హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్, భద్రత, పౌర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాకూటమికే ఎమ్మార్పీఎస్ మద్దతని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గల్లంతవుతుందని తెలిసినా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని..ఈ ఎన్నికల్లో ఆమె బలపరుస్తోన్న ప్రజాకూటమికి ఓటువేసి కృతజ్ఞత చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మందకృష్ణ మాట్లాడారు. కేసీఆర్‌ను నమ్మి ఓటేస్తే నాలుగున్నరేళ్లు కుటుంబ పాలన సాగించి అన్ని వర్గాల ప్రజలను ఆయన మోసం చేశారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్ కుటుంబాన్ని ఓడించాలన్నారు. టీఆర్‌ఎస్ మంత్రిమండలిలో ఒక్క మహిళకు కూడా చోటివ్వకుండా వారిని అవమానించారని విమర్శించారు. అమరుల త్యాగాల ఫలితాలను కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుందన్నారు. బీఎస్పీ నేత మాయావతి అంబేడ్కర్, కాన్షిరాం దృక్పథంతో పనిచేయడం లేదని, కేవలం దళితుల్లో ఒక్క కులానికి మాత్రమే ఆమె నాయకత్వం వహిస్తూ కులవాదిగా మారారని ఆరోపించారు. ఎమ్మార్పీఎస్‌కు కులసంఘంగా ముద్ర ఉన్నప్పటికీ పౌర సమాజం కోసం అనేక పోరాటాలు చేసిందని తెలిపారు.
తమ్మినేని ముక్కు నేలకు రాయాలి
గన్‌పార్క్ వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముక్కు నేలకు రాసి, అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి సీపీఐ అండగా నిలబడితే..సీపీఎం మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమం వైపు నిలిచి 1,200 మంది బలిదానాలకు పరోక్షంగా కారణమైందన్నారు. అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే తెలంగాణలో తిరగాలని డిమాండ్ చేశారు. బీఎల్‌ఎఫ్ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటున్న తమ్మినేని దానికంటే ముందుగా తన పదవిని బీసీ వ్యక్తి కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు సోమయ్య, కార్యదర్శి బసవపున్నయ్య, ఆనందం, హెచ్‌యూజే అ«ధ్యక్షుడు చంద్రశేఖర్, నాగవాణి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాకూటమికే ఎమ్మార్పీఎస్ మద్దతు
Published Fri, Nov 30 2018 2:14 AM | Last Updated on Fri, Nov 30 2018 2:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment