‘సకలం’ పయనం | Khammam district people attend Telangana Sakala Jana Bheri | Sakshi
Sakshi News home page

‘సకలం’ పయనం

Published Mon, Sep 30 2013 4:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

Khammam district  people attend Telangana Sakala Jana Bheri

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సకలజన భేరికి తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు భారీ ఎత్తున రాజధానికి తరలివెళ్లారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ప్రత్యేక రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లోప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన సకలజన భేరిని విజయవంతం చేసేందుకు ఉద్యోగవర్గాలతో పాటు న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్, బీజేపీ,  సీపీఐ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున వెళ్లారు. తొలుత జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణవాదులు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంక టపతిరాజు, ఖాజామియా మాట్లాడుతూ.. సకలజన భేరితో ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ బిల్లును ఆమోదిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రజల శాంతి పంథాను చూపామని, వెంటనే బిల్లు ప్రవేశపెట్టకుంటే పోరాట పంథాను చూపెడతామని హెచ్చరించారు.
 
 పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో...
 పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు జిల్లా పరిషత్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ...జై జై తెలంగాణ... భద్రాచలం తెలంగాణదే.... రాముడు అందరివాడు.. ప్రత్యేక రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి’ అని నినదించారు. కార్యక్రమంలో పీఆర్ ఉద్యోగ సంఘం నేతలు బనిగండ్లపాటి భానుమూర్తి, మల్లెల రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీనివాస్, మురళి, ఎస్‌కే గౌసుద్దీన్, రాజేష్, మీరా, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
 
 టీజీవోస్ ఆధ్వర్యంలో...
 తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి 5 బస్సులలో సకలజన భేరికి కదలి వెళ్లారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన డాక్టర్లు, ఎంపీడీఓలు, లెక్చరర్లు, ట్రెజరీ ఉద్యోగులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో హైదరాబాద్‌కు వెళ్లారు. కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె.ఖాజామియా, డాక్టర్ల జేఏసీ నాయకులు మదన్‌సింగ్, నారాయణ, మురళి, బాబురత్నాకర్, నాగేశ్వరరావు, ట్రె జరీ అధికారులు వై.వెంకటేశ్వర్లు, కృష్ణారావు, సారధి, ఎంపీడీఓల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, సన్యాసయ్య, ఉష పాల్గొన్నారు.  
 
 టీఎన్‌జీవో ఆధ్వర్యంలో...
 టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు ఆధ్వర్యంలో పలు అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు, ఉద్యోగులు భారీగా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు కె.కోటేశ్వరరావు, నందగిరి శ్రీను, వల్లోజు శ్రీను, సాగర్, రమణయాదవ్, లక్ష్మీనారాయణ, వీరనారాయణ, వినోద్, ఆర్‌అండ్‌బీ రమేష్, శ్రీను, విజేత, పుల్లమ్మ, వెంకటనర్సమ్మ, సరస్వతి పాల్గొన్నారు.
 
 న్యూడెమ్రోక్రసీ ఆధ్వర్యంలో.....
 సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఆధ్వర్యంలో ఖమ్మం డివిజన్ నుంచి 15 బస్సులలో సకలజన భేరికి తరలివెళ్లారు. పలువురు నాయకులు, కార్యకర్తలు రామనర్సయ్య విజ్ఞాన కేంద్రం నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడి నుంచి బస్సులలో హైదరాబాద్‌కు తరలారు. కార్యక్రమంలో నాయకులు జి.రామయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, రమేష్, రామారావు, శ్రీను, ఉపేందర్, రామ్మూర్తి ,పీవోడబ్ల్యూ నాయకులు స్వరూపరాణి, ఝాన్సీ, మంగతాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement