సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వర్గీకరణ అంశంపై మాట్లాడేందుకు సీఎం ఇప్పటి దాకా ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మఖ్దూం భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యను పూర్తిగా గాలికి వదిలివేశారని, ఉద్యోగాల భర్తీపై బోగస్ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో స్థానిక సంస్థల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. గ్రామాల్లో ఘర్షణలు పెంచడానికి టీఆర్‌ఎస్ చూస్తోందని, ఆ రకంగా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు.
కేరళ తరహా పంచాయతీ రాజ్ చట్టాన్ని తయారు చేసి అమలు చేయాలని చాడ డిమాండ్ చేశారు. నెరేళ్ల ఘటన దళితులపై దాడులకు సంబంధించి ఈనెల 27వ తేదీన వారితో ముఖాముఖీ సంభాషిస్తామన్నారు. ఈ కేసులో వివాదస్పదంగా వ్యవమరించిన సిరిసిల్ల ఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ డైరీ బయటపెట్టాలని, లేదంటే తామే ఈ అంశంపై ఒక బుక్‌లెట్ తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడ, తక్షణం స్పందించని కారణంగానే ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణలు నెలకొన్నాయని ఆరోపించారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment