మోత్కుపల్లి గవర్నర్ గిరి వెనుక...
నల్లగొండ : నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు 2014 ఎన్నికల్లో తిరిగి శాసనసభకు ఎన్నికయ్యేందుకు ఖమ్మం జిల్లా మధిరను ఎంచుకున్నారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం సీటు రిజర్వుడు నుంచి జనరల్‌కు మారడంతో ఆయన ప్రస్థానం తుంగతుర్తి నుంచి మధిరకు సాగింది. మామూలుగా అయితే ఆయనకు అంతకు ముందే రాజ్యసభ సభ్యత్వం కట్టబెడాతామని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారట.
తీరా రాజ్యసభ ఎన్నికలకు వచ్చేసరికి సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల రీత్యా ఆయనకు అవకాశం దక్కలేదు... ఏం ఫరవాలేదని, శాసనసభకు పంపుతామని, టీఆర్‌ఎస్ ప్రభావం ఏ మాత్రం లేని ఖమ్మం జిల్లా మధిర సీటు ఇస్తామని చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పారు... కానీ, అక్కడ మోత్కుపల్లి వారికి పరాజయం తప్పలేదు. మోత్కుపల్లి తనకు అన్యాయం జరిగిందని అగ్గిమీద గుగ్గిలమై పార్టీని వీడుతారేమోనని భావించి పార్టీ అధినేత మళ్లీ రాజ్యసభ సీటు ఆఫర్ చేశారట. అదీ దగ్గర పడుతోంది... 2016 మార్చిలో జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో ఏపీ నుంచి టీడీపీకి రెండు స్థానాలు వస్తాయి. ఇప్పుడేమో వాటికి బాగా పోటీ పెరిగింది. తెలంగాణకు చెందిన మోత్కుపల్లికి ఇవ్వడం సాధ్యం కాదేమోనని అధినేతకు అనుమానం వచ్చింది... అంతే మోత్కుపల్లికి గవర్నర్ పదవి అంటూ ఒక కొత్త పల్లవి అందుకున్నారు.