హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి 50 రోజులు గడచినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణా చేపట్టకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 29న నిజాం గ్రౌండ్‌లో జరిగే ‘సకల జన భేరి’కి భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గెజిటెడ్ అధికారులకు పిలుపు నిచ్చారు. స్థానిక తెలంగాణ గెజిటెడ్ భవన్‌లో ఆదివారం జరిగిన ప్రత్యేక సదస్సులో గౌడ్ ప్రసంగించారు. తెలంగాణపై 29లోగా కేబినెట్‌లో తీర్మానం చేయకపోతే మరో సమ్మె తప్పదని హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ప్రభుత్వమే నడిపిస్తోందని, కృత్రిమ ఉద్యమమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడే సమయంలో ఉద్యోగులుగా ఉన్నందుకు గర్వ పడాలన్నారు.