ఉద్యమ స్ఫూర్తి చాటిన జిల్లా వాసులు | Adilabad district people attend Telangana Sakala Jana Bheri | Sakshi
Sakshi News home page

ఉద్యమ స్ఫూర్తి చాటిన జిల్లా వాసులు

Published Mon, Sep 30 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

Adilabad district people attend Telangana Sakala Jana Bheri

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన సకల జనభేరి బహిరంగ సభకు జిల్లా తెలంగాణవాదులు జై కొట్టారు. ఉదయమే వాహనాల్లో పట్నానికి తరిలారు. సుమారు 25 వేల మంది వరకు జిల్లా ముద్దుబిడ్డలు జనభేరికి వెళ్లారు. రాజకీయ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ నేతలు, విద్యార్థులు, మహిళలు ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలివెళ్లారు. పలువురు వాహనాల ద్వారా వెళ్లగా.. మరికొందరు రైలు మార్గం గుండా హైదరాబాద్ పయనమయ్యారు.
 
 భారీగా తరలిన నేతలు..
 జనభేరికి బయల్దేరే ముందు ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఎదుట ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ప్రకటించి, ప్రక్రియ ప్రారంభంలో ఆలస్యం చేస్తున్న యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకు మాత్రమే ఒప్పుకుంటామని, మరే ప్రతిపాదనలు అవసరం లేదన్నారు. ఆదిలాబాద్ నుంచి వెళ్లిన వారిలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, వనజారెడ్డి, బీసీ వెల్ఫేర్ మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్‌ఎస్ జిల్లా పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, నాయకులు అడ్డి భోజారెడ్డి, సాజిదొద్దీన్, జేఏసీ అధికార ప్రతినిధి కారింగుల దామోదర్, తదితరులు ఉన్నారు. మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్, టీఎన్జీవో అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతిబాబు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు తదితరులు వేలాది మందితో వాహనాలు, రైళ్లలో హైదరాబాద్ తరలివెళ్లారు.
 
 శ్రీరాంపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి నుంచి కూడా పెద్దఎత్తున కదిలారు. నిర్మల్ నుంచి జేఏసీ జిల్లా కో కన్వీనర్ కొట్టె శేఖర్, టీఎన్‌జీవోస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోయినొద్దీన్, విద్యసాగర్, అటవీ శాఖాధికారులు సాగర్, సృజన్, మధుసూదన్, టీవీవీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఉపాధ్యాయ సంఘాలు, టీఆర్‌ఎస్ నాయకులు తరలివెళ్లారు. సారంగాపూర్, మామడ ప్రాంతాల నుంచి పలువురు వాహనాల్లో బయల్దేరారు. ఆసిఫాబాద్ నుంచి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొవలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పెందూర్ గోపి, బీజేపీ నాయకుడు భువనగిరి సతీశ్‌బాబుతో సహా 500 మంది వెళ్లారు. నార్నూర్ ప్రాంతం నుంచి 50 మంది వాహనాల్లో బయలుదేరారు. వాంకిడి, రెబ్బెన, జైనూర్, ఇచ్చోడ నుంచి టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములునాయక్ ఆధ్వర్యంలో వందలాది మంది వెళ్లారు.
 
 బోథ్ నుంచి జేఏసీ డివిజన్ కన్వీనర్ రావుల శంకర్, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ ముత్యంరెడ్డి, బెల్లంపల్లి నుంచి టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా సంయుక్త కార్యదర్శి జి.చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరి సంపత్ తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో సుమారు 200 మంది తెలంగాణవాదులు తరిలారు. భీమిని, నెన్నెల, కాసిపేట, చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మందమర్రి, కోటపల్లి, జైపూర్, రామకృష్ణాపూర్, ఖానాపూర్, కడెం, ఇంద్రవెల్లి, జన్నారం, ఉట్నూర్, ముథోల్, లోకేశ్వరం, కుంటాల, కుభీర్, తానూరు, బాసర, భైంసా, కాగజ్‌నగర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తెలంగాణవాదులు వెళ్లారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement