చీరాల టీడీపీ సీటు ఆశిస్తున్న చేనేత సామాజిక వర్గానికి చెందిన నాయకులు
అందరికీ ఆశపెట్టి పంపుతున్న చంద్రబాబు, లోకేష్‌లు
రంగంలోకి మళ్లీ రజనీబాబా
చీరాల: చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంగా తయారైంది. పార్టీ అధిష్టానం ఆశావాహులందరికీ అనేక ఆశలు పెడుతోంది. ఇందులో చంద్రబాబు దగ్గరకు కొందరు వెళ్లి బీసీ కార్డు చూపుతుంటే మరికొందరు మాత్రం సామాజిక సమీకరణాల పేరుతో లోకేష్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రతి ఎన్నికల మాదిరిగానే చీరాల్లో టీడీపీ టికెట్ చివరి వరకు దోబూచులాడుతూనే ఉంది. తండ్రీ, కొడుకులు ఆశావాహులకు గంపెడాశలు పెట్టడంతో చీరాల్లో టీడీపీ మూడు వర్గాలు.. ఆరు ముఠాలుగా మారింది. రెండేళ్ల కిందట నుంచి కందుకూరు ప్రాంతానికి చెందిన ఎంఎం కొండయ్యను చీరాల టీడీపీ ఇన్‌చార్జిగా నియమించారు.
చీరాల టీడీపీ టికెట్ నీకేనని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతో అప్పటి నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కొండయ్యను విజయవాడ, హైదరాబాద్ తిప్పుతున్నారే కానీ టికెట్ ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే చేనేతలకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన మునగపాటి బాబు, సజ్జా హేమలత, మంగళగిరికి చెందిన తిరువీధుల శ్రీనివాసరావులు పట్టుబడుతున్నారు. చీరాల టికెట్ ఇస్తే చేనేతలకే ఇవ్వాలని శుక్రవారం రజనీబాబాతో కలిసి చంద్రబాబును కలిశారు. అయినప్పటికీ వారికి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సర్వేలు, ఆర్థిక బలాలు, కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ కబురు పెడుతామని, టికెట్ ఆశిస్తున్న బీసీ నేతలను తండ్రీ, కొడుకులు వెనక్కి పంపించారు.
తల పట్టుకుంటున్న ఆశావహులు..
అయితే అద్దంకికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, తనయుడు కృష్ణచైతన్య వైఎస్సార్ సీపీని వీడి చీరాల టీడీపీ కోసం ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా చీరాలలోని కొంతమంది ప్రముఖులు మాజీ మంత్రి పాలేటిని వెంటబెట్టుకుని కలుస్తున్నారు. దీంతో చీరాల సీటు ఓసీలకు ఇస్తారా? బీసీలకు ఇస్తారా? బీసీల్లోని చేనేత వర్గానికి ఇస్తారా? అని డోలాయమానంగా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డీఎస్పీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఓ అధికారి యాదవ సామాజికవర్గానికి సీటు ఇస్తే తనకే కేటాయించాలని చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ మాత్రం చీరాల నుంచి ఎవరూ పోటీ చేస్తారో అనే సందేహంతో నాయకులు, కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికి చీరాల టీడీపీ అభ్యర్థి వ్యవహారంలో చంద్రబాబు మైండ్ గేమ్ ప్రదర్శించడం చీరాల ఆశావాహులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా ఉంది. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చీరాలకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు, మాజీ ఎమ్మెల్యే చెంచుగరటయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment