’’ అని స్పందించారు. తెలంగాణ బిల్లుకు సంబంధించిన కేబినెట్ నోట్ విషయంపై తనకేమీ తెలియదన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను బట్టి తాను తెలంగాణ వద్దనుకుంటున్నట్టు.. చంద్రబాబు తెలంగాణ కావాలనుకుంటున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి తలాతోక లేని విమర్శలకూ ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టే మీడియా పరిస్థితి ఏమిటో తెలుస్తోందన్నారు. జగƒ న్మోహన్రెడ్డితో తాము కుమ్మక్కు కావాల్సిన అవసరం ఏముంటుందని మరో విలేకరి ప్రశ్నకు కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అంశంపై మాట్లాడేందుకు ఇది సందర్భం కాదన్నారు. -
దళితులను అవమానపరిచిన టిఆర్ఎస్:మంద కృష్ణ
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ దళిత నాయకులను అవమాన పరిచిందని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. దళితులను అవమాన పరిచే విధంగా సకల జనుల భేరి బహిరంగ సభను నిర్వహించారని ఆయన తీవ్ర స్ధాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ జెఎసి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అగ్ర కులాల వారికే ప్రాధానత ఇస్తున్నారన్నారు. దానికి మొన్న జరిగిన సకల జనుల భేరి సభ నిదర్శనమన్నారు. ఆ సభలో మంద జగన్నాథం, ఎంపీ వివేక్, విశ్వవిద్యాలయం దళిత విద్యార్థులకు ప్రాధన్యత కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అదే విధంగా ఆంద్రోళ్లు అంతా ద్రోహులే అన్న కేసీఆర్ మాటలను ఖండించారు. తెలంగాణలో ఉన్న అందరూ తెలంగాణను కోరుకోవడంలేదు, ఆంధ్రలో ఉన్నవాళ్లంతా సీమాంద్రను కోరుకోవడంలేదన్నారు. ఈనెల 6న గుంటూరులో జరిగే అంబేద్కర్ సభను నిర్వహించకుండా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదన్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. గుంటూరులో సభ పెట్టి తీరుతామన్నారు. అయితే రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి ఉంటే తమకు అనుమతి ఇచ్చేవారు కాదన్నారు. కొత్తగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన దళితుడు ప్రసాద రావును అనుమతి కోరతామన్నారు. ఆయన తమను అనుమతి ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ ప్రసాద రావుకు మందకృష్ణ మాదిగ అభినందనలు తెలిపారు. -
కాక రాజేసిన కేసీఆర్
ఉద్యమ కేసీఆర్ మరోసారి తన నోటికి పదును పెట్టారు. రెచ్చగొట్టడంలో ఘనాపాటిగా వర్తమాన రాజకీయాల్లో కీర్తించబడుతున్న కేసీఆర్- సకల జనభేరి వేదికగా కయ్యిమన్నారు. రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా ఆంధ్రా ప్రజలను ఘాటైన పదజాలంతో నిందించారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై అక్కసు వెళ్లగక్కారు. సీమాంధ్రుల పోరాటాన్ని చులకన చేసి మాట్లాడారు. సీమాంధ్ర ప్రజలు తమంతట తాముగా చేస్తున్న సమ్మెను హేళన చేశారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. అలాగే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మీరొకటంటే నే రెండంటా తరహాలో కేసీఆర్ చెలరేగిపోయారు. 'లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే. ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ జరుగుతున్న సమైక్యాంధ్ర పోరు కృత్రిమమైందని కయ్యానికి కాలు దువ్వారు. తెలంగాణ ఉద్యమం కోడికూతలాగా సహజమైనదని, సీమాంధ్ర ఉద్యమం అలారం మోతలా ఎవరో కీ ఇస్తే తప్ప మోగదని వ్యాఖ్యానించారు.కొరడాలతో కొట్టుకోవడం, కోడి ఈకలు కట్టుకోవడం, గడ్డితినడం, సమాధుల మీద పడుకోవడం ఏం దిక్కుమాలిన ఉద్యమమని అని ఎద్దేవా చేశారు. తాను పెద్ద ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్ మరో ప్రాంతంలో జరుగుతున్న పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజమని సీమాంధ్ర ప్రాంతంవారు ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం తనకిష్టం లేదన్నట్టుగా కేసీఆర్ వైఖరి ఉందంటున్నారు. కేసీఆర్ సంయమనం కోల్పోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. తెలంగాణ ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనలా వ్యాఖ్యానించడం కాదని బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణ రావడం కేసీఆర్‌కు ఇష్టం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎవరేమన్నా తన పంథాలోనే కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. -
చంద్రబాబు - ఓ పిచ్చోడి కథ
హైదరాబాద్: నిజాం కాలేజీ మైదానంలో ఆదివారం జరిగిన సకల జనభేరి సభలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తన ప్రసంగంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురించి చెప్పిన కథకు సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ‘‘ప్రస్తుతం ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు అటూ, ఇటూ తిరుగుతూ ఒక పిచ్చోడికి తారసపడ్డారట. చంద్రబాబును చూసి నువ్వు ఎవ్వరివి అని ఓ పిచ్చోడు ప్రశ్నించగా.. నేను చంద్రబాబునని బదులిచ్చాడు. ఏ చంద్రబాబువి అని పిచ్చోడు తిరిగి ప్రశ్నిస్తే ‘అదే, హైదరాబాద్ కట్టిన చంద్రబాబునని’ చెప్పాడట. చంద్రబాబు మాటలు విన్న పిచ్చోడు.. ‘ఆహా! త్వరలోనే తగ్గిపోతుంది. నేను కూడా కొద్దిరోజుల క్రితం వరకు ఢిల్లీ గురించి ఇట్లానే చెప్పేవాడిని’ అన్నాడట’’ అని దేశపతి చెప్పడంతో సభ చప్పట్లతో మారుమోగింది. -
‘సకలం’ పయనం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సకలజన భేరికి తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు భారీ ఎత్తున రాజధానికి తరలివెళ్లారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ప్రత్యేక రాష్ట్ర బిల్లును పార్లమెంట్లోప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన సకలజన భేరిని విజయవంతం చేసేందుకు ఉద్యోగవర్గాలతో పాటు న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున వెళ్లారు. తొలుత జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణవాదులు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంక టపతిరాజు, ఖాజామియా మాట్లాడుతూ.. సకలజన భేరితో ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ బిల్లును ఆమోదిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రజల శాంతి పంథాను చూపామని, వెంటనే బిల్లు ప్రవేశపెట్టకుంటే పోరాట పంథాను చూపెడతామని హెచ్చరించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో... పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు జిల్లా పరిషత్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ...జై జై తెలంగాణ... భద్రాచలం తెలంగాణదే.... రాముడు అందరివాడు.. ప్రత్యేక రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి’ అని నినదించారు. కార్యక్రమంలో పీఆర్ ఉద్యోగ సంఘం నేతలు బనిగండ్లపాటి భానుమూర్తి, మల్లెల రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీనివాస్, మురళి, ఎస్కే గౌసుద్దీన్, రాజేష్, మీరా, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. టీజీవోస్ ఆధ్వర్యంలో... తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి 5 బస్సులలో సకలజన భేరికి కదలి వెళ్లారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన డాక్టర్లు, ఎంపీడీఓలు, లెక్చరర్లు, ట్రెజరీ ఉద్యోగులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో హైదరాబాద్‌కు వెళ్లారు. కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎస్కె.ఖాజామియా, డాక్టర్ల జేఏసీ నాయకులు మదన్‌సింగ్, నారాయణ, మురళి, బాబురత్నాకర్, నాగేశ్వరరావు, ట్రె జరీ అధికారులు వై.వెంకటేశ్వర్లు, కృష్ణారావు, సారధి, ఎంపీడీఓల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, సన్యాసయ్య, ఉష పాల్గొన్నారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో... టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు ఆధ్వర్యంలో పలు అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు, ఉద్యోగులు భారీగా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు కె.కోటేశ్వరరావు, నందగిరి శ్రీను, వల్లోజు శ్రీను, సాగర్, రమణయాదవ్, లక్ష్మీనారాయణ, వీరనారాయణ, వినోద్, ఆర్అండ్బీ రమేష్, శ్రీను, విజేత, పుల్లమ్మ, వెంకటనర్సమ్మ, సరస్వతి పాల్గొన్నారు. న్యూడెమ్రోక్రసీ ఆధ్వర్యంలో..... సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఆధ్వర్యంలో ఖమ్మం డివిజన్ నుంచి 15 బస్సులలో సకలజన భేరికి తరలివెళ్లారు. పలువురు నాయకులు, కార్యకర్తలు రామనర్సయ్య విజ్ఞాన కేంద్రం నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడి నుంచి బస్సులలో హైదరాబాద్‌కు తరలారు. కార్యక్రమంలో నాయకులు జి.రామయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, రమేష్, రామారావు, శ్రీను, ఉపేందర్, రామ్మూర్తి ,పీవోడబ్ల్యూ నాయకులు స్వరూపరాణి, ఝాన్సీ, మంగతాయి పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తి చాటిన జిల్లా వాసులు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన సకల జనభేరి బహిరంగ సభకు జిల్లా తెలంగాణవాదులు జై కొట్టారు. ఉదయమే వాహనాల్లో పట్నానికి తరిలారు. సుమారు 25 వేల మంది వరకు జిల్లా ముద్దుబిడ్డలు జనభేరికి వెళ్లారు. రాజకీయ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ నేతలు, విద్యార్థులు, మహిళలు ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలివెళ్లారు. పలువురు వాహనాల ద్వారా వెళ్లగా.. మరికొందరు రైలు మార్గం గుండా హైదరాబాద్ పయనమయ్యారు. భారీగా తరలిన నేతలు.. జనభేరికి బయల్దేరే ముందు ఆర్అండ్బీ విశ్రాంతి భవనం ఎదుట ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ప్రకటించి, ప్రక్రియ ప్రారంభంలో ఆలస్యం చేస్తున్న యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకు మాత్రమే ఒప్పుకుంటామని, మరే ప్రతిపాదనలు అవసరం లేదన్నారు. ఆదిలాబాద్ నుంచి వెళ్లిన వారిలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, వనజారెడ్డి, బీసీ వెల్ఫేర్ మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, నాయకులు అడ్డి భోజారెడ్డి, సాజిదొద్దీన్, జేఏసీ అధికార ప్రతినిధి కారింగుల దామోదర్, తదితరులు ఉన్నారు. మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్, టీఎన్జీవో అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతిబాబు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జగన్మోహన్రావు తదితరులు వేలాది మందితో వాహనాలు, రైళ్లలో హైదరాబాద్ తరలివెళ్లారు. శ్రీరాంపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి నుంచి కూడా పెద్దఎత్తున కదిలారు. నిర్మల్ నుంచి జేఏసీ జిల్లా కో కన్వీనర్ కొట్టె శేఖర్, టీఎన్జీవోస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోయినొద్దీన్, విద్యసాగర్, అటవీ శాఖాధికారులు సాగర్, సృజన్, మధుసూదన్, టీవీవీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఉపాధ్యాయ సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. సారంగాపూర్, మామడ ప్రాంతాల నుంచి పలువురు వాహనాల్లో బయల్దేరారు. ఆసిఫాబాద్ నుంచి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కొవలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పెందూర్ గోపి, బీజేపీ నాయకుడు భువనగిరి సతీశ్‌బాబుతో సహా 500 మంది వెళ్లారు. నార్నూర్ ప్రాంతం నుంచి 50 మంది వాహనాల్లో బయలుదేరారు. వాంకిడి, రెబ్బెన, జైనూర్, ఇచ్చోడ నుంచి టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములునాయక్ ఆధ్వర్యంలో వందలాది మంది వెళ్లారు. బోథ్ నుంచి జేఏసీ డివిజన్ కన్వీనర్ రావుల శంకర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ముత్యంరెడ్డి, బెల్లంపల్లి నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా సంయుక్త కార్యదర్శి జి.చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరి సంపత్ తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో సుమారు 200 మంది తెలంగాణవాదులు తరిలారు. భీమిని, నెన్నెల, కాసిపేట, చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మందమర్రి, కోటపల్లి, జైపూర్, రామకృష్ణాపూర్, ఖానాపూర్, కడెం, ఇంద్రవెల్లి, జన్నారం, ఉట్నూర్, ముథోల్, లోకేశ్వరం, కుంటాల, కుభీర్, తానూరు, బాసర, భైంసా, కాగజ్‌నగర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తెలంగాణవాదులు వెళ్లారు. -
సకల జన‘భేరీ’లో నేతలు ఎవరేమన్నారు?
నీటి దోపిడీ ఆగుతుందనే కిరణ్ బాధ: నాగం, బీజేపీ రాష్ట్రం విడిపోతే నీటి దోపిడీ ఆగిపోతుందన్నదే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ అని బీజేపీ నేత, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే ఐదు జిల్లాలు కర్ణాటకలో కలిసి పోయాయని, మరో మూడు జిల్లాలు మహారాష్టల్రో భాగమయ్యాయన్నారు. ఇప్పుడున్న బాబ్లీ ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టు ప్రాంతాలు హైదరాబాద్ రాష్ట్రంలో పరిధిలో ఉండేవని, భాషోన్మాదంతో హైదరాబాద్ రాష్ట్రం విడగొట్టడంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వని పక్షంలో వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తామని తమ పార్టీ నాయకులు సుష్మాసర్వాజ్ చెప్పినట్లు గుర్తుచేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు యెండల లకీష్మనారాయణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నిక ల్లోపే రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసి, అభివృద్ధి అంశంపైనే 2014 ఎన్నికలు జరగాలన్నది బీజేపీ ఉద్దేశమని చెప్పారు. తక్షణమే బిల్లు పెట్టాలి: గోవర్ధన్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ యూపీఏ ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి తెలంగాణ బిల్టు పెట్టాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఒక వర్గం నేత గోవర్ధన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తే తిరగబడి తెలంగాణ సాధించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్‌కు అడ్డుపడితే తెలంగాణ మొత్తం ఆగ్నిగుండం అవుతుందన్నారు. న్యూడెమోక్రసీ మరో వర్గం నేత సూర్యం మాట్లాడుతూ.. హైదరాబాద్ యూటీ చేయడంగానీ, రాష్ట్రం సమైక్యంగా ఉంచడం వల్ల ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలకు ఒనగూరే ప్రత్యేక ప్రయోజనమేమీ ఉండదన్నారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్ బేవకూ్ఫ్ అని దుయ్యబట్టారు. ఆంధ్రలో పోరాటం అప్రజాస్వామికం: గుండా మల్లేశ్, సీపీఐ ఆంధ్రా ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు అప్రజాస్వామికమని సీపీఐ శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేష్ దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ అంశంలో మాట మార్చాయని, అవేమి ప్రజాస్వామ్య పార్టీలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో హుందాగా, బాధ్యత… గా వ్యహరించాల్సి ఉన్నా.. విషపురుగులా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. హైదరాబాద్‌పై కిరికిరిలేమీ ఉండవు: కేకే, టీఆర్ఎస్ హెదరాబాద్ అంశంలో ఎలాంటి కిరికిరిలు ఉండవని టీఆర్ఎస్ పార్టీ నేత కే.కేశవరావు అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను తెచ్చుకునే సత్తా ఉందన్నారు. తాను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఎలా ఉండాలన్నది టైపు చేసింది ఇప్పుడు సీఎంగా ఉన్న కిరణేనని చెప్పారు. ముఖ్యమంత్రికి తమను పాలించే హక్కులేదని, నిజాయితీ ఉంటే ఆయన తక్షణమే రాజీనామా చేయాలని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. సీమాంధ్రుల సమస్యలపై చర్చకు సిద్ధం: మల్లేపల్లి, జేఏసీ నేత రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తే సమస్యలపై చర్చకు తెలంగాణ జేఏసీ సిద్ధంగా ఉందని జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లకష్మయ్య చెప్పారు. సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. తక్షణమే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో ఉద్యమంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ నేత శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఏపీఎన్జీవో సభలో జై తెలంగాణ అన్నందుకే కానిస్టేబుల్‌ను విపరీతంగా కొట్టారని, కానీ తమది అలాంటి సంస్కృతి కాదన్నారు. రాష్ట్రం వచ్చాక తెలంగాణ పబ్లిక్ స్వరీస్ కమిషన్ ద్వారా ఒకే రోజు లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకుడు విఠల్ అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది ఆందోళన, తెలంగాణలో జరిగేది ఉద్యమం అని ఆంధ్రా ప్రాంతానికి చెందిన న్యాయవాది ప్రసాద్ అన్నారు. కడుపు మండినవాళ్లది ఉద్యమమని, సీమాంధ్రులది ఉద్యమం కాదని పేర్కొన్నారు. విద్యుత్ జేఏసీ నాయకులు రఘు, జేఏసీ నాయకులు అద్దంకి దయాకర్, వెంకటేశం, కందుల పార్థసారథిరెడ్డి, కత్తి వెంకటస్వామి, అశ్వత్థామరెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు వేదికపై మాట్లాడారు. -
విజయవంతంగా ముగిసిన జనభేరీ, సమైక్య గర్జన
హైదరాబాద్/కర్నూలు: తెలంగాణవాదులు హైదరాబాద్‌లో సకల జన భేరీ పేరుతో, సమైక్యవాదులు కర్నూలు సమైక్య గర్జన పేరుతో నిర్వహించిన రెండు భారీ బహిరంగ సభలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో తెలంగాణ సకల జనభేరి సభకు, కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సమైక్య గర్జన సభకు జనం భారీగా తరలి వచ్చారు. రెండు ప్రాంతాలలో పోటాపోటీగా నిర్వహించిన రెండు సభల ప్రాంగణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. సకల జనభేరీ తెలంగాణ నినాదాలతో, సమైక్య గర్జన సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయాయి. సకల జనభేరీలో నేతలు మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్లిపోవలసిందేన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు. అక్టోబరు 6 తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండరని చెప్పారు. ఆంధ్రా వాళ్లు అందరూ తెలంగాణ ద్రోహులే అని అన్నారు. సమైక్య గర్జనలో మాట్లాడిన నేతలు సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
ఆంధ్రలో పుట్టినవాళ్లు తెలంగాణ ద్రోహులే: కెసిఆర్
-
హైదరాబాద్‌లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన Part 3
-
ఆంధ్రలో పుట్టినవారంతా తెలంగాణ ద్రోహులే: కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నష్టం పోయిందెవడు.. తెలంగాణ ప్రజలా? సీమాంధ్ర ప్రజలా? చెప్పండి అంటూ కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సకల జన భేరీలో భాగంగా నిజాం కళాశాలలో జరిగిన సభలో ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడారు. తొలుత ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్ తనదైన శైలిలో సీమాంధ్ర నాయకులపై విరుచుకుపడ్డారు. ఆంధ్రలో పుట్టినవారంతా తెలంగాణ ద్రోహులేనని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయా?, ఇంత వరకూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరి తరమైనా అయితదా? అని కేసీఆర్ సీమాంధ్ర నాయకుల్ని హెచ్చరించారు. రాష్ట్ర విడిపోతున్న సమయంలో సమైక్యాంధ్ర అంటూ గగ్గోలు పెట్టడం ఉపయోగం లేదన్నారు. ఆంధ్రాలో అసలు మేధావులు ఉన్నరా?ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నరా? అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆంధ్రా ప్రజలు.. ఆంధ్రా వారే. తెలంగాణ ప్రజలు.. తెలంగాణే వారే. ఇక కలిసుండటం అనేది కలలో కూడా జరుగుతాదా ? అని సీమాంధ్ర నాయకులపై నిప్పులు చెరిగారు. ఆంధ్రాలో పుట్టిన వాడు ఆంధ్రా వాడే కానీ తెలంగాణలో లెక్కరాడని తెలిపారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఆపాలని యత్నిస్తున్నారన్నారు. అక్టోబర్ 7వ తేదీ దాటిన తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పని ముగిసినట్లేనని ఆయన తెలిపారు. సీమాంధ్ర నాయకులు పెట్టిన పార్టీలన్నీ ఆ ప్రాంతానికి చెందినవే తప్పా.. తెలంగాణ పార్టీలు కాదని తెలిపారు. ఎంతమంది నాయకులు ఏకమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరితరం కాదన్నారు. ఈ సభను టీవీల్లో వీక్షించకుండా ప్రభుత్వం కరెంటు కట్ చేస్తూ దుశ్చర్యకు పాల్పడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
కిరికిరి రెడ్డికి ఇరిగేషన్ గురించి తెలుసా?:నాగం
హైదరాబాద్:కిరికిరి రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను గురించి మాట్లాడుతూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని బీజీపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన సకల జన భేరీ సభలో మాట్లాడారు.కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులకు, రోడ్లకు తేడా లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అనాధిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసానికి గురి చేస్తోందన్నారు. యూపీఏ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాకపోతే...బీజేపీ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని నాగం తెలిపారు. రెండు ప్రాంతాల్లోనూ ఒకే వైఖరితో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన గుర్తు చేశారు. -
హైదరాబాద్‌లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన Part 2
-
హైదరాబాద్‌లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన
-
ఏపీఎన్జీవోల సమ్మెలో స్పష్టత లేదు
హైదరాబాద్ :సీమాంధ్రలో గత రెండు మాసాలనుంచి సమ్మెతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న ఏపీఎన్జీవోల పై టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు. అక్కడ చేస్తున్న సమ్మెలో స్పష్టత కనిపించడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో నిజాంకళాశాలలో నిర్వహిస్తున్న సకలజన భేరీ సభలో దేవీ ప్రసాద్ మాట్లాడారు. ఏపీఎన్జీవోలు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. హైద్రాబాద్ నిజాం కళాశాలలో నిర్వహిస్తున్న సకల జన భేరి సభకు మండలంలోని జగదేవ్‌పూర్, మునిగడప, ఎరవ్రల్లి, గొల్లపల్లి, తిగుల్, చాట్లపల్లి , పిర్లపల్లి తదితర గ్రామాల నుండి తెలంగాణ వాదులు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల జేఏసీ ఆధ్వర్యంలో బస్‌లు, సుమోలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ,విద్యుత్ రంగ కార్మికులు ,విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలను భారీగా తరలించారు. ఈ సభకు వెళ్లిన వారిలో జేఎసీ నాయకులు తుమ్మ కృష్ణ, విద్యుత్ రంగ కార్మికులు మల్లారెడ్డి, మధు, కృష్ణ, తెలంగాణ వాదులు భిక్షపతి, డి. కృష్ణ, బింగి బాస్కర్, అప్పల ప్రవీణ్ తదితరులు బయిల్దేరి వెళ్లారు. -
హైదరాబాద్‌లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన
హైదరాబాద్/కర్నూలు : హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో తెలంగాణ సకల జనభేరి జరుగుతుంటే, కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సమైక్య గర్జన సభలు జరుగుతున్నాయి. ఈ రెండు సభలకు జనం భారీగా తరలి వచ్చారు. సకల జనభేరిలో నేతలు తెలంగాణవాదం వినిపిస్తున్నారు. మధ్య మధ్యలో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాటలు పాడుతున్నారు. తెలంగాణ నినాదాలు మారుమ్రోగుతున్నాయి. సమైక్య గర్జనలో నేతలు సమైక్యవాదం వినిపిస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లుతోంది. -
సకల జన భేరికి కదులుతున్న ఇందూరు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ఆదివారం జరుగనున్న తెలంగాణ సకల జనభేరి బహిరంగ సభకు ఇందూరు నుంచి భారీగా తెలంగాణవాదులు తరలివెళ్లనున్నారు. జనాల తరలింపునకు తెలంగాణ జేఏసీ భాగస్వామ్యపక్షాలు సన్నాహాలు పూర్తి చేశాయి. ఇందులో టీఆర్ఎస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. పది రోజులుగా జిల్లా రాజకీయ జేఏసీ భాగస్వామి పక్షాలు, తెలంగాణ వాదులు విస్తృత ప్రచార కార్యక్రమాలతో పాటు సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యం లోనే జిల్లా నుంచి 25 వేల మందిని జనభేరి సభకు తరలించనున్నారు. నిజామాబాద్ నగరంలో వారం రోజుల వ్యవధిలో జనభేరి బహిరంగ సభ విజయవంతం కోసం రెండు సన్నాహాక సభలు నిర్వహించగా టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రతిని ధులు అద్దంకి దయాకర్, ప్రముఖ కళాకారుడు రసమ యి బాలకిషన్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు, ఆందోళనలు, మానవహారాల తో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం చేశారు. టీఆర్ఎస్తో సహా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాలు, అన్ని జేఏసీలు జనభేరి జయప్రదం కోసం పలు కార్యక్రమాలు చేపట్టా యి. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాసరెడ్డి,ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, నియోజకవర్గం ఇన్చార్జులు బస్వా లక్ష్మీనర్సయ్య, ఎ జీవన్‌రెడ్డి, భూపతిరెడ్డి, సురేందర్‌రెడ్డి, బంగారు నవనీతల తోపాటు పార్టీ జిల్లా ఇన్చార్జి కరిమిళ్ల బాబూరావులు జనసమీకరణ కోసం విస్తృతంగా జిల్లాలో పర్యటిం చారు. న్యూడెమోక్రసీతో పాటు ఉద్యోగ, విద్యార్థి, జేఏ సీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిం చారు. సకల జనభేరి సభకు ప్రజలను తరలించడానికి 385 వాహనాలను టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం సమకూర్చింది. జిల్లా నుంచి జనాన్ని సమీకరించేందుకు ఇన్చార్జి బాధ్యతలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు. పోచారం జనసమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జులు, ఎమ్మెల్యేలతో పాటు టీజాక్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల నుంచి నాలుగు వేల మంది, ఇతర నియోజకవర్గాల నుంచి 15 వందల మందిని హైదరాబాద్ సభకు తరలించటానికి ఏర్పా ట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ ఇన్చార్జులు వాహనాలను సమకూర్చుకోవడంతో పా టు సభకు తరలివచ్చే ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలను కల్పించే బాధ్యతలను తీసుకున్నట్టు తెలుస్తోం ది. జనసమీకరణలో ఇన్చార్జులు పోటీపడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. నియోజక వర్గాల వారీ గా 40 వాహనాలకు తగ్గకుండా ఏర్పాటు చేయటంతోపాటు అవసరాన్ని బట్టి అదనంగా టాటాసుమోలు, తుఫాన్ వంటి వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు ప్రస్తుతం కీలక సమయం కావటం వల్లనే సకల జనసభను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా టీజేఏసీకి అదనంగా 25 వాహనాలను సమకూర్చారు. ఈ వాహనాల్లో ప్రధానంగా ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలి వెళ్లనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ నుం చి 20 వేల మంది, తెలంగాణ జేఏసీతోపాటు న్యూడెమోక్రసీ, సీపీఐలు కలసి ఐదువేల మందిని హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీజేఏసీలో భాగస్వామ్యపక్షమైన భారతీయ జనతాపార్టీ కూడా హైదరాబాద్‌కు జనసమీకరణపై దృష్టిసారిం చినట్టు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ కూడా జనభేరికి మద్దతు ప్రకటించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. -
సకల జనభేరికి భారీగా ఆదిలాబాద్ తెలంగాణవాదులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించే సకల జనభేరికి భారీగా తరలివెళ్లేందుకు తెలంగాణవాదులు సన్నద్ధమయ్యారు. పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లు పెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తె చ్చే ప్రయత్నాల్లో భాగంగా నిర్వహించే జనభేరికి భారీగా జిల్లా నుంచి తరలనున్నారు. రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల జేఏసీలతోపాటు ప్రత్యేక తెలంగాణ కోరుకునే రాజకీయ పార్టీలన్నీ జనసమీకరణలో నిమగ్నమయ్యాయి. సకల జనభేరి నేపథ్యంలో వారం రోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీలతోపాటు వివిధ రాజకీయ పార్టీలు జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ఆవిష్కరణతోపాటు జనభేరిని సక్సెస్ చేయాలంటూ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, ముథోల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్ తదితర నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 25 వేల మందికి తగ్గకుండా తరలించేందుకు ఆర్టీసీ బస్సులు, రైళ్లతోపాటు ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేశారు. సీఎం దిష్టిబొమ్మలు దహనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై జిల్లావాసులు భగ్గుమన్నారు. ఈ సందర్భంగా శని వారం జిల్లావ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలను ద హనం చేశారు. ముఖ్యమంత్రి పిచ్చిపట్టి తెలంగాణ అంశంపై అనాలోచితంగా మాట్లాడుతున్నారని సీపీఐ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ బెల్లంపల్లిలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడ్డం శోచనీయమని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల సీఎం అవలంబిస్తు న్న వైఖరి సిగ్గు చేటని టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి ఆదిలాబాద్‌లో వి లేకరుల సమావేశంలో విమర్శించారు. 13 జిల్లా ల సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని రాజకీయ జేఏసీ తూర్పు జిల్లా చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు, కన్వీనర్ రవీందర్రావు డిమాండ్ చేశారు. మంచిర్యాలలో సకల జనభేరి ప్రచార పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే జలయుద్ధం జరుగుతుందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్ డిమాండ్ చేశారు. సకల జనభేరికి అటవీశాఖ ఉద్యోగులు తరలిరావాలని మినిస్టీరియల్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పిలుపునిచ్చారు. కాగా సీఎం వ్యాఖ్యలకు నిరసనగా దండేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సీఎం దిష్టిబొమ్మలను దహనం చేయగా, లక్సెట్టిపేట ఐబీ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ అవుట్ సోర్సింగ్ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వాంకిడి, రెబ్బెన, జైనూర్ మండలాల్లో జేఏసీ ఆద్వర్యంలో రాష్ట్రీ య రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మార్మోగిన తెలం‘గానం’... ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించే సకల జనభేరిని సక్సెస్ చేసేందుకు భారీ జనసమీకరణ కోసం శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహిం చిన సన్నాహక సమావేశాలు, ర్యాలీలతో తెలం‘గానం’ మార్మోగింది. ఆదిలాబాద్, మంచిర్యా ల, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్ రెవెన్యూ డివి జన్ల పరిధిలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రచార ర్యాలీలు జరిగాయి. సకల జనుల భేరీకి జిల్లా వాసులు ప్రభంజనంలా తరలిరావాలని తాండూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. సకల జనభేరిని విజయవంతం చేయాలని ఖానాపూర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట సత్యం, ప్ర ధాన కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జన్నారం మండలంలో కార్యక్రమం విజయవంతం చేయాలని టీఆర్ఎస్, టీఆర్ఎస్వీల నాయకులు సత్యం, భరత్ వేర్వేరుగా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేశారు. ఇంద్రవెల్లి మండలంలో టీఆర్టీయూ సంఘం మండల అధ్యక్షుడు అంబాజీ ఆధ్వర్యంలో సకల జనభేరి పోస్టర్లు విడుదల చేశారు. ఏదిఏమైనా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హైదరాబాద్‌కు తరలేందుకు సన్నద్ధమయ్యారు. -
అటెండర్ నుంచి అధికారి వరకు ‘చలో హైదరాబాద్’
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా సక ల జనభేరి మోగిస్తాం. ఇందుకు జిల్లావాసులు అ ధిక సంఖ్యలో తరలిరావాలి. జనభేరితో ప్రభుత్వం తలొగ్గక తప్పదు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటూ టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.అశోక్ పేర్కొన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.. నిన్నా మొన్నటి వరకు ఆయన ఎవరికీ తెలీదు.. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నెలరోజుల కిందటి వరకు విజయవాడలో ఎవరో తెలియదు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట అతన్ని సీమాంధ్ర మీడియా తెరపైకి తెచ్చింది. సమైక్యవాద ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన అశోక్‌బాబు వాస్తవాలను వక్రీకరిస్తూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే రెండు రాష్ట్రాల సచివాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుందన్న కనీస జ్ఞానం లేకుండా ఉద్యోగులను సైతం తరిమికొడతారంటూ తప్పుడు ప్రచారం చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమే. ఎన్టీఆర్ హయాంలోనే 610 జీవో.. 985 డిసెంబర్ 26న అప్పటి టీఎన్జీవో నేత స్వామినాథం ఇచ్చిన రిప్రెజెంటేషన్ మేరకు అప్పటి సీఎం ఎన్టీ రామారావు 610 జీవో విడుదల చేస్తే ఇప్పటివరకు అమలుకాలేదు. సచివాలయం కేంద్రంగా అడుగడుగునా ఉల్లంఘనకు పాల్పడుతూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. 14ఎఫ్ రద్దయినా కోర్టు స్టే మీద చాలామంది సీమాంధ్ర ఉద్యోగులు ఫ్రీజోన్ పేరిట హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలగాణ ఏర్పడితే సీమాంధ్ర ఉద్యోగులను ఎల్లగొడతారనేది అపోహ. సీఎంది అవివేకం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ సర్కార్ సుముఖత వ్యక్తం చేసిన తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విభజనకు అడ్డుతగలడం అవి వేకం. సీమాంధ్రలో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమం. ఆ ఉద్య మం వెనక సీమాంధ్ర సీఎంగా మారిన కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్ర ఉంది. తెలంగాణలో ఉద్యోగులు సకల జనుల సమ్మెకు దిగితే ‘ఎస్మా’ లాంటి కఠిన చట్టాల పేరిట బెదిరించిన సీఎం సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయని వాపోయారని.. అయితే సీమాం ధ్రలో 60 రో జులుగా ఆయనే వెనుకుండి ఉద్యమం నడిపిస్తుంటే అక్కడ పథకాలు కుంటుపడడం లేదా..? రాష్ట్ర విభజన జరిగితే జల వివాదాలు ఉంటాయనడం అవివేకం. జాతీయ స్థాయిలో జ ల వివాదం పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్, జల వనరుల సం ఘాలు ఉన్న విషయాలను తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇంటికొకరు చొప్పున జనభేరికి.. ఆరు నూరైనా... నూరారైనా.. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌం డ్లో సకల జనభేరి జరుగుతుంది. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికు లు, వృత్తిదారుల జేఏసీలతోపాటు తెలంగాణ కోరుకునే అన్ని రాజకీయ పార్టీలు భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశాయి. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఇంటికొక్కరు చొప్పున చలో హైదరాబాద్ తరలేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సత్వరమే జరగాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి.. రాష్ట్రపతి పా లన విధించాలి. తెలంగాణ ప్రక్రియకు అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. ఆర్టికల్-3 ప్రకారం పార్లమెంటులో తీర్మానం పెట్టి ఆమోదిస్తే తక్షణమే రాష్ట్రం ప్రకటించే అవకాశం ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రకాల ఉద్యమాలు కొనసాగిస్తాం. - సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ -
సకలం సన్నద్ధం
ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్లో వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జేఏసీ తలపెట్టిన సకల జనభేరికి జిల్లానుంచి వేలాదిగా తరలి వెళుతున్నారు.తెలంగాణ ప్రకటన వెలువడినా పార్లమెంట్లో బిల్లు పెట్టే విషయంలో కాంగ్రెస్ నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ వాదులు భారీగా సకల జనభేరిని నిర్వహిస్తున్నారు. దీనిని విజయవంతం చేయడానికి జేఏసీలు, రాజకీయ పార్టీలు అన్ని వర్గాల వారిని సన్నద్ధం చేశాయి. ఇప్పటికే జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందు, మధిర, మణుగూరు, సత్తుపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్, జేఏసీ రాష్ట్ర నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, గోవర్థన్లతోపాటు పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకురాలు విమలక్క జిల్లాలో పర్యటించి సకలజన భేరికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా సభలు,సమావేశాలతోపాటు నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. జిల్లా నుంచి 25వేల మంది తరలింపు సకల జనభేరి సభకు జిల్లానుంచి 25వేలమందిని తరలిస్తున్నట్లు జేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, కనకాచారి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో సీమాంధ్ర నాయకులు మోకాలడ్డటం, సీడబ్ల్యూసీ ప్రకటనను వెనక్కు తీసుకునేలా కుట్రలు పన్నడాన్ని నిరసించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ఈ సభ ద్వారా తెలపాలని జేఏసీ పిలుపునిచ్చిందని వివరించారు. ఆదివారం ఉదయం ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి 100 బస్సులలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక వర్గాలతోపాటు తెలంగాణ జేఏసీలో అంతర్భాగమైన అన్ని రాజకీయ పక్షాల వారు బయలుదేరతారని తెలిపారు. వీరితోపాటు మరో 200 ప్రైవేట్ వాహనాలు, లారీల ద్వారా వేలాదిగా తరలివచ్చేందుకు ఇప్పటికే తెలంగాణ వాదులు సిద్ధమయ్యారని చెప్పారు. జిల్లా మీదుగా వెళ్లే శాతవాహన, కోణార్క్, గోల్కొండ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు, భద్రాచలంరోడ్ లైన్‌ద్వారా డోర్నకల్ నుంచి వెళ్ళే రైళ్లలో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు తరలి వెళుతున్నట్లు తెలిపారు. సత్తుపల్లి, ఇల్లందు, తదితర ప్రాంతాలలోని సింగరేణి కార్మికులు జనభేరికి భారీగా తరలి వెళ్ళనున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. బోనకల్, మధిర తదితర ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో తెలంగాణవాదులను తరలిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. -
బిల్లు ఆమోదించేవరకూ ఉద్యమం
సత్తుపల్లి, న్యూస్‌లైన్ : వెయ్యి మంది తెలంగాణ అమరవీరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని.. పార్లమెంట్లో బిల్లు ఆమో దం పొందేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని టీజేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు స్పష్టం చేశారు. స్థానిక కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి జరిగిన సకలజనుల భేరి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీ, యూపీఏ ప్రకటన వెలువడి 60 రోజులు కావస్తున్నా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై నోట్ పెట్టకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యమం సాగుతోందని.. ఏపీఎన్జీఓలు హైద్రాబాద్‌లో ఉంటూ.. ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలోని అన్ని పార్టీల నాయకులు కలిసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి ఆటలు సాగవని అన్నారు. తెలంగాణ వాదులంతా ఏకమై సకలజనుల భేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం జిల్లా నుంచి 25 వేల మందిని తరలిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియను అడ్డుకుంటే కాంగ్రెస్, సీమాంధ్ర పార్టీలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తి ఆపలేదని.. సకల జనులభేరికి స్వచ్ఛందం గా తరలి రావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం, సీమాంధ్రులు కళ్లు తెరిచేలా హైద్రాబాద్‌కు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ టీజేఏసీ నాయకులు వెంకటపతిరాజు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బానిసలుగా ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు మాట్లాడటం గర్హనీయమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలను బంతిలాగ ఆడుకుంటున్నారని.. ఆరు బాళ్లలో ఆరు సిక్సర్లు కొట్టినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని అన్నారు. టీజేఏసీ కన్వీనర్ చిత్తలూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సత్తుపల్లి టీజేఏసీ చైర్మన్ కూకలకుంట రవి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాలడుగు శ్రీనివాస్, టీచర్స్ టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, లాయర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు తిరుమలరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, దండు ఆదినారాయణ, వందనపు భాస్కర్‌రావు, ఎస్కె అయూబ్‌పాషా, జగదీష్, బి.మధుసూదన్‌రాజు, చెంచురెడ్డి, ముత్యారత్నం, దొడ్డా రమేష్, శ్రీను, రామ్‌నాయక్, ఎ.రాము, వెంకన్న, అద్దంకి వెంకటరత్నం, తడికమళ్ల యోబు, నాగమణి, సంధ్య, షహనాజ్‌బేగం, సోయం కమల పాల్గొన్నారు. -
హైదరాబాద్ జోలికి వస్తే ఉపేక్షించం: జేఏసీ
కందుకూరు,న్యూస్‌లైన్: సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలతో తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని, అందులో భాగంగానే హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్నారని జేఏసీ రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగం చైర్మన్ వెదిరె చల్మారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ జోలికొస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సకల జన భేరి సమావేశానికి సన్నాహకంగా మండల కేంద్రంలోని విద్యామయి కళాశాలలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఇదే రోజు భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కబ్జా చేసిన భూములు, అక్రమంగా కొల్లగొట్టిన ఆస్తులను కాపాడుకోవడానికే సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్రా అంటూ కృత్రిమ ఉద్యమానికి తెరలేపారని మండిపడ్డారు. మరోపక్క తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన పార్టీలు యూ టర్న్ తీసుకోవడాన్ని దుయ్యబట్టారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటూ చంద్రబాబు, సమైక్యాంధ్రా అంటూ జగన్, యూటీ అంటూ చిరంజీవి వంటి నేతలు ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. 29న నిర్వహించనున్న సకలజనభేరి సభను విజయవంతం చేయాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి బొక్క నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. 2009లో వచ్చిన ప్రకటనను ఆపిన విధంగానే మళ్లీ సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు. తెలంగాణ వాదులంతా జాగ్రత్తగా ఉండి వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు స్వార్థంతో పనిచేస్తున్నాయని, రెండు రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. పదకొండు వందల మంది విద్యార్థులు ఆత్మత్యాగాలు చేసుకున్న ఫలితమే తెలంగాణ కల సాకారమవ్వడానికి కారణమన్నారు. సీమాంధ్రులు రెండు లక్షల ఉద్యోగాలను అక్రమంగా దోచుకున్నారని, భాష, యాసను అవమానపరుస్తూ తెలంగాణ సంసృ్కతిపై దాడి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జేఏసీ మహేశ్వరం నియోజకవర్గం కన్వీన ర్ అశోక్, బీజేపీ మండల ప్రధానకార్యదర్శి సాధ మ ల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్‌గౌడ్, విద్యామయి కళాశాల ప్రిన్సిపాల్ బాల్‌రాజ్, ఏబీవీపీ భాగ్ కన్వీనర్ మహేందర్ తదితరులున్నారు. -
సకల జనభేరిని అడ్డుకుంటే సహించం: రాజేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సకల జనభేరి సదస్సుకు ఎలాంటి అడ్డం కులు కల్పించినా సహించేది లేదని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. అడ్వొకేట్స్ జేఏసీ నేతలు ప్రహ్లాదరావు, శ్రీరంగారావుతో కలిసి హైదరాబాద్‌లో ‘సకల జనభేరి’ పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరాధార, అసత్య ప్రచారంతో హైదరాబాద్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 29న జరిగే సకల జనభేరికి తెలంగాణ న్యాయవాదులంతా కుటుంబ సభ్యులతోపాటు తరలిరావాలని రాజేందర్ పిలుపునిచ్చారు. సకల జనభే రీకి పో లీసులు అనుమతిని ఇచ్చినప్పటికీ, జిల్లాల్లో జరిగే సన్నాహక సమావేశాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఏవీ కాలేజీ నుంచి నిజాం కాలేజీ దాకా భారీ ర్యాలీని నిర్వహిస్తామని, అందరూ ఉదయమే అక్కడకు చేరుకోవాలన్నారు. సకలజన భేరిని జయప్రదం చేయండి ఈ నెల 29న జరగనున్న సకలజన భేరి సభను విజయవంతం చేయాలని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్. విద్యాసాగర్‌లు పిలుపునిచ్చారు. సకల జనుల భేరీ విజయవంతం చేయండి: ఏపీటీఎఫ్ ఈ నెల 29న జరిగే సకల జనుల భేరీని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ తెలంగాణ ప్రిసీడియం ప్రతినిధులు కె.వేణుగోపాల్, కొండల్‌రెడ్డి, మనోహర్ గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం 2న ఉపాధ్యాయ గర్జన: పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 2న ఉపాధ్యాయ గర్జన నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 గం. నుంచి గర్జన నిర్వహిస్తామన్నారు. -
సకల జన భేరితో సమాధానం చెబుదాం: దేవీప్రసాద్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణపై ఆధిపత్యం కోసమే సీమాంధ్రులు ఉద్యమం చేస్తున్నారని టీఎన్జీఓల అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో టీఎన్జీఓల జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అధ్యక్షతన 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకలజన భేరికి సన్నాహకంగా జనభేరి సభను నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న దేవీప్రసాద్ మాట్లాడుతూ, టీఎన్జీఓల ప్రతి పోరాటం ప్రజల పక్షానే సాగిందన్నారు. 1952లో ఫజల్ అలీ కమిషన్ ఎదుట తిరుగుబాటు జెండా మొదలు, నేటి ఉద్యమం వరకు ప్రజల పక్షానే పోరాడుతున్నామన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్న సీమాంధ్రులు..చరిత్రను తెలుసుకోవాలన్నారు. 1956కు పూర్వమే చార్మినార్, ఉస్మానియా యూనివర్సిటీ, వైద్యశాల, ఎముకల ఆస్పత్రి, డ్రైనేజి వ్యవస్థతో హైదరాబాద్ ప్రపంచంలోని ఐదు సుందర నగరాల్లో ఒకటిగా కీర్తి గడించిందన్నారు. విలీన సమయం నుంచి సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాటకు దక్కాల్సిన 5 లక్షల 20 వేల ఉద్యోగ్లాలో కేవలం 2 లక్షలు మాత్రమే దక్కాయన్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టి ఈ ప్రాంత వెనుకబాటు తనానికి కారణమైంది మీరుకాదా అని సీమాంధ్రులను ఆయన ప్రశ్నించారు. 610 జీఓ, 36 జీఓ, గిర్గ్లానీ కమిటీల ద్వారా సీమాంధ్రులు లక్షలాది ఉద్యోగాలు కొల్లగొట్టిన విషయం తేటతెల్లమైందన్నారు. అందువల్లే కడుపు మండి ప్రజల పక్షాన టీఎన్జీఓలంతా పోరాడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా వత్తిడి తేవాలన్నారు. ఏపీ సేవ్ పేరిట ఏపీఎన్జీఓలు నిర్వహించిన సభకు రాష్ట్ర ప్రభుత్వం రాచమార్గంలో సహకరించిందన్నారు. వేలాది మంది సీమాంధ్రుల మధ్య దుబ్బాక ముద్దుబిడ్డ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను చాటి చెప్పాడన్నారు. ఒకడి నినాదాన్నే సహించలేని సీమాంధ్రులు నాలుగున్నర కోట్ల ప్రజల నినాదాలిస్తే ఆ సునామీలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. విభజన అనివార్యమని, అందుకు సహకరించాలని ఏపీఎన్జీఓలను దేవీప్రసాద్ కోరారు. సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం అన్ని రాజకీయ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని తేలిపోయిందన్నారు. సీమాంధ్రను చూసైనా ఐక్యమై ప్రజల ఆకాంక్ష మేరకు అధిష్టానంపై వత్తిడి చేసేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌పై కిరికిరి చేయవద్దని...హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే నినాదం ఇచ్చారు. అక్రమంగా ప్రవేశించిన సీమాంధ్రులు కొల్లగొట్టిన ఉద్యోగాలతో ఈ ప్రాంతంలోని బిడ్డలు పరాయి బిడ్డలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయాలి ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేయాలనీ, మహిళ పోస్టులను పూర్తి స్థాయిలో తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా నియమించాలని టీఎన్జీఓల కేంద్ర కమిటీ సభ్యుడు కారం రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. టీఎన్జీఓల కార్యాచరణలో నిజాయితీ ఉందనీ, ఆ మేరకు పనిచేయడం వల్లే ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ సమస్యలను పరిష్కరించుకుంటున్నామన్నారు. 29న నిర్వహించనున్న సకలజన భేరికి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న సమయంలో సీమాంధ్ర మంత్రుల భార్యలు ఏం చేశారని టీఎన్జీఓల మహిళా విభాగం అధ్యక్షులు రేచల్ ప్రశ్నించారు. తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివప్రసాద్, కేంద్రకమిటీ సభ్యులు ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ పోరాటమన్నారు. సెక్రటేరియట్లో సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనం కారణంగానే ఈ ప్రాంతం వెనుకబడిందన్నారు. సమావేశంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, టీఎన్జీఓల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, శ్రీనివాస్‌రెడ్డి, శ్వాంరావు తదితరులు మాట్లాడుతూ, సకలజన భేరికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జీతం కోసం పీఆర్సీ జీవితం కోసం తెలంగాణ నినాదంతో ముందుకు సాగుదామన్నారు. ఈ సందర్భంగా సకలజన భేరి వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. -
చంద్రబాబుకు మైండ్ దొబ్బింది: కేసీఆర్
ప్రజలు కొడుతున్న దెబ్బలతో ఆయన మానసిక పరిస్థితిలో మార్పు వచ్చింది: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు మైండ్ దొబ్బిందని, ఆయన మానసిక పరిస్థితిలో తేడా వచ్చిందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ‘ప్రజలు కొడుతున్న దెబ్బలతో ఆయన మానసిక పరిస్థితిలో తేడా వచ్చింది. పి టర్న్ అట. అంటే ఏంది? ఎవరిని మోసం చేయడానికీ టర్నుల మీద టర్నులు? ఎన్నిసార్లు తీసుకుంటావు ఈ టర్నులు? డిసెంబర్ 7 నాడొక టర్న్, 9 నాడొక టర్న్, ఆ తరువాత రెండుకండ్ల టర్న్, ఇప్పుడేమో పి టర్న్ అట. శ్రీరంగనీతులు చెబుతూ ఢిల్లీలో చీకటి వ్యవహారాలు చేస్తున్నడు. ఏం చెప్పినా సీమాంధ్ర టర్నే. ఎందుకీ కంఠశోష తెలంగాణకు వ్యతిరేకినని సూటిగా చెప్పు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఇంకా సిగ్గూ, లజ్జా లేకుండా అక్కణ్ణే పడి ఉంటరా? దేభ్యపు ముఖాలేసుకుని ఉండకుండా పాపాలను కడుక్కోండి. పాపాల భైరవునివంటి చంద్రబాబుని విడిచిపెట్టి తెలంగాణ ప్రజలతో కలవండి..’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఆయన సోమవారం టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సీమాంధ్రకు ప్యాకేజీ అని చంద్రబాబు ఎట్లా అంటరు? సమైక్యపాలనలో తెలంగాణ.. వనరులు, నీళ్లు, ఉపాధి, ఉద్యోగ, విద్యారంగాల్లో దోపిడీకి గురయింది. ఎంతో కష్టపడి, నష్టపోయి గోస పడ్డది. నష్టపోయిన తెలంగాణకు పరిహారం ఇస్తరా? లాభపడిన ఆంధ్రాకు పరిహారం ఇస్తరా? ఏమన్నా మాట్లాడితే హద్దూపద్దూ ఉండాలి’ అని అన్నారు. హైదరాబాద్ నుండి తెలంగాణవారు కూడా పోవాలని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేస్తున్నారు కదా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘ఆయన గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. తెలంగాణవారు హైదరాబాద్ నుండి వెళ్లాలనడం పనికిమాలినతనం, హాస్యాస్పదం..’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లోనే ఉన్నానని, చాలా అంశాల పై మాట్లాడుతున్నట్లు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పూర్తవుతుందని చెప్పారు. 10 ఏండ్ల దాకా హైదరాబాద్‌కు ఓకే... తెలంగాణ ప్రజలను ఎన్ని కష్టాలు పెట్టినా వారికి మానవీయత ఉందని కేసీఆర్ అన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ నుండి ఆంధ్రా రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని చెప్పారు. ఆంధ్రా ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు తీసుకుని హైదరాబాద్‌లో పన్నులు కడతామని, ఇంకా ఇక్కడే ఉంటామని వారంటే ఎవరికైనా అభ్యంతరం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. ఐటీ ప్రాజెక్టు కొత్తదేమీ కాదు హైదరాబాద్ అభివృద్ధి కోసం చంద్రబాబు, వైఎస్ వంటి సీమాంధ్ర రాజకీయ నాయకులు చేసిందేమీ లేదని కేసీఆర్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చేనాటికే హైదరాబాద్‌లో 106 పరిశ్రమలున్నాయని తెలిపారు. అభివృద్ధి చేసినట్టుగా చెప్పుకుంటున్న వారెవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏమీ చేయలేదని పేర్కొన్నారు. రూ.2.19 లక్షల కోట్లతో 20 ఏండ్ల కాలంలో ఐటీఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈనాటిది కాదని, నాలుగైదేండ్లుగా దీనిపై చర్చ జరుగుతున్నదని వివరించారు. అమెరికాలోని సిలికాన్‌వ్యాలీ, చైనాలోని సాంజల్ నగరాలు రెండూ కలిపి హైదరాబాద్‌లో ఆవిష్కృతం కానున్నాయని చెప్పారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 65 లక్షల మందికి ఉపాధి వస్తుందన్నారు. మేధావినని చెప్పుకునే జయప్రకాశ్ నారాయణ వంటి రిటైర్డు ఐఏఎస్ అధికారి కూడా దీనిపై విషం చిమ్మే విధంగా మాట్లాడటం దురదృష్టకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సకల జనభేరికి భారీగా తరలాలి ఈ నెల 29న హైదరాబాద్‌లో జరిగే సకల జనభేరి సదస్సుకు భారీగా తెలంగాణవాదులు తరలిరావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే 5 వేలమందిని, మిగిలిన నియోజకవర్గాల నుండి వెయ్యి మందిని సకల జనభేరి సదస్సుకు తరలించాలని నేతలకు సూచించారు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికులు అగ్గిపెట్టెలో ఒదిగిపోయే శాలువాను, చీరను ఈ సమావేశంలో కేసీఆర్‌కు అందజేశారు. బి.జగన్మోహన్రావు రాసిన ‘కేసీఆర్ ఉద్యమస్ఫూర్తి-తెలంగాణ’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. -
నేడు సంగారెడ్డిలో టీజేఏసీ భారీ ర్యాలీ
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నిజాం కళాశాలలో ఈ నెల 29న నిర్వహించనున్న సకలజనుల భేరి విజయవంతానికి జిల్లా టీజేఏసీ, ఉద్యోగ సంఘాలు, టీఆర్ఎస్ జిల్లాలో సన్నాహక కార్యక్రమాలపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా టీ జేఏసీ మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో భారీ ర్యాలీ, సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సన్నాహక సమావేశానికి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. టీ జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే మరో బృందం పాత బస్టాండు నుంచి జడ్పీ వరకు ర్యాలీ నిర్వహిస్తుంది. అనంతరం జడ్పీ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఉద్యోగసంఘాలు సైతం సకలజనుల భేరి విజయవంతంపై దృష్టి పెట్టాయి. ఈనెల 25వ తేదీన టీఎన్జీవో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలతో కలిపి సంగారెడ్డి, జహీరాబాద్‌లో ర్యాలీ, సభలు నిర్వహించనుంది. ఈ సభలకు టీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు దేవీప్రసాద్ హాజరుకానున్నారు. కాగా టీఆర్ఎస్ పార్టీ సైతం 29వ తేదీన నిర్వహించనున్న సకలజనుల భేరికి భారీగా జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లా నుంచి 12వేల మందిని భేరికి తరలించేందకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తెలిపారు. -
