
సాక్షి, విజయవాడ: ‘‘‘ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపై భయానక రీతిలో రాళ్లతో దాడిచేస్తే ఒక్కరిమీదా కేసు పెట్టరా? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా?’’ అని మండిపడ్డారు ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. చంద్రబాబుకే గనుక నిజాయితీ ఉంటే తక్షణమే అమిత్ షాకు క్షమాపణలు చెప్పాలని, తిరుపతి ఎస్పీని సస్పెండ్ చేసి, దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
(చదవండి: అమిత్ షాపై రాళ్లదాడి)
రెచ్చగొట్టొద్దని అనం కానీ..: ‘‘రాజకీయాల్లో విబేధాలు సహజమే. బీజేపీని రెచ్చగొట్టొద్దని మేము అనడంలేదు. కానీ టీడీపీ విధానమేంటో చెప్పమని అడుగుతున్నాం. చంద్రబాబు డబుల్ స్టాండర్డ్స్‌ని ప్రశ్నిస్తున్నాం. మొన్నటిదాకా మాతో కలిసున్నారు. నిన్నేమో హీరో శివాజీని ఎగదోశారు. ఆయనకే కార్పొరేషన్ ఇచ్చారు. చలసాని శ్రీనివాస్‌తో ఏవేవో చేయిస్తున్నారు. నిన్న ఎన్జీవో నాయుడు అశోక్ బాబును తెరపైకి తెచ్చారు. పవన్ కల్యాణ్‌ను తిట్టినాయనతో కిలిపి అశోక్ బాబును బెంగళూరుకు పంపారు. రేపు ఇంకెవరినో తీసుకొస్తారు. ఏంటి? అసలేం జరుగుతోంది? ఎటు నుంచి ఎటు తిరుగుతున్నాయీ వ్యవహారాలు? పరిపాలనను పక్కన పడేసి, అస్తమానం నిత్యం రాజకీయాలే చేస్తూండటం వెనుక ఏదో కుట్ర ఉందని మా అనుమానం. ఇవన్నీ ప్రజలకు తెలియాలి.
చంద్రబాబు హిస్టారిక్ పర్సన్: 40 ఏళ్ల రాజకీయ జీవితమనే చంద్రబాబు డబుల్ స్టాండర్డ్స్‌పై ప్రజల్లో చర్చ జరగాలి. 2004లో మోదీని తిట్టిన ఆయన 2014లో బీజేపీతో పొత్తుకు వెంపర్లాడారు. ఇప్పుడేమో బీజేపీకి ఒక్క సీటు కూడా రావద్దని అంటున్నారు. ప్రజలిచ్చే తీర్పుపైనా ఈయనకు అసహనమే. నాలుగేళ్లుగా 1200 హామీలిచ్చారు. హోదా కంటే ప్యాకేజీనే గొప్పదని చెప్పారు. వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. అసలు నిరసన తెలిపే హక్కు టీడీపీకి లేనేలేదు. ఏపీలో బీజేపీకి ఒక్కసీటు కూడా రాకూడదు అనడమేనా మీ రాజకీయం! మాట్లాడితే జపాన్ తరహా ఉద్యమం అంటారు... అసలు భారతదేశంలో ఎలాంటి ఉద్యమాలు జరిగాయో ఈయనకు అవగాహన ఉందా? అందులో బీజేపీ పాత్ర ఏమిటో తెలుకునే మాట్లాడుతున్నారా? టీడీపీ ఒక కుట్రపూరిత దృక్పథంతో పనిచేస్తున్నదని అర్థమవుతోంది. ప్రజలంతా దీనిని గమనించాలని కోరుతున్నాం. ఏపీకి ప్రత్యేక హోదాతో కంటే ప్యాకేజీతోనే మేలు జరుగుతుంది. నిజంగా హోదా కాంక్ష ప్రజల్లో ఉంటే టీడీపీ సైకిల్ యాత్ర ఎందుకు విఫలమవుతుంది?’’ అని సోము వీర్రాజు అన్నారు.