కాక రాజేసిన కేసీఆర్
ఉద్యమ కేసీఆర్ మరోసారి తన నోటికి పదును పెట్టారు. రెచ్చగొట్టడంలో ఘనాపాటిగా వర్తమాన రాజకీయాల్లో కీర్తించబడుతున్న కేసీఆర్- సకల జనభేరి వేదికగా కయ్యిమన్నారు. రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా ఆంధ్రా ప్రజలను ఘాటైన పదజాలంతో నిందించారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై అక్కసు వెళ్లగక్కారు. సీమాంధ్రుల పోరాటాన్ని చులకన చేసి మాట్లాడారు. సీమాంధ్ర ప్రజలు తమంతట తాముగా చేస్తున్న సమ్మెను హేళన చేశారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. అలాగే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
మీరొకటంటే నే రెండంటా తరహాలో కేసీఆర్ చెలరేగిపోయారు. 'లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే. ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ జరుగుతున్న సమైక్యాంధ్ర పోరు కృత్రిమమైందని కయ్యానికి కాలు దువ్వారు. తెలంగాణ ఉద్యమం కోడికూతలాగా సహజమైనదని, సీమాంధ్ర ఉద్యమం అలారం మోతలా ఎవరో కీ ఇస్తే తప్ప మోగదని వ్యాఖ్యానించారు.కొరడాలతో కొట్టుకోవడం, కోడి ఈకలు కట్టుకోవడం, గడ్డితినడం, సమాధుల మీద పడుకోవడం ఏం దిక్కుమాలిన ఉద్యమమని అని ఎద్దేవా చేశారు.
తాను పెద్ద ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్ మరో ప్రాంతంలో జరుగుతున్న పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజమని సీమాంధ్ర ప్రాంతంవారు ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం తనకిష్టం లేదన్నట్టుగా కేసీఆర్ వైఖరి ఉందంటున్నారు. కేసీఆర్ సంయమనం కోల్పోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. తెలంగాణ ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
పలువురు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనలా వ్యాఖ్యానించడం కాదని బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణ రావడం కేసీఆర్కు ఇష్టం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎవరేమన్నా తన పంథాలోనే కేసీఆర్ ముందుకు సాగుతున్నారు.