
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. కేసీఆర్ ఎస్సీలను నియంతృత్వ పోకడలతో అణిచివేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. గురువారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోత్కుపల్లి మౌనదీక్షకు దిగారు. ఎస్సీ వర్గీకరణలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఈ దీక్షకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణను అరెస్టు చేయడం దారుణం అన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తాము కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని, ఆయన తమను అణగదొక్కాలని చూస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి కేసీఆర్ ఎప్పుడు తీసుకెళతారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే మందకృష్ణను విడుదల చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.