‘సకల జన భేరి’ని విజయవంతం చేయండి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి 50 రోజులు గడచినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణా చేపట్టకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 29న నిజాం గ్రౌండ్లో జరిగే ‘సకల జన భేరి’కి భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గెజిటెడ్ అధికారులకు పిలుపు నిచ్చారు. స్థానిక తెలంగాణ గెజిటెడ్ భవన్లో ఆదివారం జరిగిన ప్రత్యేక సదస్సులో గౌడ్ ప్రసంగించారు. తెలంగాణపై 29లోగా కేబినెట్లో తీర్మానం చేయకపోతే మరో సమ్మె తప్పదని హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ప్రభుత్వమే నడిపిస్తోందని, కృత్రిమ ఉద్యమమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడే సమయంలో ఉద్యోగులుగా ఉన్నందుకు గర్వ పడాలన్నారు. -
'జనభేరి'కి సీఎం అడ్డంకులు
మహబూబాబాద్, పాల్వంచ, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో ఈనెల 29 నిర్వహించనున్న సకల జనభేరి సభను అడ్డుకునేందుకు సీమాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని వేంనూర్ గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్తూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ.. సకల జనభేరి సభను విజయవంతం చేయడంలో భాగంగా చర్చించేందుకు హైదరాబాద్‌లోని కూకట్పల్లి వెళ్లిన నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సమావేశానికి అనుమతిచ్చిన హాలు యజమానిని కూడా బెదిరించారన్నారు. హైదరాబాద్‌ను లూటీ చేసేందుకే సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని కోదండరాం అన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే యుద్ధమేనని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ ఆదాయంతోనే ఆంధ్రా డిపోలు నడుస్తున్నాయని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఆంధ్రా డిపోలు ఎత్తివేస్తారనే ఆలోచనతోనే అక్కడి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటపట్టారని పేర్కొన్నారు. పాల్వం చలో కూడా కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కిరణ్‌పై మండిపడ్డారు. ఆయన సీమాంధ్రకే సీఎం అని, తెలంగాణకు ముఖ్యమంత్రి లేడని అన్నారు. భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలో భాగమేనన్నారు. -
29న సకల జన భేరి: టీ జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ‘సకల జన భేరి’ పేరిట సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో అవగాహన సదస్సును నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన శనివారం జరిగిన జేఏసీ విస్తృత స్థాయి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని చేయాలనే నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఎలాంటి పరిమితులు, షరతులు లేకుండా హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. సీమాంధ్ర పరిపాలనా అవసరాల కోసం మాత్రమే దాన్ని తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా మాత్రమే చేయాలని, అంతేగాక ‘తాత్కాలిక ఉమ్మడి రాజధాని’ అనే ప్రస్తావనను కేబినెట్ తీర్మానంలో, పార్లమెంటు బిల్లులో కూడా స్పష్టం చేయాలని కోరింది. ఈ మేరకు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కూడా జరగాలని తీర్మానించింది. భేటీ నిర్ణయాలను కోదండరాం, జేఏసీ నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, విఠల్ తదితరులు మీడియాకు వివరించారు. హైదరాబాద్‌పై అవగాహన కోసమే సకల జన భేరిని తలపెట్టామన్నారు. దాన్ని నిజాం కాలేజీ మైదానంలో జరపాలన్న యోచన ఉందని, నిర్ణయం ఇంకా తీసుకోలేదని వివరించారు. హైదరాబాద్‌తో కలిపి 10 జిల్లాలతో తెలంగాణ కోసం కేంద్ర కేబినెట్లో తీర్మానం చేయాలని, పార్లమెంటులో వెంటనే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినంగా జరపాలని పేర్కొన్నారు. ఆ రోజు జాతీయ జెండాను, తెలంగాణ జేఏసీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 22న వికారాబాద్‌లో అవగాహన సభ, ర్యాలీ నిర్వహిస్తామని, జిల్లాలవారీగా సన్నాహక సకల జనభేరీ సభలు, ర్యాలీలు చేపడుతున్నామని వివరించారు. గుంటూరులో మంద కృష్ణ మాదిగ నిర్వహించబోయే సభకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి 45 రోజులు దాటుతున్నా ఆచరణలో ఒక్క అడుగూ ముందుకేయలేదని విమర్శించారు. బిల్లుకు జాప్యం చేయడమే రెండు ప్రాంతాల ప్రజల మధ్య శాశ్వత వైషమ్యాలు పెరిగే పరిస్థితులకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సమైక్య పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సమైక్య రాష్ట్రం కోసం పని చేస్తోందని కోదండరాం విమర్శించారు. వైఎస్సార్సీపీ సమైక్య పార్టీ అయితే టీడీపీ అటూ ఇటూ కాకుండా అస్పష్ట వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీని అమలు చేయించుకోవడంలో ఆ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అధిష్టానంపై కాంగ్రెస్ నేతలే ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సభ సీమాంధ్రులు, సీఎం కిరణ్ కలసికట్టుగా చేసిన కుట్రలో భాగమేనని ఆరోపించారు. తెలంగాణ రాకుండానే హోర్డింగులు, ఫ్లెక్సీలతో సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ మంత్రులు, అధిష్టానం ప్రకటించిన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఎందుకు అమలు చేయించడం లేదని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్‌లో సభ పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. సంబరాలు జరుపుకునే నైతికహక్కు కాంగ్రెస్‌నేతలకు లేదన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలి: బీజేపీ సీమాంధ్ర ముఖ్యమంత్రి, పాలకుల చేతిలో విభజన జరిగితే తెలంగాణకు న్యాయం జరగదని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వర్‌రావు అన్నారు. అసెంబ్లీని రద్దుచేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యే దాకా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని న్యూ డెమొక్రసీ నేతలు కె.గోవర్ధన్, పోటు రంగారావు సూచించారు. వెయ్యిమంది తెలంగాణలో యువకులు ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబునాయుడు ఎక్కడ ఉన్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భేటీలో కె.కేశవరావు, ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి (టీఆర్ఎస్), అశోక్ యాదవ్, ఎన్.వేణుగోపాలరెడ్డి, సుధాకర శర్మ (బీజేపీ), జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్, మామిడి నారాయణ, గోపాలశర్మ, జిల్లా జేఏసీల అధ్యక్షులు, వివిధ సంఘాల బాధ్యులు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను ఎందుకు మోస్తున్నట్టు?: కేకే తెలంగాణపై ప్రకటన తప్ప ఆచరణలో ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీని ఎందుకు అభినందిస్తున్నారంటూ జేఏసీ సమావేశంలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అంతర్గతంగా నిలదీశారు. ‘‘తెలంగాణపై ఎన్నోసార్లు హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని సోనియాగాంధీతోనే ఎన్నోసార్లు ప్రశ్నించాను. కాంగ్రెస్ అధిష్టానం తీరుతో విసిగిపోయి నాతో పాటు ఎంపీలం ఆ పార్టీకి రాజీనామా చేసినం. ఇప్పడు కూడా ప్రకటనే చేసింది తప్ప అమలు చేయలేదు. ఆ పార్టీని ఎలా నమ్ముతాం? మరోసారి మోసం చేయదని గ్యారంటీ ఏముంది? తెలంగాణ ఏర్పాటు కాకుండానే కాంగ్రెస్‌ను, ప్రకటనను అమలు చేయించలేని అసమర్థులను ఎందుకు అభినందిస్తున్నారు? తెలంగాణ జేఏసీలో ఉంటూ, ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన పార్టీలను కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కిరణ్ సర్కారును ఎందుకు మైనారిటీలో పడేస్తలేరు?’’ అంటూ కేకే సీరియస్‌గా ప్రశ్నించినట్టు తెలిసింది.