టీఆర్‌ఎస్ అధికారం, సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు భ్రమల్లో ఉన్నారని, నిజం తెలుసుకుని కారుకు బ్రేకులు వేసే రోజులు త్వరలోనే వస్తాయని అన్నారు.
రెండు రోజులు ఢిల్లీలో ఉన్న సీఎం.. ఎస్సీ వర్గీకరణ పై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్ పదిసార్లు ఢిల్లీ వెళ్లారని, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలయిందని, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి 14 నెలలవుతోందని వివరించారు. కేసీఆర్‌కు మాదిగలపై ద్వేషం ఉందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా వర్గీకరణ ప్రస్తావన తేవడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న ఎనిమిది మంది మాదిగ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు భయపడి నోరెత్తడం లేదన్నారు.