గవర్నర్ ప్రోటోకాల్‌కు భంగం!
⇒ ఆయన ప్రసంగిస్తుండగా బయటకు వచ్చిన అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి
⇒ లోకేశ్ నామినేషన్ స్వీకరణతో వివాదం.. విమర్శలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ నరసింహన్ ప్రోటోకాల్‌కు తీవ్ర భంగం వాటిల్లింది. ఆయన సోమవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణ బయటకు వెళ్లిపోవడం వివాదంగా మారింది. ఎమ్మెల్సీగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ నామినేషన్‌ను స్వీకరించేందుకు ఆయనలా వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ఇది గవర్నర్‌ను అవమానించడమేనంటున్నారు. లోకేశ్ ఉదయం 10.39కి నామినేషన్ వేయడానికి రావాల్సి ఉన్నా ఆలస్యంగా వచ్చారు. నామినేషన్ ఫారాలపై సంతకాలు చేయించడం వంటి ప్రక్రియ పూర్తికావడానికి సమయం పట్టడంతో ముహూర్తం దాటిపోయిన తర్వాత ఇన్‌చార్జి కార్యదర్శి చాంబర్‌కు వచ్చారు.
అప్పటికే అక్కడ డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అందరూ కలసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన ఇన్‌చార్జి కార్యదర్శి రూములో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఆ తర్వాత నామినేషన్ ఫారాలను సత్యనారాయణకు అందజేసిన లోకేశ్ తదితరులు 11.09 నిమిషాలకు ముహూర్తం బాగుందని, అప్పుడు వచ్చి అధికారికంగా సమర్పిస్తామని చెప్పి బయటకు వచ్చేశారు. దీంతో సత్యనారాయణ సభ లోపలికి వెళ్లారు. 11.06 గంటలకు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం ప్రారంభించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే సత్యనారాయణ సభ నుంచి బయటకు వచ్చి తన చాంబర్‌కు వెళ్లారు. అప్పడు లోకేశ్ తదితరులు ఆయన చాంబర్‌కు వచ్చి అధికారికంగా నామినేషన్లు సమర్పించారు. లోకేశ్ ముఖ్యమంత్రి తనయుడు అయినంత మాత్రాన అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా సభ నుంచి బయటకు ఎలా వస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది గవర్నర్ ప్రోటోకాల్‌కు భంగం కలిగించడమేనని అంటున్నారు. మరోపక్క రిటర్నింగ్ అధికారి గదిలో లోకేశ్ పూజలు చేయడం కూడా వివాదంగా మారింది.
వివరణ కోరిన ఎన్నికల సంఘం: అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి కార్యాలయంలో లోకేశ్ పూజలు నిర్వహించడంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. కాగా తాను పూజ చేస్తున్నపుడు లోకేశ్ తదితరులు తన కార్యాలయం లోనికి వచ్చారని, తనతో కలసి పూజలో పాల్గొన్నారని సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా వివరణ పంపినట్లు సమాచారం.