మెదక్ ఎంపీగా కిషన్‌రెడ్డి పోటీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 2న కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకోవడంతో మెదక్ లోక్‌సభ స్థానానికి ఆయన రాజీనామా చేస్తున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థి ఎన్నికైన 18 రోజుల లోపు ఏదో ఒక స్థానానికి విధిగా రాజీనామా చేయాలి. ఆ గడువు కంటే ముందుగానే కేసీఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారు. దీంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చే 6 నెలల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డిని బరిలోకి దించాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది.
టీఆర్‌ఎస్ ఎవరిని బరిలోకి దించినా కిషన్‌రెడ్డి అయితేనే దీటుగా పోటీనివ్వగలమని బీజేపీ యోచన. కిషన్‌రెడ్డి కూడా పార్లమెంట్‌కు వెళితేనే మేలనే ఉద్దేశంతో ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని ఆశించినా బీజేపీ అధిష్టానం దత్తాత్రేయ వైపు మొగ్గుచూపిన విషయం తెలిసిందే.