
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం డిసెంబర్ 28న ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ అంశాన్ని టీఆర్‌ఎస్‌పైకి నెట్టి బీజేపీ తన బాధ్యతను విస్మరించొద్దని అన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్సీ వర్గీకరణపై వినతిపత్రం ఇవ్వాలని, ముఖ్యమంత్రి నేతృత్వంలో వెళ్లే అఖిలపక్షానికి సమయం ఇవ్వాలని కోరాలని సూచించారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యతను బీజేపీ పెద్దలే తీసుకోవాలని అన్నారు.
లక్ష ఉద్యోగాల మాటలు నీటిమూటలేనా అని బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ను ప్రశ్నిస్తున్నారని, అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ నేతల మాటలు కూడా నీటిమూటలేనా అని కృష్ణ మాదిగ ప్రశ్నించారు. వర్గీకరణపై బీజేపీ ముందుకు వెళ్లకపోతే కేంద్రంపై ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ పోరులో అసువులు బాసిన భారతి మాదిగ సంస్మరణ సభను డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 5వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరవధిక దీక్షలు, పార్లమెంట్ ముందు దీక్షలు చేపడతామన్నారు. 18వ తేదీన మాదిగ యువసేన ఆధ్వర్యంలో ఢిల్లీలో కవాతు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే 28వ తేదీన మాదిగ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ ముట్టడి కార్యక్రమం, జనవరి 3న మాదిగ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ‘ఢిల్లీ దిగ్బంధం’నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ ఉద్యమంలో ఎలాంటి ఘటనలు జరిగినా బీజేపీ పెద్దలే బాధ్యత వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment