తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, రాష్ట్ర విభజన కమిటీలోని సభ్యులు గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
విభజన కమిటీ కూడా.. విభజన ప్రక్రియను వివరించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, రాష్ట్ర విభజన కమిటీలోని సభ్యులు గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆయనకు వివరించాలని అధికారులు వెళ్లినా, సమయం లేని కారణంగా వారు ఆయనకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వలేదని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు అజేయకల్లం, పీవీ రమేష్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి కలిశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలుస్తున్న నేపథ్యంలో, విభజన కమిటీకి నేతృత్వం వహిస్తున్న అధికారులు కేసీఆర్‌ను కలిసి వాస్తవ పరిస్థితులను వివరించాలని నిర్ణయించుకున్నారు. అధికారులు వెళ్లే సమయానికి కేసీఆర్ ఇతరులతో సమావేశంలో ఉండడంతో ఆలస్యం జరిగినట్లు సమాచారం.
దీనితో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమీ ఇవ్వలేదని తెలిసింది. అయితే విభజన ప్రక్రియలో అపోహలు రాకుండా ఉండడానికి వీలుగా వీరు విభజన జరుగుతున్న తీరును కేసీఆర్‌కు మౌఖికంగా వివరించారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తుది నిర్ణయం ఇంకా జరగలేదని, ఇప్పుడు ఇస్తున్నది కూడా తాత్కాలిక కేటాయింపులు మాత్రమేనని.. రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత శాశ్వత కేటాయింపులు ఉం టాయని అధికారవర్గాలు కేసీ ఆర్‌కు వివరించినట్టు తెలి సింది. ఉద్యోగుల కేటాయిం పుల్లో తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలగరాదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. జూన్ 2 నాటికి సాధ్యమైనంతగా విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది.