mothkupalli narsimhulu
-
టీఆర్ఎస్లోకి మోత్కుపల్లి..?
సాక్షి,యాదాద్రి : సీనియర్ టీడీపీ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెల రెండోవారంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరుతో మనస్తాపం చెందిన మోత్కుపల్లి ఇక ఆ పార్టీని వీడే యోచనలో ఉన్నారు. తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్ఎస్లో విలీనం చేయాలని గత మార్చి 18న మోత్కుపల్లి వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను దూరంగా పెట్టారు. పార్టీలో సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడైన మోత్కుపల్లి లేకుండానే హైదరాబాద్‌లో చంద్రబాబు పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీని తెలంగాణలో బతికించుకోవడానికి తాను అలా వ్యాఖ్యానించానే తప్ప వేరే ఉద్దేశం లేదని ఆ తర్వాత మోత్కుపల్లి మీడియాకు వివరించారు. అయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మోత్కుపల్లి ఇక పార్టీ మారడంపై సీరియస్‌గా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరగలేని రోజుల్లో మోత్కుపల్లి ముందుండి టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొన్నారు. అలాగే సీనియర్ నేత అయిన మోత్కుపల్లికి గవర్నర్ పదవీ వస్తుందంటూ గడిచిన మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. పదవీ రాకపోవడంతోపాటు పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయం మోత్కుపల్లిలో ఉంది. కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు మోత్కుపల్లి దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు. భువనగిరిలో జరిగిన మినీమహానాడులో మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు మోత్కుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, చంద్రబాబు దృష్టికి మోత్కుపల్లి విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు. అయితే సీనియర్ నేత అయిన మోత్కుపల్లిని మినీ మహానాడుకు రావాలని, పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతోనే ఆయన దూరంగా ఉన్నారని సమాచారం. ముహూర్తం వచ్చే నెలలోనే..? కొంత కాలంగా మౌనంగా ఉంటున్న మోత్కుపల్లి వచ్చేనెలలో టీఆర్ఎస్లో చేరబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈనెలాఖరులోగా జిల్లా స్థాయిలో టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి టీఆర్ఎస్లో చేరికకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూసిన మోత్కుపల్లి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో చెబుతున్నారు. ఆలేరు అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తూ ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్లో చేరిన తర్వాత తుంగతుర్తి అసెంబ్లీ, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని టీఆర్ఎస్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్కు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు మోత్కుపల్లిని కలిసి టీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో తెలుగుదేశంలో ఉండి అవమానం భరించే కంటే టీఆర్ఎస్లో చేరడమే మేలని అనుచరులు మోత్కుపల్లిని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే నెలలో మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరికకు సంకేతాలు కనిపిస్తున్నాయి. -
కంటతడి పెట్టిన మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. కేసీఆర్ ఎస్సీలను నియంతృత్వ పోకడలతో అణిచివేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. గురువారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోత్కుపల్లి మౌనదీక్షకు దిగారు. ఎస్సీ వర్గీకరణలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఈ దీక్షకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణను అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తాము కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని, ఆయన తమను అణగదొక్కాలని చూస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి కేసీఆర్ ఎప్పుడు తీసుకెళతారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే మందకృష్ణను విడుదల చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. -
మోత్కుపల్లి గవర్నర్ గిరి వెనుక...
నల్లగొండ : నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు 2014 ఎన్నికల్లో తిరిగి శాసనసభకు ఎన్నికయ్యేందుకు ఖమ్మం జిల్లా మధిరను ఎంచుకున్నారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం సీటు రిజర్వుడు నుంచి జనరల్‌కు మారడంతో ఆయన ప్రస్థానం తుంగతుర్తి నుంచి మధిరకు సాగింది. మామూలుగా అయితే ఆయనకు అంతకు ముందే రాజ్యసభ సభ్యత్వం కట్టబెడాతామని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారట. తీరా రాజ్యసభ ఎన్నికలకు వచ్చేసరికి సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల రీత్యా ఆయనకు అవకాశం దక్కలేదు... ఏం ఫరవాలేదని, శాసనసభకు పంపుతామని, టీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం లేని ఖమ్మం జిల్లా మధిర సీటు ఇస్తామని చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పారు... కానీ, అక్కడ మోత్కుపల్లి వారికి పరాజయం తప్పలేదు. మోత్కుపల్లి తనకు అన్యాయం జరిగిందని అగ్గిమీద గుగ్గిలమై పార్టీని వీడుతారేమోనని భావించి పార్టీ అధినేత మళ్లీ రాజ్యసభ సీటు ఆఫర్ చేశారట. అదీ దగ్గర పడుతోంది... 2016 మార్చిలో జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో ఏపీ నుంచి టీడీపీకి రెండు స్థానాలు వస్తాయి. ఇప్పుడేమో వాటికి బాగా పోటీ పెరిగింది. తెలంగాణకు చెందిన మోత్కుపల్లికి ఇవ్వడం సాధ్యం కాదేమోనని అధినేతకు అనుమానం వచ్చింది... అంతే మోత్కుపల్లికి గవర్నర్ పదవి అంటూ ఒక కొత్త పల్లవి అందుకున్నారు. -
మల్కాజిగిరిలో కేసీఆర్‌పై పోటీ చేస్తా: మోత్కుపల్లి
హైదరాబాద్, న్యూస్‌లైన్: మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్ నిలబడితే ఆయనపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని టీటీడీపీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. కేసీఆర్ మల్కాజిగిరి నుంచి పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలు నిజమో కాదో ముందు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేసి కేసీఆర్ చేసిన అన్యాయాలు, అక్రమాలు ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. -
రచ్చకెక్కిన...‘దేశం’ లొల్లి
మోత్కుపల్లిపై.. బాబుకు ఉమ ఫిర్యాదు తెలుగుదేశం విభేదాలు వీధిన పడ్డాయి.. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దే జిల్లా నేతల గొడవ తారస్థాయికి చేరింది.. సీనియర్ ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు మధ్య ప్రచ్ఛన్న పోరు సాగుతోంది. ఇపుడు తాజాగా రాజ్యసభ ఎన్నికలు వీరి మధ్య మరింత అగాథం సృష్టించాయి..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీడీ పీ నేతలు జంకుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ విషయంలో పార్టీ అనుసరించిన విధానంతో ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు ఎన్నికల్లో సొంత పార్టీ వారి నుంచే ఎదురుకానున్న అసమ్మతి రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని బలపరుస్తూ మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి ఇద్దరూ తమకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని పోటీలు పడి అధినేతను కోరారు. ఇక, ఉమామాధవరెడ్డి రాజ్యసభ సీటును ఆశించడం వెనుక బలమైన కారణమే ఉందని చెబుతున్నారు. భువనగిరి నియోజకవర్గంలో టీడీపీకి ఓటమి అనేది లేకుండా మాధవరెడ్డి.. ఆయన దుర్మరణం తర్వాత అతని సతీమణి ఉమామాధవరెడ్డి గెలుచుకుంటూ వస్తున్నారు. అయితే, ఇటీవల భువనగిరి నియోజకవర్గంలో కొందరు నేతలను ఎగదోసి, అసమ్మతి రాజేసి మోత్కుపల్లి న ర్సింహులు చికాకులు సృష్టిస్తున్నారన్న బలమైన అభిప్రాయానికి ఉమామాధవరెడ్డి వచ్చారని చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని పార్టీవర్గాల సమాచారం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తన వర్గాన్ని పెంచుకునేందుకు, తన అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు మోత్కుపల్లి ఓ ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతూ వస్తున్నారని అంటున్నారు. తానొక్కడినే కీలకనేతగా మిగాలన్న వ్యూహంతోనూ అందరికీ పొగపెడుతున్నారన్న ఆరోపణలూ లేకపోలే దు. ఈ రకంగానే సూర్యాపేట ఇన్చార్జ్ పదవిని ఆశించిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావును పార్టీ వీడేలా చేశారని ప్రచారంలో ఉంది. ఇపుడిదే ఎత్తుగడతో కోదాడ, నాగార్జునసాగర్, భువనగిరి నియోజకవర్గాల్లో గుంపుల కుంపట్లు రాజేస్తున్నారని టీడీపీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ చికాకులు భరించలేకకే ఉమ మోత్కుపల్లి తీరుపై బాబు కు ఫిర్యాదు చేశారని సమాచారం. ఆలేరు నుంచి తుంగతుర్తి నియోజకవర్గానికి వలస వెళ్లి సంకినేని మద్దతుతో గెలిచిన మోత్కుపల్లికి ఈసారి ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఆశాజనకంగా కనిపించకనే తనసొంత నియోజకవర్గం ఆలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారన్న వాదనా ఉంది. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీలు పడి, ఖర్చు లు పెట్టుకునే బదులు రాజ్యసభకు వెళితే ఏ బాదరాబందీ ఉండదన్న ఆలోచనతోనే ఆయ న బాబు వద్ద దరఖాస్తు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే, పార్టీకి ముందు నుంచీ విశ్వాసంగా ఉండి, భువనగిరి నియోజకవర్గాన్ని టీడీపీకి ఓటమి ఎరుగని కోటగా మలి చిన తమ కుటుంబానికి గుర్తింపునివ్వాలని, తనకే రాజ్యసభ సీటు ఖరారు చేయాలని ఉమసోమవారం చంద్రబాబును కోరినట్లు చెబుతున్నారు. ఇదే సందర్భంలో వివిధ నియోజకవర్గాల విషయంలో వేలుపెట్టి మోత్కుపల్లి పార్టీని ఎలా ఇబ్బందులు పాలు చేస్తోంది, తన నియోజవర్గంలో చికాకులు సృష్టించిందీ అధినేతకు వివరించినట్లు సమాచారం. మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలూ రాజ్యసభ సీటు ఆశిస్తుండడం, ఫిర్యాదుల పరంపరకు తెరపడక పోవడంతో, సార్వత్రి క ఎన్నికల ముందు ఇదేం గొడవరా బాబూ అని కార్యకర్తలు మదనపడుతున్నారు.