
దళితులను అవమానపరిచిన టిఆర్ఎస్:మంద కృష్ణ
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ దళిత నాయకులను అవమాన పరిచిందని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. దళితులను అవమాన పరిచే విధంగా సకల జనుల భేరి బహిరంగ సభను నిర్వహించారని ఆయన తీవ్ర స్ధాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ జెఎసి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అగ్ర కులాల వారికే ప్రాధానత ఇస్తున్నారన్నారు. దానికి మొన్న జరిగిన సకల జనుల భేరి సభ నిదర్శనమన్నారు. ఆ సభలో మంద జగన్నాథం, ఎంపీ వివేక్, విశ్వవిద్యాలయం దళిత విద్యార్థులకు ప్రాధన్యత కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
అదే విధంగా ఆంద్రోళ్లు అంతా ద్రోహులే అన్న కేసీఆర్ మాటలను ఖండించారు. తెలంగాణలో ఉన్న అందరూ తెలంగాణను కోరుకోవడంలేదు, ఆంధ్రలో ఉన్నవాళ్లంతా సీమాంద్రను కోరుకోవడంలేదన్నారు. ఈనెల 6న గుంటూరులో జరిగే అంబేద్కర్ సభను నిర్వహించకుండా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదన్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. గుంటూరులో సభ పెట్టి తీరుతామన్నారు. అయితే రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి ఉంటే తమకు అనుమతి ఇచ్చేవారు కాదన్నారు. కొత్తగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన దళితుడు ప్రసాద రావును అనుమతి కోరతామన్నారు. ఆయన తమను అనుమతి ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ ప్రసాద రావుకు మందకృష్ణ మాదిగ అభినందనలు తెలిపారు.