
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. గత పది రోజులుగా జైలులో ఉన్న ఆయన ఈరోజు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు. అదే విధంగా మను ధర్మ చట్టాన్ని అవలంభిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్‌పై నిర్భంధ కేసులు నమోదు కాలేదని.. శాంతి యుతంగా ర్యాలీ నిర్వహిస్తే తమపై 20 కేసులు పెట్టారన్నారు.
దొరలకు ఒక చట్టం.. దళితులకు ఒక చట్టమా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే ఎమ్మార్పీఎస్ అండగా నిలిచిందని.. కానీ వర్గీకరణ కోసం శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే కేసీఆర్ తనను 10 రోజులు జైల్లో పెట్టారన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలని, లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. జనవరి 1 నుంచి 5 వరకు ఉపవాస దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.