హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఎందుకు పాల్గొనలేదో తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలని బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. దేశ ఐక్యతకు నిరంతరం కృషి చేసిన సర్దార్ పటేల్ జయంతిని దేశవ్యాప్తంగా రాష్ట్రీయ ఏక్తా దినోత్సవం’ పేరిట నిర్వహించాలని కేంద్రం, ప్రధాని మోదీ ప్రకటించినా అందులో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని ప్రశ్నించారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని సోమవారం అసెంబ్లీ సమీపంలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, జి. కిషన్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, పేరాల శేఖర్‌రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం లభించడానికి పటేల్ శక్తియుక్తులే కారణమన్నారు. పటేల్ కృషి లేకుండా తెలంగాణ లేదని, కేసీఆర్‌కు కూడా సీఎం అయ్యే అవకాశం ఉండేదా అని నిలదీశారు. ఈ అంశాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆత్మావలోకనం చేసుకోవాలని హితవుపలికారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలు, పార్టీలు జరుపుకుంటున్నా, మజ్లీస్ ఒత్తిడితో ఓట్ల రాజకీయాలకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని ప్రజలకు అర్థమైందన్నారు. ఇది ఆనాటి పోరాట యోధులను అవమానపరచడమేనని ధ్వజమెత్తారు.
ఇటువంటి సంకుచిత భావాల వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పటేల్ అకుంఠిత దీక్షతో దేశంలోని 500కు పైగా సంస్థానాలు విలీనమయ్యాయన్నారు. పటేల్ సరైన చర్య తీసుకోకుండా నిజాం నవాబ్ లొంగిపోయే వాడు కాదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడి ఉండేది కాదన్నారు. మురళీధర్‌రావు ప్రసంగిస్తూ దేశ ఐఖ్యత, అఖండతకు పటేల్ చేసిన సాహసోపేత చర్యలను అందరూ గుర్తుంచుకోవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. అలాగే బీజేపీ కార్యాలయంలోనూ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు నివాళులర్పించారు.
'సీఎం, మంత్రులు ఎందుకు పాల్గొనలేదు?'
Published Mon, Oct 31 2016 7:45 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM
Advertisement
Advertisement