
సాక్షి, అమరావతి: కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రత్యర్థి పార్టీలపైన, నాయకులపైన భౌతిక దాడులు సైతం చేయించే సంస్కృతి సీఎం చంద్రబాబుది అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల దర్శనానికి వచ్చిన అమిత్‌షాపై తిరుపతిలో టీడీపీ నాయకుల దాడిని వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఎన్టీ రామారావు పైనే చెప్పులు వేయించిన సంస్కృతి చంద్రబాబుదంటూ తూర్పారబట్టారు. జడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై దాడి చంద్రబాబు డైరక్షన్‌లో జరిగిందని ఆరోపించారు. దాడి చేసిన పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోలేదని.. నిరక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్ చేయకుండా శాంతివచనాలు పలుకుతున్నారని విమర్శించారు.
టీడీపీకి నిరసన తెలిపే అర్హతలేదు
ప్రత్యేక హోదా అంశంలో నిరసన తెలిపే హక్కు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం లేదని సోము వీర్రాజు అన్నారు. ప్యాకేజీని ప్రకటించిన కేంద్రానికి మద్దతుగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో రెండుసార్లు అభినందన తీర్మానం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పెట్టుబడిదారి ఉద్యమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్జీవో నేత ఒకరిని ఆరు మాసాల్లో నాయకుడిని చేశారన్నారు. తెలంగాణ ఎన్జీవో నేతలు ఆ రాష్ట్రానికి ఏం కావాలో అధ్యయనం చేసి పోరాడి సాధించుకున్నారని.. కానీ, ఇక్కడి ఎన్జీవో నేతలు ఏం చేశారంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను తిట్టడానికి ఒక నేతను కూర్చోబెట్టారని, ఆయన ఈ ఎన్జీవో నేతతో బెంగళూరులో ప్రత్యక్షమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో సైకిల్‌యాత్రలు ఫెయిల్ అయ్యాయన్నారు.
రక్షణ కల్పించలేని ఆయనకు ఓట్లేయాలా
సీఎం స్థానంలో ఉండి ప్రజలే తనకు రక్షణగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారని.. తనకే రక్షణలేని ఆయనకు 2019లో ప్రజలు ఓటు వేయాలా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.2లక్షల కోట్ల అప్పు, విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిపై రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరగాలని వీర్రాజు ఆకాంక్షించారు. చంద్రబాబు ఎటువంటి రాజకీయ ఆపేక్ష లేని వ్యక్తి అయితే రాష్ట్రంలో దాడి జరిగినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని.. ఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment