ఆంధ్రలో పుట్టినవారంతా తెలంగాణ ద్రోహులే: కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నష్టం పోయిందెవడు.. తెలంగాణ ప్రజలా? సీమాంధ్ర ప్రజలా? చెప్పండి అంటూ కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సకల జన భేరీలో భాగంగా నిజాం కళాశాలలో జరిగిన సభలో ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడారు. తొలుత ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్ తనదైన శైలిలో సీమాంధ్ర నాయకులపై విరుచుకుపడ్డారు. ఆంధ్రలో పుట్టినవారంతా తెలంగాణ ద్రోహులేనని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయా?, ఇంత వరకూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరి తరమైనా అయితదా? అని కేసీఆర్ సీమాంధ్ర నాయకుల్ని హెచ్చరించారు.
రాష్ట్ర విడిపోతున్న సమయంలో సమైక్యాంధ్ర అంటూ గగ్గోలు పెట్టడం ఉపయోగం లేదన్నారు. ఆంధ్రాలో అసలు మేధావులు ఉన్నరా?ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నరా? అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆంధ్రా ప్రజలు.. ఆంధ్రా వారే. తెలంగాణ ప్రజలు.. తెలంగాణే వారే. ఇక కలిసుండటం అనేది కలలో కూడా జరుగుతాదా ? అని సీమాంధ్ర నాయకులపై నిప్పులు చెరిగారు. ఆంధ్రాలో పుట్టిన వాడు ఆంధ్రా వాడే కానీ తెలంగాణలో లెక్కరాడని తెలిపారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఆపాలని యత్నిస్తున్నారన్నారు. అక్టోబర్ 7వ తేదీ దాటిన తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పని ముగిసినట్లేనని ఆయన తెలిపారు.
సీమాంధ్ర నాయకులు పెట్టిన పార్టీలన్నీ ఆ ప్రాంతానికి చెందినవే తప్పా.. తెలంగాణ పార్టీలు కాదని తెలిపారు. ఎంతమంది నాయకులు ఏకమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరితరం కాదన్నారు. ఈ సభను టీవీల్లో వీక్షించకుండా ప్రభుత్వం కరెంటు కట్ చేస్తూ దుశ్చర్యకు పాల్పడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.