
సాక్షి, రాజమండ్రి: ‘‘నైతిక విలువలను పక్కనపెట్టిమరీ వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించిన నాడు చంద్రబాబు దృష్టిలో గవర్నర్ దేవుడు! హోదా, విభజన చట్టాలపై కేంద్రంతో మాట్లాడుతానన్నప్పుడు ఇంకా మంచివారు. కానీ ఇప్పుడేమైంది? రాజ్యంగ పదవి అన్న ధ్యాస మర్చిపోయి గవర్నర్‌ను ముఖ్యమంత్రి అవహేళన చేయడం ఎంతవరకు సబబు? నరసింహన్‌పై చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక కారణాలేంటి? ఏమైనా భారీ గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారా?’’ అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వీర్రాజు.. ఏపీ సీఎం తీరుపై నిప్పులు చెరిగారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోరని విధంగా ‘ప్రజలే నన్ను రక్షించాల’ని చంద్రబాబు కోరడం విచిత్రంగా ఉందన్నారు. ‘‘బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజలే నన్ను రక్షించాలని అని చంద్రబాబు అనొచ్చా! ఆయనే అలా మాట్లాడితే రాష్ట్రంలో ప్రజలను కాపాడేది ఎవరు? బీజేపీని తీవ్రస్థాయిలో వ్యతిరేకించే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇలా మాట్లాడలేదు. అసలు చంద్రబాబు వ్యాఖ్యల వెనుక అర్థమేంటి? నిన్నటిదాకా గవర్నర్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సీఎం.. ఒక్కసారే యూటర్న్ తీసుకోవడానికి వెనుక కారణాలేంటి? ఏమైనా గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారా! దీని గురించి ప్రజలు ఆలోచించాలి, చర్చించాలి’’ అని వీర్రాజు వ్యాఖ్యానించారు.
(చదవండి: గవర్నర్ ఢిల్లీ పర్యటన; ఊహించని ట్విస్ట్)
గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారు: సీఎం
మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు ద్వారపూడిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి వ్యతిరేకంగా గవర్నర్ అన్ని పార్టీలను కూడగడుతున్నారని బాబు ఆరోపించారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్.. ఊహించని రీతిలో కార్యక్రమాలను రద్దుచేసుకుని బుధవారం ఉదయమే హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు.